AP Govt: ఉద్యోగుల e-SRపై ప్రభుత్వం కీలక నిర్ణయం- ఇకపై ఆ రికార్డులన్నీ..!
ఏపీలో లక్షలాది ఉద్యోగులకు చెందిన సర్వీసు రికార్డుల్ని ఎలక్ట్రానిక్ రూపంలో మార్చేందుకు వీలుగా ప్రభుత్వం (Ap Govt) ఈ-ఎస్ఆర్ ప్రక్రియ చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆన్ లైన్ లో లాగిన్ వివరాలు ఇచ్చి, ఆయా ఉద్యోగుల సర్వీస్ రికార్డును ఈ-ఎస్ఆర్ రూపంలో భద్రపరుస్తోంది. ఉద్యోగులు ఆన్ లైన్ లో నమోదు చేసిన వివరాలను ఉన్నతాధికారులు నిర్దారిస్తారు. దీంతో ఈ-ఎస్ఆర్ అందుబాటులోకి వస్తుంది. ఇలా ఈ-ఎస్ఆర్ అందుబాటులోకి వచ్చిన ఉద్యోగుల భౌతిక సర్వీస్ రికార్డులపై ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
e-SRలో పాత సర్వీస్ వివరాల నమోదు, డీడీఓ/హెచ్ ఆర్ మేనేజర్ ధృవీకరణ పూర్తయిన ఉద్యోగులకు ఇకపై భౌతిక సర్వీస్ రిజిస్టర్ (Physical SR) నిర్వహణ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ సర్కులర్ మెమో జారీ చేసింది. భవిష్యత్తులో ఉద్యోగుల సర్వీస్‌కు సంబంధించిన అన్ని వివరాలను తప్పనిసరిగా e-SRలోనే నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఇకపై ఉద్యోగుల భౌతిక రికార్డులన్నీ పూర్తిగా కనుమరుగు కాబోతున్నాయి.

రాష్ట్ర సచివాలయంలోని అన్ని పరిపాలనా విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, కార్యాలయాధిపతులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు, హెచ్ఆర్ మేనేజర్లు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ-ఎస్ఆర్ మాడ్యూల్ ద్వారా ఉద్యోగులు తమ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకుంటున్నారు. వీటిని పరిశీలించాక అధికారులు నిర్ధారణ చేస్తున్నారు. ఇందులో కొన్ని సాంకేతిక, పాలనా సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈ-ఎస్ఆర్ ను ఆన్ లైన్ లో అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి ఇచ్చిన గడువును కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతోంది. తాజాగా దీన్ని నవంబర్ 30 వరకూ పొడిగించారు. ఆ లోపు ఈ-ఎస్ఆర్ లో ఉద్యోగుల సర్వీస్ రికార్డుల నమోదుతో పాటు అప్జేట్ కూడా పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.














Click it and Unblock the Notifications
