పెళ్లి కాకపోయినా పర్లేదు.. తల్లిని కావాలనుకుంటున్నా: స్టార్ హీరోయిన్
ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల నటి సోహా అలీ ఖాన్ నిర్వహించిన 'ఆల్ అబౌట్ హర్' పాడ్‌కాస్ట్ ఎపిసోడ్లో తన ఆరోగ్యం, తీవ్రమైన పీరియడ్స్ నొప్పులు, సంతానోత్పత్తి అంశాలపై సంచలన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రుతి హాసన్.. తాను భవిష్యత్తులో పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని.. ఓ తల్లిగా మారాలనే కోరిక తనకు బలంగా ఉందని స్పష్టం చేశారు.
తనకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) సమస్యతో బాధపడుతున్నట్లు శ్రుతి హాసన్ వెల్లడించారు. "పీసీఓఎస్ ఉన్నందున మీరు సహజంగా గర్భం దాల్చడం చాలా కష్టం లేదా అసాధ్యం" అని చాలా మంది చిన్నప్పటి నుంచే తనకు చెబుతూ వచ్చారని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తులో గర్భం దాల్చలేనేమోనన్న భయంతో ఆమె ఇన్నాళ్లూ గైనకాలజిస్ట్‌ను కలవడానికి కూడా భయపడేవారట.

అయితే ఇటీవల ఓ వైద్యురాలిని సంప్రదించినప్పుడు తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చారు. ఆ డాక్టర్ ఆమె బయోలాజికల్ క్లాక్ పేరుతో భయపెట్టకుండా తల్లి కావడానికి ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను వివరించారు. అండాల భద్రత ప్రక్రియ ఓ ఆప్షన్ అని చెప్పినప్పటికీ.. అది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో ఒత్తిడితో కూడుకున్నదని శ్రుతి హాసన్ అభిప్రాయపడ్డారు.
ఏ క్షణంలోనైనా, ఏ మార్గంలోనైనా సంతానం పొందే అవకాశాలు ఉన్నాయని వైద్యురాలు ఇచ్చిన ధైర్యంతో శ్రుతి హాసన్ కాస్త ఊరట పొందారు. తాను పెళ్లి చేసుకున్నా లేకపోయినా, సమాజం విధించే నియమాలకు అతీతంగా పిల్లలను దత్తత తీసుకుని పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆ వైద్యుడితో జరిపిన సంభాషణ తన కళ్లు తెరిపించిందని, ఎలాంటి భయాలు లేకుండా తల్లి అయ్యే ఆశలను సజీవంగా ఉంచిందని శ్రుతి హాసన్ వెల్లడించారు.
మరోవైపు పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను శ్రుతిహాసన్ ప్రస్తావించారు. షూటింగ్ సెట్స్‌లో మహిళల ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పీరియడ్స్ పై సమాజంలో ఇంకా చాలా అపోహలు ఉన్నాయని శ్రుతి హాసన్ పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొనే నొప్పిని చాలాసార్లు సీరియస్‌గా తీసుకోరని ఆమె అన్నారు. ఈ క్రమంలో పురుషులకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండేదని.. అప్పుడు పీరియడ్స్ సెలవులను వర్క్ కాంట్రాక్టుల్లోనే రాసేవారంటూ సరదాగా వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications
