'గాయపడ్డ సింహం' ఫస్ట్ రివ్యూ: ఈసారి రచ్చ రంబోలనే..!
టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. 2016 లో పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టాడు. తొలి చిత్రంతోనే జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత 2018 లో ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక 2023 లో కీడాకోలా సినిమాకు దర్శకత్వం వహించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తరుణ్ భాస్కర్. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ సత్తా చాటాడు.
2018 లో మహానటి చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు పాత్రలో మెరిశాడు. అలాగే సమ్మోహనం, ఫలక్ నామా దాస్, మీకు మాత్రమే చెప్తా, మిడిల్ క్లాస్ మెలోడీస్, సీతారామం, దాస్ కా దమ్కీ, సంతానప్రాప్తిరస్తు, ఓంశాంతి శాంతి శాంతి లాంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన వైవిధ్యమైన నటనతో అలరించేందుకు వస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'గాయపడ్డ సింహం' ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 1 న విడుదల కానుంది.
'గాయపడ్డ సింహం' చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీలు హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి చాలారోజుల తర్వాత కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓఐ, హర్ష్ వర్థన్, శుభలేఖ సుధాకర్ లు కీలకపాత్రల్లో నటించారు. ఇక 'గాయపడ్డ సింహం' చిత్రాన్ని పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ కుమార్ బన్సాల్ లు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
సమ్మర్ కానుకగా మే 1వ తేదీన 'గాయపడ్డ సింహం' ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షోని తాజాగా కొంతమంది మీడియా ప్రముఖులు, సినీ సెలబ్రిటీలకు చూపించారు. వాళ్ల నుంచి వచ్చిన టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసే విధంగా ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు స్పష్టం అవుతోంది. అమెరికాలోని ఒక ఎన్ఆర్ఐ యువకుడు అక్కడి ప్రెసిడెండ్ ట్రంప్ పెట్టిన కొత్త రూల్స్ కారణంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక ఈ మూవీలో తరుణ్ భాస్కర్ అద్భుతంగా నటించాడని.. ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోందని టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కూడా మంచి రోల్ పడినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఫుల్ రివ్యూ కోసం రేపటివరకూ ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications