ఊటీలో రూ.కోట్ల విలువైన స్థలాన్ని కొన్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రతినాయకుడిగా, సహ నటుడిగా కెరీర్ ప్రారంభించి స్వయంకృషితో మెగాస్టార్ అయ్యారు. తన కుటుంబ సభ్యులను కూడా పరిశ్రమకు పరిచయం చేశారు. 40 సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న చిరంజీవి ఈ క్రమంలో తన పారితోషికాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ వచ్చారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, డబ్బు విలువ తెలియడం, కష్టం విలువ తెలియడంతో ఎక్కడా రూపాయిని అజాగ్రత్తగా ఉంచలేదు. దురలవాట్లు లేకుండా డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ వచ్చారు.
పూర్తయిన రిజిస్ట్రేషన్ పనులు
నటుడు శోభన్ బాబు బాటలోనే తన పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టి స్థలాలను కొనుగోలు చేసేవారు. తాజాగా తమిళనాడులో ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీలో అత్యంత ఖరీదైన స్థలాన్ని కొండపై కొనుగోలు చేశారు. ఈ స్థలం మొత్తం ఐదున్నర ఎకరాలు. దీనిచుట్టూ టీ తోటలు, ప్రకృతి అందాలు, కొండపై నుంచి చూడటానికి అద్భుతమైన దృశ్యాలున్నాయి. దీనివిలువ రూ.16కోట్ల పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తిచేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ముందుగానే ఆ స్థలాన్ని చూసి ఓకే చేసిన తర్వాతే కొనుగోలు చేశారు.

ఫామ్ హౌస్ నిర్మించాలని..
ఈ స్థలంలో చిరంజీవి ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థద్వారా విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి సేదతీరడానికి, వేసవి కాలంలో విదేశాలకు వెళ్లే అవసరం రాకుండా కొన్నాళ్లు ఊటీలోనే ఉందామని భావిస్తున్నట్లు సమాచారం. చిరంజీవికి ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఖరీదైన బంగళా ఉంది. దీంతోపాటు బెంగళూరులో ఓ ఫామ్ హౌస్, విశాఖపట్నం, చెన్నై, గోవా తదితర నగరాల్లో సొంతంగా స్థలాలున్నాయి. వాటి విలువ రూ.వందల కోట్లల్లో ఉంటుంది. తమ అభిమాన హీరో రూపాయిని ఎప్పుడూ దుర్వినియోగపరచలేదని, జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ రావడంవల్లే లక్ష్మీదేవి ఆయన దగ్గరే నివసిస్తోందని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications