రోజూ స్మశానానికి పోతున్నాడు! ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్
పెళ్లై శోభనం గదిలోకి అడుగుపెట్టాల్సిన రోజు.. ఒక యువకుడికి తాను దారుణంగా హత్యకు గురవుతున్న భయంకరమైన కల వస్తుంది. కంగారుగా ఉలిక్కిపడి లేచి చూస్తే.. ఆ కలలో జరిగిన ప్రతి అణువూ నిజ జీవితంలో అచ్చు అలాగే పునరావృతమవుతుంది! కేవలం ఒక్కసారితో ఆగకుండా.. ప్రతీరోజూ రాత్రి అదే గదిలో దారుణ హత్యకు గురికావడం, తెల్లారేసరికి మళ్లీ అదే రోజు ఉదయానికి ప్రాణాలతో లేవడం జరుగుతుంటే ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉంటుంది?
ప్రతి 10 నిమిషాలకో ఊహకందని ట్విస్ట్‌తో నవ్వులు పూయిస్తూనే నరకం చూపిస్తున్న ఆ సినిమానే 'ధూమకేతు'. మలయాళ సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న ప్రయోగాత్మక చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలకు పక్కా కామెడీని మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దుమ్మురేపుతోంది.

కథేంటంటే..?
ఈ కథ కుట్టన్ (సజిన్ గోపు) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. తాను ప్రాణంగా ప్రేమించిన షర్మిల (నిఖిలా విమల్)ను పెళ్లాడి ఎంతో ఆశగా శోభనం గదికి వెళతాడు కుట్టన్. కానీ అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కేరళ గగనతలంపై నుంచి వెళ్లే ఒక వింత తోకచుక్క ప్రభావం వల్ల అక్కడ ఒక 'టైమ్-లూప్' ఏర్పడుతుంది. దీంతో కుట్టన్ జీవితం తలకిందులవుతుంది. ప్రతి రాత్రి ఒకేలా భయంకరంగా హత్యకు గురికావడం, మరుసటి రోజు ఉదయం మళ్లీ మొదటికే రావడం నిత్యకృత్యమైపోతుంది. శోభనానికి ముందే ప్రాణాలు పోతున్నాయని ఆ యువకుడు పడే టెన్షన్, ఈ కాల చక్రం నుంచి బయటపడటానికి అతను చేసే పిచ్చి ప్రయత్నాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే సీట్లో నుంచి కదలకుండా కూర్చోబెడతాయి. అసలు కుట్టన్‌ను ప్రతీరోజూ చంపుతున్న ఆ కిల్లర్ ఎవరు? ఈ టైమ్-లూప్ చిక్కుముడిని అతను ఎలా వీడారనేదే అసలు సినిమా.
ప్లస్ పాయింట్స్:
సజిన్ గోపు, నిఖిలా విమల్ నటన ఈ సినిమాకు ప్రధాన బలం. వీరితో పాటు గణపతి, మంజు పిళ్లై, షైన్ టామ్ చాకో తమ పాత్రలతో నవ్వులు పూయించారు. దర్శకుడు సుధీ మాడిసన్ ఎంచుకున్న క్లిష్టమైన టైమ్-లూప్ కాన్సెప్ట్‌ను ఎక్కడా బోర్ కొట్టించకుండా, చాలా సరదాగా వినోదాత్మకంగా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. ఇక అంకిత్ మీనన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జింటో జార్జ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాయి. థియేటర్లలో సరైన ఆదరణ దక్కక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.














Click it and Unblock the Notifications
