సీఎం రేవంత్‌రెడ్డికి ఇష్టమైన తెలుగు హీరో
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సినీ పరిశ్రమపై నిప్పులు చెరిగిన తర్వాత తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో హడావిడిగా సినీ ప్రముఖులంతా రేవంత్ రెడ్డితో, ఇతర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. పరిశ్రమకు సహకారం అందించాలని కోరారు. అన్నివిధాలుగా తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని, అయితే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇంతచేసినా ఫలితం దక్కలేదని సినీ పెద్దలు నిరుత్సాహపడుతున్నారు. త్వరలోనే పెద్ద సినిమాలు గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలన్నీ విడుదల కాబోతున్నాయి.
తన కళ్లముందే వారంతా పెరిగారు
తన కళ్లముందే అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా లాంటివారంతా పెరిగి పెద్దవారయ్యారని, ఎవరిపై తనకు వ్యక్తిగత ద్వేషం అంటూ ఉండదని, కేవలం తమ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసమే ఆలోచిస్తుందని చెప్పారు. ఇంతమంది హీరోలున్నప్పటికీ రేవంత్ రెడ్డికి ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు నెటిజన్లలో తలెత్తింది. పరిశ్రమపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న రేవంత్ రెడ్డి ఎవరి సినిమాలు ఎక్కువగా చూసేవారు, ఎవరంటే బాగా ఇష్టం అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇష్టమైన హీరోసూపర్ స్టార్ కృష్ణ.

నిర్మాతలను ఆదుకునేవారు
చిన్నప్పటి నుంచి తాను కృష్ణ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రేవంత్ వెల్లడించారు. ఒకటికి రెండుసార్లు కృష్ణ సినిమాలు చూసేవాడినని, నిర్మాతలు నష్టపోతే రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా తిరిగి ఉచితంగా సినిమా చేసిపెట్టి ఆ నిర్మాతను ఆదుకునేవారని, అటువంటి హీరోలు ఇప్పుడు ఎవరూ లేరన్నారు. సంవత్సరానికి 15 సినిమాలు చేసిన సందర్భాలు కూడా కృష్ణకు ఉన్నాయని, ఆయనవల్ల థియేటర్లన్నీ కళకళలాడేవని, అందులో పనిచేసేవారు, వ్యాపారాలు చేసేవారంతా బాగుండేవారన్నారు. అటువంటి పరిస్థితులు మళ్లీ రావాలని ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అప్పుడు కృష్ణ ఇష్టమంటే ఇప్పుడు కచ్చితంగా మహేష్ బాబును ఇష్టపడతారని, ఆయన మహేష్ బాబు అభిమాని అని ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications