ట్రెండ్ ఫాలో అవుతున్న పవర్ స్టార్.. " ఓజీ " డైరెక్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ !!!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొందుతూ.. మరోవైపు సినిమాల్లో కూడా భారీ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. పవర్ స్టార్ యాక్టింగ్, సుజీత్ స్టైలిష్ టేకింగ్, తమన్ మ్యూజిక్ కలిసి థియేటర్లను షేక్ చేశాయి. పవన్ ను ఎలా అయితే చూడాలని అనుకున్నామో అలానే చూపించారంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా గ్లామర్, నటనతో మెప్పించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అలాగే శ్రేయ రెడ్డి, శుభలేఖ సుధాకర్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి సినిమాకి మరింత బలం చేకూర్చారు. మొత్తానికి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఓవర్సీస్ లో కూడా పవన్ మార్కెట్‌ను మరోసారి నిరూపించింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. 'ఓజీ' సాధించిన అద్భుత విజయానికి గాను.. దర్శకుడు సుజిత్‌కు లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ కార్ల కంపెనీ లాండ్ రోవర్ కి చెందిన రేంజ్ రోవర్ కారుని సుజిత్‌కి గిప్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని సుజిత్ సోషల్ మీడియా వేదికగా అభిమనులతో పంచుకున్నాడు. అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేశారు.
ఈ మేరకు ఆ పోస్టులో.. తాను అందుకున్న బహుమతుల్లో ఇది అత్యుత్తమమైనదని సుజిత్ ఎమోషనల్ అయ్యారు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా, కృతజ్ఞతతో నిండిపోయానని.. తనకు అత్యంత ప్రియమైన ఓజీ కళ్యాణ్ నుండి ఇంత ప్రేమ, ప్రోత్సాహం దక్కడం మాటల్లో చెప్పలేని ఆనందం ఇచ్చిందన్నారు. చిన్ననాటి నుంచి ఆయన అభిమానిగా మొదలైన ఈ ప్రయాణంలో.. ఈ ప్రత్యేక క్షణం మరింత మధురమైనది అంటూ రాసుకొచ్చారు. జీవితంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానని పోస్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications