• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బుర్రకథ పితామహుడు - నగ్నమునిఈ మధ్య మనం తెలుగు భాష ప్రాచీనత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటువంటి చారిత్రాత్మక సందర్భం యిన్ని శతాబ్దాల తర్వాతనయినా వచ్చినందుకు సంతోషం. ఈ ప్రాచీనతపై పరిశోధనలో జనజీవనంలో అట్టడుగున కూరుకుపోయిన మరిన్ని తెలుగు సంపదలు వెలుగు చూస్తాయని ఆశిద్దాం.అలాగే, భాషతో పాటు మన కళల అడుగుజాడల ప్రాచీనతలతోకి కూడా వెళితే మరెంతో సంపద మనకు సమకూరే అవకాశం వుంటుంది. తద్వారా భాష, కళల మూలాలు మరింత వివరంగా తెలిసే వీలు వుంటుంది. కళాకారులు యా పనికి పూనుకుంటారని ఆశిద్దాం. మూలాలు తెలిసిన జాతి పయనం పటిష్టమవుతుంది. అన్నింటిలోకి విలువైనది స్పష్టత. ఎలాగూ భాషపై ప్రారంభించాం కాబట్టి కళలపై కూడా పరిశోధన మరింత లోతుగా జరిగితే బావుంటుందని భావన. ఇదే సందర్భంలో ఒక విషయం ఆనందంగా చెప్పాలనిపిస్తోంది. ఇటీవల కొంత మంది మిత్రులు అంతరించిపోతున్న మన స్వదేశీ కళలు, క్రీడలు, సంస్కృతులను కాపాడుతూ, సామాజిక న్యాయసాధన దిశగా వాటిని ప్రోత్సహిస్తూ కవులు, కళాక్రీడాకారుల సంక్షేమం కోసం కృషి చేయడం ధ్యేయంగా పెట్టుకుని" - యక్షగానవేత్త బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్‌ నాజర్‌ పేర కళాక్షేత్రమనే ఒక వేదికను ఏర్పాటు చేశారు. వీరి ఆదర్శం గొప్పదే. అంతకంటే వీరిలోని గొప్పదనం యా కళాక్షేత్రాన్ని షేక్‌ నాజర్‌ పేర ఏర్పాటు చేయడం. నాజర్‌ పట్టుపరుపుల మీద పుట్టినవాడు కాదు. బంగారు ఉగ్గు గిన్నెతో పెరిగినవాడు కాదు. మెతుకులు ఏరుకుంటూ బతికినవాడు. అగ్రవర్ణాల నుండి కాదు, అల్ప సంఖ్యాక వర్గం నుండి వచ్చినవాడు. పేదరికం అసలు రంగు తెలిసినవాడు. యాయవారంతో గడప గడపకూ మారుతూ, జోలె పట్టుకుని నాట్యనాటక గానకళలు నేర్చినవాడు. పొట్టకూ కళకూ లంగరందక కూలిపన్లు చేస్తూ కిందపడుతూ లేస్తూ తన కళకు మెరుగులు దిద్దుకోవడం కోసం దేశదిమ్మరిగా తిరిగినవాడు. ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌. పద్మశ్రీ నాజర్‌ కళాక్షేత్రం అని యా వేదికను ఏర్పాటు చెయ్యడం నాకెంతో సంతోషం కలిగించింది. నాజర్‌ కొన్ని సినిమాల్లో బుర్రకథ చెప్పాడు. కొందరికి నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు ఎస్‌. రాజశ్వేర్‌ రావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంత ంసాధన చేస్తూ శోధనచేస్తూ కళను మరింత శోభాయమానంగా చేస్తూ ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం మూలాల్లోకి సాగించిన మహనీయుడు మన నాజర్‌. నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ వుంటుంది. ఆనాడు ఎస్‌. రాజశ్వేరరావు గారి కోరిక ప్రకారం నాజర్‌ సినీరంగంలో స్థిరపడి వుంటే ఎన్ని వందల వేల రికార్డులు తెలుగువారికి అందివుండేవో, ఎన్ని గంధర్వగాన