చిరంజీవితోపాటు ఆ దర్శకుడు కూడా ఇండస్ట్రీకి దురదృష్టం!!
నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సుప్రీంహీరో చిరంజీవి నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయారు. తన కుటుంబం నుంచి అనేకమందిని వెండితెరకు పరిచయం చేశారు. మెగా అనేది వారి ఇంటిపేరుగా మారిపోయింది. చివరకు అందరూ మెగా కుటుంబం అని పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే పరిశ్రమలో చిరంజీవిని అభిమానించేవారుంటారు.. ద్వేషించేవారుంటారు. కొంతమంది సెలబ్రిటీలు కొన్ని కొన్ని సందర్భాల్లో చిరంజీవిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారు. అందుకు వారి కారణాలు వారికుండేవి.
బూతుకు, శృంగారానికి గీతను చెరిపేశారు
ఈ క్రమంలోనే గోరింటాకు, సీతామాలక్ష్మి, నారీనారీ నడుమ మురారి, జానకిరాముడు లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన యువచిత్ర ఆర్ట్స్ అధినేత కాట్రగడ్డ మురారి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమను చెడగొట్టినవారిలో చిరంజీవి, రాఘవేంద్రరావు మొదటివరుసలో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి వారిద్దరితో మురారికి విభేదాలున్నట్లు అర్థమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమకు బూతు అనే పదాన్ని పరిచయం చేసింది కూడా వీరిద్దరే అన్నారు. చిరంజీవి పిచ్చిపిచ్చి నృత్యాలు చేస్తూ, హీరోయిన్లతో శృంగారానికి, బూతుకు మధ్య ఉండే గీతను చెరిపేశాడని మండిపడ్డారు. రాఘవేంద్రరావు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదని, ఆయన దర్శకత్వం కూడా అదే తరహాలో ఉంటుందన్నారు.

వీరిద్దరూ విజయం సాధించడం దురదృష్టం
దురదృష్టం ఏమిటంటే పరిశ్రమలో వీరిద్దరూ విజయం సాధించడం అని మురారి వ్యాఖ్యానించారు. తాను జానకిరాము సినిమాను మూగమనసులు తరహాలో తీయాలనుకున్నానని, కానీ రాఘవేంద్రరావు విజయశాంతిని హీరోయిన్ గా పెట్టి సినిమాను చెడగొట్టాడని విమర్శించారు. అసలు చిరంజీవికి డైలాగులు చెప్పడమే సరిగా రాదని, హావభావాలు సరిగా పలకించలేడని, కానీ మెగాస్టార్ అయ్యాడన్నారు. అయితే చిరంజీవికి సంబంధించి ఒక మంచి విషయం ఉందని, ఆయనవల్ల ఏ నిర్మాతా నష్టపోలేదని కొనియాడారు. దీన్నిబట్టి చిరంజీవి విజయవంతమైన వ్యక్తి అన్నారు. చాలా తక్కువ స్థాయిలోనే నిర్మాతలు నష్టపోయారని, అధికశాతం మంది సక్సెస్ అయ్యారన్నారు.












Click it and Unblock the Notifications