మోటార్ లేదు.. కరెంట్ లేదు.. కానీ జయశంకర్ జిల్లాలో అద్భుతం!
సాధారణంగా బోరు వేయించాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాలి. బోరులో నీరు పడినా దాన్ని పైకి తోడాలంటే మోటారు బిగించాలి. కరెంట్ లేదా డీజిల్ ఖర్చు భరించాలి. కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ గ్రామ శివారులో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అయితే ఎల్ నినో కారణంగా ఒకవైపు పంటలు ఎండిపోతుంటే.. ఇక్కడ మోటారు బిగించకుండానే నీరు పైకి ఉబికి వస్తోండడంతో ఈ ఘటనను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మూడు బోర్లు.. మూడింటి నుంచీ నీటి ప్రవాహమే!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పూసుకుపల్లి శివారు ప్రాంతంలో ఈ ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వర్షాకాలంలో సాగు అవసరాల కోసం తమ పొలాల్లో మూడు బోర్లు వేయించారు. అయితే, ఆ బోర్లకు ఇప్పటివరకు మోటార్లు ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ భూమి లోపల ఉన్న నీరు సహజ ఒత్తిడితో పైకి వస్తోంది. పైపుల నుంచి నీరు ఆగకుండా ప్రవహిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. బోర్లలో నీరు అడుగంటడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూసుకుపల్లి శివారులో మాత్రం మోటార్ల సాయం లేకుండానే బోర్ల నుంచి నీరు పైకి రావడం ప్రత్యేకంగా మారింది. సాధారణంగా బోరు నుంచి నీరు రావాలంటే మోటారు ఆన్ చేయాల్సిందే. కానీ ఇక్కడ అలాంటి అవసరం లేకుండానే నీరు పైకి వస్తుండటంతో ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ వింతను చూసేందుకు స్థానికులతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా అక్కడికి వస్తున్నారు. విద్యుత్ ఖర్చు లేకుండా నీరు అందుబాటులో ఉండటంతో రైతులకు సాగు పనుల్లో కొంత ఊరట లభిస్తోంది.
భూమి లోపలి ఒత్తిడే కారణమా?
భూగర్భంలో నీరు ఒత్తిడితో ఉండి, బోరు తవ్వినప్పుడు సహజంగానే పైకి రావడాన్ని ఆర్టీసియన్ పరిస్థితి (Artesian Condition) అంటారు. భూమి లోపలి నీటి పొరపై ఉన్న ఒత్తిడి కారణంగా మోటారు లేకుండానే నీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పూసుకుపల్లి శివారులోనూ ఇదే తరహా పరిస్థితి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, అక్కడి భూగర్భ నిర్మాణం, నీటి ఒత్తిడి, ప్రవాహానికి గల అసలు కారణాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
