అమీర్ ఫనాపై గుజరాత్ గుర్రు
బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. రంగ్ దే బసంతీ తర్వాత అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ఫనా కూడా వివాదంలో చిక్కుకుంది. నర్మదా బచావో ఉద్యమ నాయకురాలు మేధా పాట్కర్‌ను సమర్థించినందుకు అమీర్ ఖాన్ నటించిన ఫనా చిత్రాన్ని ప్రదర్శించకూడదని గుజరాత్ మల్టిఫ్లెక్స్ యజమానుల సంఘం నిర్ణయించింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా వచ్చే శుక్రవారం విడుదల కానుంది. నర్మదా ప్రాజెక్టు విషయంలో అమీర్ ఖాన్ మేధాపాట్కర్‌ను బలపరిచినందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సంఘం అధికార ప్రతినిధి చిరాగ్ షా చెప్పారు.
ఫనాను గుజరాత్‌లోని మొత్తం 22 మల్టిఫ్లెక్స్ థియేటర్లలో దేనిలోనూ ప్రదర్శించరని ఆయన చెప్పారు. మంచినీటి సమస్య పరిష్కారాన్ని తీర్చే నర్మదా ప్రాజెక్టు నిర్మాణం కోసం గుజరాత్ ప్రజలు దీర్ఘకాలికంగా నిరీక్షిస్తున్నారని, అందువల్ల గుజరాత్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఫనాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన కాజోల్ నటించింది. కునాల్ కోహ్ల దర్శకత్వం వహించారు.
నర్మదా ప్రాజెక్టు విషయంలో మేధాపాట్కర్‌కు మద్దతు తెలిపినందుకు అమీర్‌ఖాన్ ఏప్రిల్‌లో కూడా గుజరాత్ ప్రజల ఆగ్రహాన్ని చవి చూశారు. వడదొరాలో అమీర్‌ఖాన్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు ఏప్రిల్‌లో దాడి చేశారు. ఈ ఆందోళన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా పాకింది. ఆందోళనకారలు అమీర్‌ఖాన్, మేధాపాట్కర్‌ల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అహ్మదాబాద్, సూరత్, తదితర ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు కూడా ఆందోళనలో పాలు పంచుకున్నారు. అమీర్‌ఖాన్ సినిమాలను బహిష్కరించాలని యూత్ కాంగ్రెస్, బిజెపి యువమోర్చా సంయుక్తంగా పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications
