సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. కిలో ఏకంగా 70రూపాయలు!
ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. నిత్యం ఇంట్లో అవసరం అయిన ఉల్లిపాయలు కంట నీరు తెప్పిస్తున్నాయి. వంటగదిలో రోజువారీ వంటకాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉల్లిపాయల ధరలు ప్రస్తుతం ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఉల్లిపాయను కూరలో వెయ్యాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయాలు మరియు డిమాండ్‌కు తగినట్లుగా నిల్వలు అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ రిటైల్ మార్కెట్లు మరియు కూరగాయల దుకాణాల్లో మంచి నాణ్యత గల ఉల్లిపాయల ధర కిలో ఏకంగా రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. గతంలో రూ.100కు ఐదు కిలోలు లభించిన పరిస్థితుల నుంచి,ఇప్పుడు కేవలం ఒక్క కిలో కొనాలన్నా రూ.70 పైగా వెచ్చించాల్సి వస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉల్లిపాయలను కొనుగోలు చేయటానికి ఇబ్బంది పడుతున్నారు.

ఉల్లి సాగుచేసే ప్రాంతాల నుంచి మార్కెట్లకు సరుకు రాక తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వర్షాలు, రవాణా సమస్యల కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో డిమాండ్ కు తగ్గ సరుకు అందటం లేదు. ఫలితంగా హోల్‌సేల్ మార్కెట్లలోనే ధరలు ఊపందుకున్నాయి. దీని ప్రభావం నేరుగా రిటైల్ మార్కెట్లపై పడటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉల్లి ఘాటు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని వ్యాపార వర్గాలు కూడా చెప్తున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు ఉల్లిపాయల ధరల నియంత్రణకు కృషి చెయ్యాలని కూడా ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తుంది. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో పాటు, కూరగాయల ధరలు కూడా పెరిగాయి.
దీంతో సామాన్యులు కూరగాయలు కొనుగోలు చేయడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ధరల నియంత్రణకు ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని, రాయితీ ధరలపై రైతు బజార్ల ద్వారా ఉల్లిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications
