అయితే ఏం చేద్దామంటావ్ పూరీ: కేసీఆర్!!
ఛార్మి కౌర్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ తాజాగా వివాదాల్లో చిక్కుకుంది. ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ ఏం చేసినా అందులో ఏదో ఒక వివాదమో, లేదా సినిమా డిజాస్టర్ కావడమో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో సక్సెస్ సాధించిన ఓ సినిమా సీక్వెల్ గా మళ్లీ మరో సినిమాతో పూరి జగన్నాథ్ ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలోనూ వివాదం చోటు చేసుకోవటం పూరీకి షాక్.
మార్ ముంత చోడ్ చింత పాట వివాదం
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఇదే కాంబినేషన్లో వస్తున్న డబుల్ స్మార్ట్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్న వేళ తాజాగా ఈ సినిమాలో విడుదలైన రెండవ లిరికల్ సాంగ్ మార్ ముంతా చోడ్ చింత వివాదంలో చిక్కుకుంది. ఇది తీవ్ర విమర్శలకు కూడా దారి తీసింది.

కేసీఆర్ డైలాగ్ పై మండిపడుతున్న బీఆర్ఎస్
ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ "అయితే ఏం చేద్దమంటవ్ మరి".. పెట్టడంతో దీనిపైన పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతుంది. కల్లు దుకాణం వద్ద చిత్రీకరించిన ఈ పాటకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ ను ఉపయోగించడం ఆయనను అవమానించడమే అని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
కేసీఆర్ డైలాగ్ తో తెలంగాణ కల్చర్ ను, తాగుడు సంస్కృతిగా చిత్రీకరించారు
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో వివాదంగా మారిన పాటకు మణిశర్మ సంగీతం అందించగా, రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశాడు. మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ ను బాధ్యత రహితంగా ఈ పాటలో వాడటం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కల్చర్ ను, తాగుడు సంస్కృతిగా చూపించారని, కల్లు దుకాణం వద్ద ఉండే పాటలో కెసిఆర్ డైలాగ్ పెట్టడం క్షమించరాని తప్పిదమని మండిపడుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు, పూరీ ఇల్లు ముట్టడి హెచ్చరిక
తెలంగాణ మాజీ సీఎంను అందరూ కలిసి ఈ పాట ద్వారా అవమానించారని, పాటలో మాజీ సీఎం డైలాగ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ నుంచి కేసీఆర్ డైలాగ్ ను తీసేయకపోతే పూరీ జగన్నాథ్ ఇల్లు ముట్టడిస్తామని బిఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎంను అవమానించారంటూ దీనిపైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్బీనగర్ డిసిపి కి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications