ఊపిరి బిగబట్టే సస్పెన్స్..ట్విస్టుల మీద ట్విస్టులు..ఓటీటీలో అదరగొడుతున్న సినిమా
ఓటీటీ ప్రపంచంలో క్రైమ్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజే వేరు. అందునా యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు ప్రేక్షకులను ఇట్టే కట్టేస్తాయి. ప్రస్తుతం జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, సస్పెన్స్ ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సరికొత్త సిరీస్ 'తడయం' (Thadayam). విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్, 2026లో విడుదలైన అత్యుత్తమ ఇన్వెస్టిగేషన్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1999లో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగిన కొన్ని దారుణమైన హత్యల ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్లుగా ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ 17 నుండి 29 నిమిషాల లోపే ఉండటంతో, కేవలం 130 నిమిషాల్లో (ఒక సినిమా చూసినంత సమయంలో) మొత్తం మిస్టరీని ఛేదించేయొచ్చు.

కథలోకి వెళ్తే..
సరిహద్దు గ్రామాల్లో అర్ధరాత్రి పూట వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించడానికి ఎస్ఐ అధియమాన్ (సముద్రఖని) రంగంలోకి దిగుతాడు. అయితే, వృత్తిరీత్యా తోటి పోలీసుల అవమానాలు భరించలేక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని ఆయన భావిస్తున్న సమయంలో ఈ కేసు ఎదురవుతుంది. ఈ హత్యల వెనుక ఒక వింతైన తీరు ఉంటుంది. హంతకుడు కేవలం ఆడవాళ్ల మెడలోని తాళిబొట్టు, మగవాళ్ల మొలతాడు మాత్రమే దొంగిలిస్తుంటాడు. బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ముట్టుకోడు. అసలు ఆ హంతకుడు ఎవరు? అతడికి ఆ వస్తువులే ఎందుకు కావాలి? ఆ గ్రామాల్లో నెలకొన్న భయానక వాతావరణానికి అధియమాన్ ఎలా ముగింపు పలికాడు? అనేదే ఈ 'తడయం' కథాంశం.
ఎస్ఐ పాత్రలో సముద్రఖని పరకాయ ప్రవేశం చేశారు. అవమానాలు భరిస్తూనే, తన మేధస్సుతో కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా ఆయన నటన హైలైట్.తక్కువ నిడివి ఉన్నప్పటికీ, ప్రతి నిమిషం ఉత్కంఠను రేకెత్తిస్తూ కథ ముందుకు సాగుతుంది. 1990ల నాటి వాతావరణాన్ని, బోర్డర్ ప్రాంతాల్లోని పరిస్థితులను దర్శకుడు చాలా సహజంగా చూపించారు.మీరు తక్కువ సమయంలో ఒక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలని అనుకుంటే 'తడయం' బెస్ట్ ఛాయిస్. మలుపులు తిరిగే కథనం, ఊహించని క్లైమాక్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి.క్రైమ్ సీన్ వద్ద దొరికే చిన్న ఆధారం జీవితాలను ఎలా మారుస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications