Vettuvam Movie: డూప్ లేకుండా స్టంట్స్... శోభితా ధూళిపాళపై పా రంజిత్ ప్రశంసలు
అక్కినేని నాగచైతన్య సతీమణి, హీరోయిన్ శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తున్నారు. తన ఇమేజ్, హోదాను బట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె తాజాగా నటిస్తోన్న మూవీ వేట్టువం. మద్రాస్, కబాలి, సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా గ్లింప్స్‌ను వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో విడుదల చేశారు.
లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ఎస్ సాయి దేవానంద్, ఎస్ సాయి వెంకటేశ్వరన్, పా రంజిత్‌లు నిర్మిస్తున్నారు. ఆర్య, వీఆర్ దినేష్, శోభితా ధూళిపాళ, కలైసారన్, మిమ్ గోపీ, గురు సోమసుందరం, షబీర్ కలరక్కల్, జాన్ విజయ్, సాయి ధీన, ఆనంద్ సామి, హరీష్ ఉత్తమన్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. రూపేష్ షాజీ సినిమాటోగ్రాఫర్‌గా, సెల్వ ఆర్కే ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ వెట్టువం మూవీ ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై హైప్‌ను పెంచుతోంది.

గతం, వర్తమానం, ఫ్యూచర్ ఇలా మూడు కాలాల మధ్యలో కథను నడిపించేందుకు పా రంజిత్ సిద్ధమయ్యారు. ప్రళయం తర్వాత భవిష్యత్తులో ప్రపంచం ఎలా మారుతుందనేది వేట్టువంలో చూపించనున్నారు. అలాగే అధికారం కోసం జరిగే పోరాటం.. జాతులు, తెగల మధ్య సంఘర్షణ చుట్టూ ఈ వేట్టువం కథ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రాచీన భారతీయ యుద్ధ విద్యలను పా రంజిత్ పరిచయం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన అడిమురైతో పాటు పలు కళలను ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఇందులో ధర్మరాజన్ పాత్రలో ఆర్య, సెంబియన్‌గా షబీర్ కల్లరక్కల్, వీరవర్మన్‌గా కలైయరసన్, రాధిగా శోభితా ధూళిపాళ కనిపించనున్నారని గ్లింప్స్‌లో తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో వెట్టువం ప్రేక్షఖుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నటి శోభితా ధూళిపాళపై దర్శకుడు పా రంజిత్ ప్రశంసలు కురిపించారు. శోభిత అద్భుతమైన నటి.. డూప్ లేకుండానే తన యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేశారు. ఆమె నటనను చాలాసార్లు చూశాను.. కలిసి పనిచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను, ఆమె కూడా నాతో పనిచేయాలని ఆసక్తిగా ఉండేవారు. చివరికి ఈ సినిమాతో సాధ్యమైంది. కెమెరా రిహార్సల్స్ కోసం మాత్రమే డూప్ లేదా స్టంట్ డబుల్స్ ఉండేవారు. కానీ చివరి ఆయా సన్నివేశాలను శోభిత స్వయంగా చేశారు. ఎందుకంటే మాకు ఆ సహజత్వం కావాలి, ఆమె కూడా నూరు శాతం అందించారు. వేట్టువంలో శోభితకు శారీరకంగా ఎదురైన సవాళ్లు.. ఒక పాత్ర కోసం సహజంగా చేసే సన్నద్ధతను మించిపోయేలా చేశాయని పా రంజిత్ ప్రశంసించారు.
ఈ సినిమాలో కొరియోగ్రఫి, యాక్షన్ సన్నివేశాల గురించి శోభితా ధూళిపాళ మాట్లాడుతూ.. కొన్ని సీక్వెన్స్‌ల స్థాయిని అందుకోవడానికి సాధారణంగా 15 నుంచి 20 ఏళ్ల సాధన అవసరమవుతుంది. కానీ షూటింగ్‌లో ప్రతిరోజూ మేము కష్టపడి ఆ సీక్వెన్స్‌లను చేశామని తెలిపారు.
కాగా.. పా రంజిత్‌తో కలిసి పనిచేయడం శోభిత కెరీర్‌లో మరో విశిష్టమైన అధ్యాయాన్ని సూచిస్తుంది. విభిన్నమైన పాత్రలు, దర్శకుల వైపు సహజంగానే శోభిత ఆకర్షితురాలు అవుతుంది. వేట్టువంతో ఈ పరిణామం మరో మలుపు తీసుకుంది. యాక్షన్‌తో కూడిన లీడ్ రోల్‌ను రంజిత్ ఆమెకు ఇచ్చారు. షూటింగ్‌లో శోభిత నిబద్ధతను ప్రశంసించడం, దానికి తోడు షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి స్వయంగా శోభిత వివరించడం, ఆ పాత్రకు జీవం పోయడానికి పడిన శ్రమ.. పా రంజిత్ సృష్టించిన ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.












Click it and Unblock the Notifications
