రాజీవ్ చివరి కోరిక తీర్చలేకపోయా.. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతోంది: సోనియా గాంధీ
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చివరి కోరికను నెరవేర్చలేకపోయాననే బాధ తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవిత జ్ఞాపకాలతో సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' అనే పుస్తకంలో భర్తను కోల్పోయిన నాటి హృదయ విదారక ఘటనలను ఆమె పంచుకున్నారు.
రాజీవ్ గాంధీ చివరి కోరిక.. సోనియా ఆవేదన
హత్య అనంతరం రాజీవ్ గాంధీ పార్థివదేహాన్నిచూసినప్పుడు తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆ విషాద సమయంలో తనకు అకస్మాత్తుగా ఓ విషయం గుర్తుకు వచ్చిందని వెల్లడించారు. తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లాగే మరణానంతరం తన కళ్లను కూడా దానం చేయాలని రాజీవ్ గాంధీ కోరుకునేవారని సోనియా గాంధీ వెల్లడించారు. భర్త చివరి కోరికనైనా నెరవేర్చాలన్న తపనతో పార్థివదేహాన్ని చూడగానే ఫ్యామిలీ డాక్టర్ మాథుర్ కోసం వెతకడం ప్రారంభించానని సోనియా వివరించారు.

వైద్యుడి ఆ మాటతో కుప్పకూలిపోయా: సోనియా గాంధీ
అక్కడే ఉన్న డాక్టర్ మాథుర్‌ను కలిసిన సోనియా గాంధీ.. రాజీవ్ కళ్లను దానం చేయవచ్చా అని ఆశగా అడిగారు. అందుకు డాక్టర్ ఇచ్చిన సమాధానం తనను లోలోపల పూర్తిగా కుంగదీసిందని సోనియా రాశారు. 'కళ్లా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆ భయంకరమైన బాంబు పేలుడులో ఏమీ మిగలలేదు. కళ్లు దానం చేసే ప్రసక్తే లేదు, ఇప్పుడు ఏమీ సాధ్యం కాదు' అని వైద్యుడు చెప్పడంతో మాటల్లో వర్ణించలేని షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. ఆ క్షణంలో తాను కూడా చనిపోవాలనే ఆలోచన మనసులోకి వచ్చిందని, అయితే కూతురు ప్రియాంక తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పిందని గుర్తుచేసుకున్నారు. జీవితాంతం కళ్లుముందే చూసుకున్న వ్యక్తి చివరి కోరికను కూడా తీర్చలేకపోవడం భరించలేని దుఃఖమని సోనియా వాపోయారు.
ముందే ఊహించిన రాహుల్ గాంధీ
తండ్రి భద్రతపై కుమారుడు రాహుల్ గాంధీకి హత్యకు రెండు నెలల ముందే ఆందోళన కలిగిందని సోనియా గాంధీ తన పుస్తకంలో వెల్లడించారు. ఓ పర్యటన సందర్భంగా.. "నాన్న భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే, త్వరలోనే ఆయన అంత్యక్రియలకు హాజరుకావాల్సి వస్తుందేమో" అని రాహుల్ తన అన్నారని పేర్కొన్నారు.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఓ మహిళ పూలమాల వేసే నెపంతో రాజీవ్ గాంధీ వద్దకు వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఆయనతో పాటు మరో 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం రాజీవ్ గాంధీకి ఉన్న ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకుని, కేవలం స్థానిక పోలీసులతో భద్రత కల్పించడం వల్లే ఈ దారుణం జరిగిందని సోనియా గాంధీ తన పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications
