యూత్‌కి కావాల్సిన మూవీ భయ్యా.. నవ్వులే నవ్వులు !!
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం 'పురుష:'. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మొదటి సినిమాతోనే హీరో, దర్శక, నిర్మాతలు విజయాన్ని సాధించారా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.
కథ..
గోవింద్ (పవన్ కళ్యాణ్), శ్రీను (కసిరెడ్డి), సత్తి (సప్తగిరి) చిన్నప్పటి నుంచీ క్లోజ్ ఫ్రెండ్స్. వీరితో పాటు క్రియేటివ్ కిస్సు అలియాస్ కిషోర్ (వెన్నెల కిషోర్) కూడా బాల్య స్నేహితుడే. గోవింద్, శ్రీను, సత్తి ఇలా ముగ్గురూ కూడా పెళ్లైన ఏడాదికే విడాకులు అంటూ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. గోవింద్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న కమల (రాయంచ), తన భర్త శ్రీనుకి ఉన్న సమస్యని తెలుసుకుని పెళ్లి చేసుకున్న గీత (విషిక) , బిజినెస్‌లో మొత్తం కోల్పోయినా కూడా సత్తి బాబు (సప్తగిరి)ని విడిచి పెట్టని లక్ష్మీ (హాసిని సుధీర్) ఎందుకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవుతారు? అసలు ఈ మూడు జంటల్లో వచ్చిన సమస్యలు ఏంటి? ఈ సమస్యలకు మూలమైన క్రియేటివ్ కిస్సు కథ ఏంటి? చివరకు ఈ మూడు జంటలు ఒక్కటయ్యాయా? లేదా? అన్నది తెరపై చూడాల్సిందే.

మూవీ విశ్లేషణ..
భార్యాభర్తల సమస్యలు, గిల్లికజ్జాలు, గొడవలు అనే కాన్సెప్ట్ ఎవర్ గ్రీన్. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఎన్నెన్నో క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. ఈ మధ్య ఇలాంటి ఫ్యామిలీ గొడవలతో ఓ చక్కని కుటుంబ కథా చిత్రం రాలేదు. అయితే డైరెక్టర్ మాత్రం థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఓ కుటుంబ కథా చిత్రాన్ని తీసే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సగటు పెళ్లైన మగాడు ఈ సినిమాకి కనెక్ట్ అవుతాడు. భార్యా భర్తలు ఈ మూవీని చూస్తే ఎక్కడో చోట రిలేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
మూడు జంటల్ని పరిచయం చేసిన తీరు, వారికి ఏదో సమస్య ఏర్పడిందని చెప్పకనే చెప్పేలా ఓపెన్ చేసిన సీన్స్ అన్నీ బాగుంటాయి. ఇక కోర్టులో వచ్చే వాయిదాలు, వారి కథని జడ్జ్ కొంచెం కొంచెంగా వినడం, ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయడం ఇలా అన్నీ బాగానే సాగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఓ ఇరవై నిమిషాల పాటు అద్భుతంగా నడుస్తుంది. అక్కడ వెన్నెల కిషోర్ చేత చేయించిన బ్లాక్‌కి థియేటర్లో అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఇక అక్కడ ఎమోషనల్ టచ్ ఇస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
సెకండాఫ్‌లో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, రోజితో లవ్ ట్రాక్ ఇదంతా కాస్త వింటేజ్ మోడ్‌లోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. రాజ్ కుమార్ జంపింగ్ డైలాగ్స్ ప్రతీ చోటా పేలుతాయి. ఇక సెకండాఫ్‌లోని హౌస్ హజ్బెండ్ అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లిన ఎపిసోడ్ కూడా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్‌లో భార్యాభర్తల బంధం గురించి చెప్పిన తీరు ఇలా అన్నీ బాగానే ఉంటాయి. అలా టోటల్‌లో ఓ ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ సినిమాని చూసిన ఫీలింగ్ అయితే ఆడియెన్స్‌కి వస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే..
- పవన్ కళ్యాణ్ కొత్త కుర్రాడు. అతనికి ఇదే మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చోట్ల మ్యానేజ్ చేశాడు. మొదటి సినిమాలోనే అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. డ్యాన్స్ కూడా పర్వాలేదనిపించాడు. యాక్టింగ్‌లో ఇంకాస్త మెరుగు పడాల్సి ఉందనిపిస్తుంది.
- వెన్నెల కిషోర్ ఎపిసోడ్ అదిరిపోతుంది. సప్తగిరి, కసిరెడ్డి సినిమాలో ఆద్యంతం నవ్విస్తూనే ఉంటారు.
- వీటీవీ గణేష్ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. అనంత శ్రీరామ్ కనిపించే నాలుగైదు సీన్లు బాగానే ఉంటాయి.
- మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పిస్తారు.
టెక్నికల్‌గా సినిమాని చూసుకుంటే..
- విజువల్స్ బాగానే ఉన్నాయనిపిస్తుంది. మ్యూజిక్ మెప్పిస్తుంది. అన్ని పాటలు తెరపై బాగానే ఉంటాయి. పెట్టిన ఖర్చుకి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టుగా ఉంటుంది.
- కొత్త నిర్మాతే అయినా ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదన్నట్టుగా కనిపిస్తుంది.
- భార్యాభర్తల బంధం గురించి చెప్పే డైలాగ్స్, కసిరెడ్డితో చెప్పించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నీ కూడా ఓకే అనిపిస్తాయి.
- నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
రెగ్యులర్ కథ, కథనాలతో వచ్చిన 'పురుష:' ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుంది. ఊహకందేలా సాగే కథనమే అయినా కూడా కామెడీ ట్రాక్‌తో ఎక్కడా బోర్ అనిపించకపోవచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, కామెడీ ఇలాంటి అంశాలను కోరుకునే ప్రేక్షకులకు 'పురుష:' మంచి ఆప్షన్‌గా ఉంటుంది.
రేటింగ్ : 2.75/5












Click it and Unblock the Notifications