నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. మోక్షజ్ఞ కంటే ముందే
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతోపాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు. రేపో మాపో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ రాబోతున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ వస్తున్నాడని, కథ సిద్ధమైందని, డైరెక్టర్ అతనే అంటూ రకరకాలుగా కథనాలు వచ్చాయికానీ అడుగు కూడా ముందుకు పడలేదు. దీనిపై బాలయ్య కూడా మాట్లాడాడు. ఇవన్నీ ఇలా ఉండగా మరో హీరో మోక్షజ్ఞ కంటే ముందే రాబోతున్నాడు.
నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ పెద్ద కుమారుడు తారకరామారావు. జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో ప్రమాదంలో హరికృష్ణ మరణించాడు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పెద్ద దిక్కుగా ఉన్నారు. కల్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే చిత్రంతోపాటు బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో తారక రామారావు నటించాడు. దీనికోసం సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి రేయ్ సినిమాతో భారీ డిజాస్టర్ ను వైవీఎస్ ఇచ్చారు. అది జరిగి తొమ్మిది సంవత్సరాలవుతోంది. ఎవ్వరూ ఈ దర్శకుడికి అవకాశం ఇవ్వలేదు. అటువంటిది ఈయన ఒక పవర్ ఫుల్ లవ్ స్టోరీద్వారా తారక రామారావును పరిచయం చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించబోతున్నారు. మోక్షజ్ఞ కంటే ముందే నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు సినీరంగంలోకి ప్రవేశిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దర్శకుడు వైవీఎస్ చౌదరి కావడాన్ని అభిమానులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి రేపో మాపో అంటూ రోజులు గడిపేస్తున్నారేకానీ అసలు సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని బాలకృష్ణ అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications