త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆ హీరో పాత్రలో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో విడుదల కాబోతోంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించగా రష్మిక, ఫహాద్ ఫజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రత్యేక గీతంలో శ్రీలీల నర్తించింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా? అంటూ అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై ఓ స్పష్టత వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడం ఖాయమైంది. దీన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.
భారీ బడ్జెట్ తో తీయబోతున్నారు
గుంటూరు కారం సినిమా ఘోర పరాజయం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా ముందుకు రాలేదు. ఇటీవలే వస్తున్నారు. బన్నీతో తీయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పై ఉన్నారని, ఇది దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. నిర్మాత బన్నీవాసు కూడా ఇటీవల ఈ విషయాన్ని చెప్పాడు. సినిమాను భారీ బడ్జెట్ తో తీయబోతున్నారు. బడ్జెట్ ఎంత అనేది ఇంతవరకు ఖరారు కాలేదు. బౌండెడ్ స్క్రిప్ట్ చేతికి వచ్చిన తర్వాతే దాని విషయం తెలుస్తుంది. మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తీస్తూ పాన్ ఇండియా కేటగిరిలోకి త్రివిక్రమ్ అడుగుపెడుతున్నాడు.

మైథలాజికల్ టచ్ ఇస్తున్న త్రివిక్రమ్
ఇప్పుడు తయారు చేస్తున్న కథకు మైథలాజికల్ టచ్ ఇచ్చారని, ప్రముఖ యోధుడు చెంఘిజ్ ఖాన్ చరిత్రను తీసుకొని కథను త్రివిక్రమ్ రూపొందించారని, దీనికి అనుగుణంగా సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. మంగోలియన్లను మొత్తాన్ని ఏకం చేసి అతి పెద్ద మంగోలియన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు చెంఘిజ్ ఖాన్. ఆయన జీవితంలో ప్రధాన ఘట్టాలను తీసుకొని కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించి మెప్పించారు. అదే తరహాలో త్రివిక్రమ్ తీసే సినిమాలో పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాఅయితే పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుందని, ఒకటే కథ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications