మమత బెనర్జీ బిగ్ యూటర్న్: ఊహించని ట్విస్ట్- పోటీ నుంచి తప్పుకొన్న తృణమూల్
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, అస్సాం అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల బరి నుంచి తృణమూల్ కాంగ్రెస్ తప్పుకొంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఆయా స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నిక బరి నుంచి తమ పార్టీ అభ్యర్థి సంచితా ప్రధాన్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆమె అధికారికంగా వెల్లడించారు. అంతకుముందే సంచిత ప్రధాన్.. రిటర్నింగ్ అధికారిని కలిసి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు కూడా. దేశంలో నిరంకుశ పోకడలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.

పార్టీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందటే ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తిప్పికొట్టడమే ధ్యేయంగా తాము ఉమ్మడిగా ముందడుగు వేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అడ్డుకోవచ్చని, తద్వారా లౌకిక శక్తులను బలోపేతం చేయడానికి మార్గం సుగమం అవుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార పక్షం అత్యున్నత రాజ్యాంగ పదవులను అగౌరవపరుస్తోందని, రాజకీయ కక్షసాధింపుల కోసం వినియోగించుకుంటోందని అన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే గా అభివర్ణించారు. ఒక రాజకీయ పార్టీ తన అహంకారాన్ని సంతృప్త పరచుకోవడం కోసమే ఇటువంటి ప్రజాస్వామ్య, చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
బీజేపీ.. దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని మమత బెనర్జీ ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించే జర్నలిస్టులను కూడా వదలట్లేదని, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ లల్లో ఎన్నికల ప్రక్రియ అపహాస్యానికి గురైందని, కేంద్రం ఓట్లను లూటీ చేసిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు శాశ్వతం కాదనే సత్యాన్ని గ్రహించాలని హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
