'హనుమాన్'... అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని!!
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన హనుమాన్ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలున్నాయి. వాటికి తగ్గట్లుగానే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హీరో, దర్శకుడు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తోంది.
తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ అందించడంపై సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు. హిందీలో ఈ సినిమాకు అన్నీ హౌస్ ఫుల్ బోర్డులే పడుతున్నాయి. మొదటివారం ముగిసే సమయానికి రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

విదేశాల్లో 1.5 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకుంది. ఇక్కడ ఒక మిలియన్ డాలరే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఉంది. దాన్ని చాలా సులువుగా అధిగమించి పంపిణీదారులపై భారీ లాభాలను కురిపించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రోజురోజుకు థియేటర్లు పెరుగుతున్నాయి. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన మాతృభాష తెలుగులో మాత్రం ఈ సినిమాకు తగినన్ని థియేటర్లు లభించడంలేదు.
నైజాంలో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సినిమా విడుదలకు ముందుగానే థియేటర్ల యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వారెవరూ ఈ సినిమాను ప్రదర్శించకుండా గుంటూరు కారం సినిమాను ప్రదర్శిస్తూ ఒప్పందాన్ని అతిక్రమించారు. ఈ విషయాన్ని నిర్మాతల మండలికి మైత్రీ మూవీస్ పిర్యాదు చేసింది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థకు ప్రధాన పోటీదారుగా ఉన్న దిల్ రాజు గుంటూరు కారం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. దీంతో ఈ రెండు సంస్థల మధ్య ఉన్న పోటీతత్వం హనుమాన్ చిత్రానికి అన్యాయం చేస్తోంది.

హైదరాబాద్ లో 96 సింగిల్ స్క్రీన్స్ ఉంటే అందులో 90 వరకు గుంటూరు కారం మాత్రమే ప్రదర్శిస్తున్నారంటే అక్కడ థియేటర్లపై పట్టున్న దిల్ రాజు ఎలా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో కేవలం కొన్ని చోట్ల మాత్రమే హనుమాన్ సినిమా ఆడుతుండటంతో ప్రేక్షకులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. సరైన సంఖ్యలో థియేటర్లు లభించివుంటే బాక్సాఫీస్ లెక్కలు వేరుగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత హనుమాన్ సినిమా ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications