తెలంగాణాకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలలో వర్షాలు, ఎల్లో అలెర్ట్!
తెలంగాణా రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావం తో వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుండి సెప్టెంబర్ 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల వైపు కదులుతుందని భావిస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నేడు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ముఖ్యంగా సెప్టెంబర్ 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు మరియు అల్పపీడన ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ నాలుగు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, జనగామ, మెదక్ , ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని , ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. శుక్ర, శని వారాల్లో కూడా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వర్ష సూచన ఉందని తెలిపారు.
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications
