మారుతున్న జగన్, నెగ్గటం కోసం తగ్గుతూ - తాజా నిర్ణయం వెనుక..!!
మాజీ సీఎం జగన్ లో మార్పు కనిపిస్తోందా. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారా. 2024 లో 11 సీట్లకే పరిమితమైన జగన్ కొత్త వ్యూహాలతో పాటుగా కొత్త వ్యవహార శైలి తప్పదని డిసైడ్ అయి నట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా జగన్ తీరు లో వస్తున్న మార్పు రాజకీయంగా చర్చగా మారింది. 2024 ఎన్నికల్లో ఓటమి వైఫల్యాలను సమీక్షించిన జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తగ్గటం తప్పదని గ్రహించారు. దీంతో... జగన్ భవిష్యత్ నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
నెగ్గటం కోసం తగ్గాల్సిందే
మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తన ఓటమి.. వైఫల్యాలను సమీక్షించిన జగన్ ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళనకు సిద్దమయ్యారు. జగన్ వ్యక్తి గత.. పార్టీ నేతల వ్యవహార శైలి పైన కూటమి నేతలు చేసిన ప్రచారం వైసీపీ ఓటమిలో కీలకంగా పని చేసింది. జగన్ ఈ విషయాన్ని గ్రహించి కూటమికి అలాంటి అవకాశం మరోసారి ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ లీడర్లతో పాటుగా కేడర్ ను పట్టించు కోని ఫలితం ఎన్నికల్లో కనిపించింది. దీంతో.. ఇప్పుడు ప్రతీ సందర్భంలో తాను అధికారంలోకి వస్తే ఈ సారి కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. గతం కంటే భిన్నంగా అడిగిన వెంటనే నేతలకు అప్పాయింట్ మెంట్స్ ఇస్తున్నారు. కష్టాల్లో ఉన్న పార్టీ నేతలు.. కేడర్ కు ఫోన్ చేసి వెంటనే పరామర్శిస్తున్నారు. నేతలకు ఫోన్ లో అందుబాటులో ఉంటున్నారు.

ఓటమి నుంచి పాఠాలు
అదే విధంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నేతల నోటి దురుసు పార్టీకి భారీ నష్టం చేసింది. దీంతో.. ఇప్పుడు ఈ మచ్చ చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. నేతలు ఎవరూ దురుసుగా మాట్లాడవద్దని స్పష్టం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ పులివెందులలో పోలింగ్ రోజు జగన్ వ్యవహరించిన తీరు భిన్నంగా కనిపించింది. ఆవేశానికి లోను కాకుండా.. అధికారులతో వ్యవ హరించిన తీరు.. అధికార పార్టీని టార్గెట్ చేసిన విధానం పైన విశ్లేషకులు సానుకూల అభిప్రాయా లను వ్యక్తం చేసారు. ఇక.. తాజాగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత అంశాల పైనా ఎవరూ స్పందించవద్దని పార్టీ నేతలు.. కేడర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీలో కొంత కాలంగా సాగుతున్న వ్యక్తిగత దూషణలకు ముగింపు పలకటానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందనే అభిప్రాయం ఉంది. జగన్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి.
జనం కోరుకుంటున్నట్లుగా
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ వైవాహిక జీవితం పైన చేసిన విమర్శలు బూమ్ రాంగ్ అయ్యాయి. ప్రత్యేకంగా ఇక వర్గంలో వైసీపీ పైన ఆగ్రహం పెరగటానికి కారణం అయ్యాయి. పార్టీ నేతలు నోరు జారుతున్నా జగన్ కంట్రోల్ చేయటం లేదనే అభిప్రాయం వ్యాప్తి చెందింది. ఇదే సామాన్య ప్రజల్లోనూ ఆగ్రహానికి కారణమైంది. 2019 లో పాదయాత్ర సమయంలో జగన్.. ఇక, సీఎం అయిన తరువాత జగన్ లో వచ్చిన మార్పు సామాన్యులతో పాటుగా పార్టీ శ్రేణుల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి కి కారణమైంది. కూటమి నేతలు చేసిన విమర్శలను నాడు జగన్ ధీటుగా తిప్పి కొట్టలేదు. ముఖ్యమంత్రిగా కీలక సందర్భాల్లో ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వెల్లడించక పోవటం తో సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో.. జనంలో ఉంటేనే జగన్ కు ఆదరణ ఉందనే వాస్తవం మరిచి వ్యవహరించటం భారీ నష్టం మిగుల్చింది. దీంతో.. ఇప్పుడు తాను మారుతున్నాను అనే సంకేతాలు జగన్ ఇస్తున్నారు. జనం కోరుకుంటున్నట్లుగా జగన్ లో మార్పు వస్తుందా.. రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
