స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి
ఇమ్రాన్ హష్మీ సినిమా 'గ్యాంగ్‌స్టర్'లోని ఫేమస్ సాంగ్ 'యా అలీ' పాటను పాడి యువతలో పాపులర్ అయిన ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ ప్రాణాలు విడిచారు. అసోంకు చెందిన ఈ ప్రముఖ గాయకుడు సింగపూర్ లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన అకాల మరణంతో సంగీత ప్రపంచం, అభిమానుల్లో విషాదం నెలకొంది. జుబిన్ గార్గ్ మరణానికి దేశవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
స్కూబా డైవింగ్ ప్రమాదంలో జుబిన్ గార్గ్ దుర్మరణం
సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో జుబిన్ గార్గ్ ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సింగపూర్ పోలీసులు ఆయనను సముద్రం నుంచి రక్షించి, సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అత్యవసర వైద్య చికిత్స అందించినప్పటికీ, వైద్యులు ఆయనను రక్షించలేకపోయారు. జుబిన్ మరణం ఆయన అభిమానులను, అసోం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. భారతీయ సంగీత పరిశ్రమలో ఒక విషాదాన్ని మిగిల్చింది. జుబిన్ మరణంపై అసోం, నార్త్ ఈస్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. చాలా మంది తమ అభిమాన గాయకుడికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

జుబిన్ గార్గ్ సంగీత ప్రస్థానం
జుబిన్ గార్గ్ భారతీయ సంగీత పరిశ్రమలో ఓ కీలకమైన గాయకుడు. ఆయన అస్సామీ, బెంగాలీ, హిందీ భాషలలో పాటు కన్నడ, నేపాలీ, ఒడియా, సింధి, సంస్కృతం, ఖాసి, మణిపురి, ఇంగ్లీష్‌తో సహా మొత్తం 40కి పైగా భాషల్లో పాటలు పాడారు.
వ్యక్తిగత జీవితం
జుబిన్ గార్గ్ మేఘాలయలోని తురాలో ఒక అసోం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జుబిన్ మెహతా పేరు మీదు ఆయనకు పేరు పెట్టారు. ఆయన తండ్రి మోహిని బోర్‌ఠాకూర్ ఒక మేజిస్ట్రేట్ కాగా.. తల్లి ఈలి బోర్‌ఠాకూర్ ఒక గాయని. జుబిన్ సోదరి జోగ్కీ బోర్‌ఠాకూర్ ఒక నటి, ఆమె 2002లో కారు ప్రమాదంలో మరణించారు. జుబిన్ గార్గ్ 2002లో ఫ్యాషన్ డిజైనర్ గరిమా సైకియాను వివాహం చేసుకున్నారు. 1992లో జుబిన్ గార్గ్ ప్రొఫెషనల్ సింగర్ గా మారారు. జుబిన్ తన మొదటి వెస్ట్రన్ సోలో ప్రదర్శనకు గోల్డ్ మెడల్ సాధించారు. నవంబర్ 1992లో తన మొదటి అసోం ఆల్బం 'అనామిక'తో మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన మొదటి రికార్డెడ్ సాంగ్ 'తుమి జును పారిబ హున్'.












Click it and Unblock the Notifications