అల్లు అర్జున్‌ను నీడలా వెంటాడుతున్న వైసీపీ!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీడ వెంటాడుతోంది. అనాలోచితంగా వెళ్లారో? తన మామయ్యలు, ఇతర బంధువులకంటే స్నేహితులే ముఖ్యమని భార్యతో కలిసి నంద్యాల వెళ్లారోకానీ అక్కడి నుంచే బన్నీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అవసరమైతే ఎంతదూరమైనా వెళతారని, అందివచ్చిన ప్రతి సందర్భాన్ని తమ 'రాజకీయానికి' వాడుకుంటారనే నానుడి ఉంది. అటువంటిది శిల్పా రవిచంద్ర అల్లు అర్జున్‌ను వాడుకోవడంలో తప్పేముంది?.. రాజకీయం అంటే అలాగే ఉంటుంది. నంద్యాల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డికి తన గెలుపుపై అనుమానం వ్యక్తమై అది పెరిగి పెద్దదైంది. జనసేన ప్రభావం వల్ల తాను గెలవడం కష్టమనే అభిప్రాయానికి వచ్చారు.
బన్నీని బరిలోకి దింపిన శిల్పా రవిచంద్ర
దీంతో తన స్నేహితుడైన అల్లు అర్జున్ ను బరిలోకి దించారు. అయితే అల్లు అర్జున్ వెళ్లిన సమయం సరికాదు. ఏ పనిచేసినా సమయం, సందర్భం చూసుకొని చేయాలని మన పెద్దలు చెబుతుంటారు. కొన్ని చిన్న చిన్న పనులకైతే ఇది అవసరం ఉండదు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున తన తండ్రి అల్లు అరవింద్ తో సహా మెగా కుటుంబ సభ్యులంతా వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో తాను తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. దాన్ని బలప్రదర్శనలా, తన గెలుపునకు ఉపయోగపడే కార్యక్రమంలా తీర్చిదిద్దుకున్నాడు కిషోర్ రెడ్డి. కాలక్రమంలో అది అల్లు అర్జున్ కు ప్రధాన సమస్యగా మారింది. ఫలితాలు వచ్చాయి.. వైసీపీ ఓటమిపాలైంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

థియేటర్ లో వైసీపీ జెండాలు?
రోజులు అలా గడుస్తుండగానే 'పుష్ప2' విడుదల తేదీ రానే వచ్చింది. సంధ్య థియేటర్ లో నాలుగోతేదీ రాత్రి ప్రీమియర్ షో వేశారు. ఈ షోకు వెళుతూ అల్లు అర్జున్ శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిని తీసుకువెళ్లాడు. నంద్యాల నుంచి కొంతమంది అభిమానులకు ఆ షోకు రవిచంద్ర తరలించారంటూ ఆరోపణలు రావడంతోపాటు సినిమా షోలో కొన్ని వైసీపీ జెండాలు కనిపించాయని అభిమానులు చెప్పారు. రాజకీయ నాయకుడైన శిల్పా రవిచంద్ర ఈ విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడిదాకా తీసుకువెళ్లారో అర్థం చేసుకోవచ్చు.
పోలీసులను వ్యతిరేకం చేసిన నిరంజన్ రెడ్డి
అంతరకు చోటుచేసుకున్న పరిణామాలు ఒక ఎత్తయితే తర్వాత జరిగిన పరిణామాలు మరో ఎత్తు. కోర్టులో బెయిల్ కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిగత కేసులను వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డిని నియమించుకున్నారు. ఆయన మంచి లాయరే అయినప్పటికీ తన తెలివితేటలతో పోలీసులంతా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మారేలా మొత్తం సందర్భాన్నే మార్చేశారు. సినిమా హీరోలకు పోలీసు వ్యవస్థ వ్యతిరేకమైతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అనుభవమైన తర్వాతకానీ ఈ విషయంలో బన్నీకి ఓ స్పష్టత రాలేదు. బెయిల్ తెప్పించడం కోసం మొత్తం పోలీసు వ్యవస్థను అల్లు అర్జున్ కు నిరంజన్ రెడ్డి వ్యతిరేకం చేశారు. నంద్యాల వెళ్లినప్పుడే నాగబాబు పరాయివాడు అంటూ ట్వీట్ చేశారు. ఆ యుద్ధం మరింత ముదిరింది. చివరకు స్వయంగా బండి నడుపుకుంటూ చిరంజీవి, నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లేలా పరిస్థితులు తీసుకువచ్చాయి.
బన్నీకి చేటు చేస్తున్న అంబటి రాంబాబు
తాజాగా అంబటి రాంబాబు అల్లు అర్జున్ కు మరింత చేటు చేస్తున్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ, అతను తమవాడే అంటూ అన్నివర్గాలకు బన్నీని దూరం చేస్తూ ఒక్క వైసీపీవాడే అనేలా తమ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు. సోఫాలు పంపించాలంటూ అసందర్భమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 సినిమాలో తన ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకునేందుకు సోఫాలో డబ్బులు పెట్టి అల్లు అర్జున్ పంపిస్తుంటాడు. ఇప్పుడు అంబటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications