ఓటీటీ సంస్థల సంచలన నిర్ణయం
చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలకు ఒకప్పుడు మాత్రమే థియేటర్ల నుంచి ఆదాయం వచ్చేది. మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ తర్వాత కాలంలో వచ్చేవి. కాస్తో కూస్తో నిర్మాతకు చేదోడు వాదోడుగా నిలిచేవి. కరోనా పుణ్యమా అని ఓటీటీలు ఊపందుకున్నాయి. డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు మంచి లాభాలే వస్తున్నాయి.సినిమా కాంబినేషన్, బడ్జెట్, హీరో హీరోయిన్లతోపాటు డైరెక్టర్ కు ఉండే పేరును బట్టి కొన్ని ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ ధర చెల్లించి హక్కులను సొంతం చేసుకుంటున్నాయి.
డిజిటల్ రైట్స్ కోసం అంతర్జాతీయ, జాతీయ సంస్థలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, సన్... తదితర సంస్థల మధ్య పోటీ నెలకొంది. సినిమా హక్కుల కోసం ఇవి పోటీపడుతుండటం నిర్మాతలకు కలిసి వస్తోంది. అయితే ఇటీవలికాలంలో పోటీకి పోయి భారీగా వెచ్చించి కొనుగోలు చేసిన సినిమాలు బొక్కబోర్లా పడుతుండటంతో ఓటీటీ సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చాయి. తెలుగు సినిమాలను తక్కువ సంఖ్యలోనే కొనాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవల కొన్నిభారీ సినిమాలను, భారీగా వెచ్చించి కొనుగోలు చేశారు. వీటివల్ల కలిగిన నష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

విపరీతమైన హైప్ ఉన్న తెలుగు సినిమాలను దాదాపుగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ దక్కించుకునేవి. తెలుగు సినీ పరిశ్రమపై ఏడాదికి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నాయి. అంచనాలు తప్పి ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొనుగోళ్లలో స్పీడ్ తగ్గించాలని భావిస్తున్నాయి. దీనివల్ల సినిమా నిర్మాతల్లో కొంత టెన్షన్ పుడుతోంది.
ఓటీటీ అమ్మకాలతో వచ్చే డబ్బుతో కూడా కొందరు నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. సినిమా మీద పెడుతున్న పెట్టుబడి మొత్తం ఓటీటీ రూపంలో వచ్చేస్తుండగా, థియేటర్, శాటిలైట్ బోనస్ అనుకునేవారు. అయితే ఓటీటీ సంస్థల తాజా నిర్ణయంతో నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడంలేదు.












Click it and Unblock the Notifications