Unstoppable: అన్ స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య పొలిటికల్ పంచ్ ? తప్పుచేయలేదు, తలొంచమంటూ..
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న ఫన్ షో అన్ స్టాపబుల్ తాజా ప్రోమో రిలీజ్ అయింది. ఈ నెల 17నతో మొదలవుతున్న తాజా సీజన్ కు సంబంధించి ప్రోమోను ఆహా ఓటీటీ నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో బాలయ్య మార్క్ పంచ్ లు ఎప్పటిలాగే పేలుతున్నాయి. వీటితో పాటు ఏపీలో తాజా రాజకీయాలపైనా పరోక్షంగా బాలయ్య పంచ్ లు విసిరారు. దీంతో ఈసారి షో ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది.
ఏపీలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్, కస్టడీ, బెయిల్, కోర్టుల నిర్ణయాలు ఇలా సుదీర్ఘంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య తన అన్ స్టాపబుల్ తాజా షోలోనూ ఎక్కడా చంద్రబాబు పేరెత్తకుండా, ఏ కేసుల గురించి మాట్లాడకుండానే పంచ్ లు విసిరారు. తాజా ప్రోమో ప్రారంభం కాగానే బాలయ్య విసిరిన పంచ్ లు చూస్తే ఆయన ఎవరి గురించి వాటిని చెప్పారో ఇట్టే అర్ధమవుతోంది.

మేం తప్పుచేయలేదని మీకు తెలుసు, మేం తలవంచమని మీకు తెలుసు, మనల్ని ఆపడానికి ఎవరూ రాలేడనీ తెలుసు అంటూ బాలయ్య ఈ ప్రోమో ప్రారంభంలో చెప్పిన డైలాగ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే అనిపించింది అందాం, అనుకున్నది చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం అంటూ ఎప్పటిలాగే తనదైన శైలిలో బాలయ్య షో స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడి వరకే ఆగారా లేక షోలోనూ ఇలాంటి పంచ్ లు విసిరారా అన్నది మూడు రోజుల్లో తేలిపోనుంది.

ఈసారి అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఆహా తెస్తున్న ఈ షోలో బాలయ్య తన తాజా చిత్రం భగవంత్ కేసరి టీమ్ తో చిట్ చాట్ చేశారు. హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీలతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇందులో హల్ చల్ చేశారు. వీరితో కలిసి బాలయ్య పేల్చిన డైలాగ్స్, వేసిన స్టెప్పులు, వారికి విసిరిన పంచ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే ఈ షోపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications