టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత చిట్టిబాబు ఇకలేరు
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు, నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మరణం ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచేసింది. 71 ఏళ్ల వయసులో ఆయన ఆకస్మికంగా కన్నుమూయడం సినీ, రాజకీయ వర్గాలకు పెద్ద షాక్‌గా మారింది. తన అభిప్రాయాలు, ధైర్యంగా మాట్లాడే స్వభావం.. విభిన్నమైన వ్యక్తిత్వంతో చిట్టిబాబు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనతో కలిసి పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు ఆయనను స్మరించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఆకస్మిక మరణం..
కాగా బుధవారం రాత్రి ఛాతి నొప్పితో బాధపడుతున్న త్రిపురనేని చిట్టిబాబును కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆయనను రక్షించలేకపోయారు. గుండెపోటే మరణానికి కారణమని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

కుటుంబ నేపథ్యం..
చిట్టిబాబు ప్రముఖ రచయిత, నిర్మాత త్రిపురనేని మహారథి కుమారుడు. 1955 జూలై 28న కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించిన ఆయన అసలు పేరు వరప్రసాద్. చిన్ననాటి నుంచే సినిమాల వాతావరణంలో పెరిగిన ఆయనకు కళలపై ఆసక్తి సహజంగానే ఏర్పడింది. చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసి, సినీ రంగంలో అడుగుపెట్టారు.
దర్శకత్వ ప్రయాణం..
సినీ కెరీర్‌ను రచనశాఖలో అసిస్టెంట్‌గా ప్రారంభించిన చిట్టిబాబు, ప్రముఖుల వద్ద పని చేస్తూ అనుభవాన్ని సంపాదించారు. 1984లో వచ్చిన 'సంతానం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'నా పేరు దుర్గ', 'ప్రలయం', 'ప్రేమించి చూడు', 'రైతు భారతం' వంటి సినిమాలు తెరకెక్కించి తన ప్రతిభను చాటుకున్నారు. తనకు దర్శకుడిగా అవకాశం కల్పించిన వ్యక్తిగా మోహన్ బాబు పేరును ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా కో-డైరెక్టర్‌గా 49 సినిమాల్లో పనిచేశారు.
ఇక నటుడిగా కూడా పలు చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. 'భైరవ ద్వీపం', 'గరుడాచలం', 'జాంబీ రెడ్డి', 'జిన్నా' వంటి చిత్రాల్లో ఆయన నటన గుర్తుండిపోయేలా ఉంటుంది. నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలను రూపొందించి తనదైన ముద్ర వేశారు. అంతే కాకుండా సినీ పరిశ్రమకు కొత్త ప్రతిభలను అందించడంలో చిట్టిబాబు కీలక పాత్ర పోషించారు. ప్రముఖ నటి సౌందర్యను ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఆయన గొప్ప కృషిగా భావిస్తారు. అలాగే హాస్యనటుడు ఎంఎస్ నారాయణ వంటి వారిని కూడా పరిచయం చేశారు.
రాజకీయ రంగంలో చురుకైన పాత్ర..
మరోవైపు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చిట్టిబాబు తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట జనతా పార్టీలో చేరి, తరువాత భారతీయ జనతా పార్టీలో చురుకుగా పనిచేశారు. అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్.కే. అద్వానీ, ఎం. వెంకయ్య నాయుడు వంటి జాతీయ స్థాయి నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుడిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటితో పాటు పవన్ కళ్యాణ్, నటి సమంతపై ఆయన చేసిన విమర్శలు పెద్ద చర్చకు దారితీశాయి.












Click it and Unblock the Notifications