వివాహమైన తర్వాత మాజీ ప్రియుడికి ఫోన్...ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్!
వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ ప్రియులు సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ల కోసం సెర్చ్ చేయడం మొదలుపెడతారు. అయితే సరికొత్త కథలతో పాటు గతంలో వచ్చి విశేష ఆదరణ పొందిన క్లాసిక్ థ్రిల్లర్లకు కూడా ఓటీటీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో మొదటి వరుసలో నిలిచే మైండ్ బెండింగ్ క్రైమ్ మిస్టరీ మూవీ 'క్షణం'. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌ను థ్రిల్లర్ సినిమాల కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన ఈ చిత్రం విడుదలై దాదాపు పదేళ్లు కా వస్తున్నా, నేటికీ ఓటీటీ వేదికలపై సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
క్షణం - సినిమా హైలైట్స్
నటీనటులు: అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, సత్యదేవ్, వెన్నెల కిషోర్, దర్శకత్వం: రవికాంత్ పేరపు (కథ, స్క్రీన్‌ప్లే: అడివి శేష్).
సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థ: పీవీపీ సినిమా, ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.1/10 (నిడివి: 1 గంట 40 నిమిషాలు), ఓటీటీ ప్లాట్‌ఫామ్: సన్ నెక్స్ట్.
భారతదేశంలో మెడిసిన్ చదవడానికి వచ్చిన ఎన్నారై యువకుడు రిషి (అడివి శేష్), తన సహధ్యాయి శ్వేత (అదా శర్మ)తో ప్రేమలో పడతాడు. కానీ శ్వేత తండ్రికి ఈ సంబంధం ఇష్టం లేకపోవడంతో ఆమెకు బలవంతంగా కార్తీక్ (సత్యదేవ్) అనే వ్యక్తితో వివాహం జరిపిస్తాడు. ప్రేమ విఫలమైన బాధతో రిషి తిరిగి అమెరికా వెళ్లిపోతాడు. తీరా నాలుగేళ్ల తర్వాత.. పెళ్లై స్థిరపడిన శ్వేత నుంచి రిషికి ఒక అనూహ్యమైన కాల్ వస్తుంది. తన నాలుగేళ్ల కూతురు 'రియా' కిడ్నాప్ అయిందని, ఎంతమందికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని, సాయం చేయాలంటూ మాజీ ప్రియుడైన రిషిని వేడుకుంటుంది. శ్వేత కోసం ఇండియా తిరిగొచ్చిన రిషి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.

మైండ్ బ్లాక్ నిజాలు
ఏసీపీ చౌదరి (అనసూయ భరద్వాజ్) నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించిన రిషికి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఎదురవుతాయి. అసలు శ్వేతకు 'రియా' అనే కూతురే లేదని, ఆమె మానసిక స్థితి సరిగ్గా లేక లేని పాపను ఊహించుకుంటోందని భర్త, ఇరుగుపొరుగు, పోలీసులు స్పష్టం చేస్తారు. చివరికి తను ప్రాణంగా ప్రేమించిన రిషి కూడా తన మాట నమ్మడం లేదని భావించిన శ్వేత భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు శ్వేతకు నిజంగానే కూతురు ఉందా? ఉంటే ఆ చిన్నారిని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు? శ్వేత పిచ్చిదని సమాజమంతా ఎందుకు అబద్ధం చెప్తోంది? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అన్నది ఊహ కందని క్లైమాక్స్ ట్విస్టులతో సాగుతుంది.
రీమేక్స్ రాబట్టిన రీసౌండింగ్ హిట్!
సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను కథలో మమేకం చేస్తుంది. ముఖ్యంగా ఖాకీ దుస్తుల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా అనసూయ చూపించిన నటన, వెన్నెల కిషోర్ సీరియస్ రోల్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలవడమే కాకుండా.. హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా 'బాఘీ 2' పేరుతో, తమిళంలో సిబిరాజ్ హీరోగా 'సత్య' పేరుతో రీమేక్ అయి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కేవలం వంద నిమిషాల వ్యవధిలోనే అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని అందించే ఈ క్లాసిక్ మూవీ ఈ వీకెండ్‌కు థ్రిల్లర్ లవర్స్‌కి ఇది బెస్ట్ వాచ్.














Click it and Unblock the Notifications