సాగరాలు వుప్పొంగేవో, సరే. అది వేరే కథ. ఒక చోట కోల్పోయింది మరో చోట మరో రూపంలో గెలుపుకు నాంది అవుతుంది. నాజర్‌ అటు వైపు గాకుండా యిటువైపు రావడం వల్ల తన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు సంరక్షించుకుంటూ సంపూర్ణత వైపు ప్రయాణించడం వల్ల జనపదం మరింత విశాలమైంది. కళల అగాధం తెలుగువారికి అందుబాటులోకొచ్చింది. ఇదే సందర్భంలో రెండు గ్రంథాల గురించి ప్రస్తావించాలి. ఒకటి పింజారి - ఆయన ఆత్మకథ. రెండవది నాజర్‌ స్వీయ రచన జాతి జీవితం - కళా పరిణామం. ఇవి అద్భుతమైన గ్రంథాలు. రెండు సాహితీ సంఘటనలు. ఇంతకు ముందు చదివివనారు మరల మరల చదివాలి. ఇంతకు ముందు చదవనివారు తప్పనిసరిగా చదవాలి. నాజర్‌ ఆత్మకథ పింజారి చిన్న గ్రంథమే అయినా, తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్వడానికి ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చిందీ, అవగాహనా క్షేత్రం ఎంతగా విశాలం చేసిందీ వివరంగా చెప్పాడు. ఎవరు తనను మొదట్లో చేరదీసిందీ, అన్నం పెట్టిందీ విద్య నేర్పిందీ మహా పండితుల నుండి తనకంటే విద్యలో చిన్నవారైన వంతల నుండి తానేం నేర్చుకున్నదీ పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. ముఖ్యంగా బుర్రకథా గానంలో వంతగా వున్న రామకోటి నుండి తానేం నేర్చుకున్నదీ, అతను తననెంత వుత్తేజపరిచిందీ, అతని గొప్పతనం ఏమీటో చాలా చెప్పాడు. సాధారణంగా ఏ రంగంలోనైనా సరే ఒక స్థాయికి చేరుకున్నవారు, కీర్తి సంపాదించినవారు, తాము ఎవరి నుండి నేర్చుకున్నారో చెబుతున్నప్పుడు - తమ కంటే అన్నింటా, ముఖ్యంగా కీర్తిపదవుల వంటివాటిలో, పెద్దరికం చలాయిస్తున్న వారి గురించి చెబుతారే తప్ప చిన్నవారి గురించి చెప్పరు. నిజానికి ఈ చిన్నవాళ్లే వారి జీవితంలో మెట్లు ఎక్కడానికి సహాయపడిన వాళ్లు అయి వుంటారు. ఈ దృష్టితో చూసినప్పుడు పింజారిలొ నాజర్‌ పాటించిన విలువలు ఆశ్చర్యం కలిగిస్తాయి. గాన కళా గర్జనలో ప్రజల తరఫున నిలిచిన యుద్ధవీరుడిలా కనిపిస్తాడు. రెండవది - జాతి జీవితం - కళా పరిణామం. ఈ గ్రంథంలో నాజర్‌ చరిత్రకారుడిగా, మేధావిగా, పరిశోధకుడిగా విశ్వరూపంలో కనిపిస్తాడు. మావన పరిణామ క్రమం, సాంస్కృతిక చరిత్రల వెనక దాగి వున్న మరో పార్శ్వాన్ని ఆవిష్కరిస్తాడు. ఈ గ్రంథంలో నాజర్‌ చెప్పే విషయాల్తో చాలా మంది ఏకీభవించే అవకాశం లేదు. ఎందుకంటే చాలా అసత్యాలు పునాదులుగా చరిత్ర భవంతులు లేచాయి. ఆ భవంతులను యిప్పుడు కూల్చడానికి ఎక్కువ మంది ఒప్పుకోరు. అలాగే సామాన్యులు యిప్పటి వరకూ తాము నిజాలుగా నమ్ముతున్నవి అసత్యాలని అంగీకరించేందుకు సిద్ధంగా వుండరు. ఏది ఏమైనా నాజార్‌ ఈ గ్రంథం ద్వారా మన ముందుకు తీసుకువచ్చిన విషయాలు, ప్రతిపాదనలపై ఆరోగ్యకరమ్న చర్చ జరగవలసి వుంది. ఇది ఉత్తి గ్రంథం కాదు. తేనెతుట్టె. కదిలించడానికి సాహసం కావాలి. తన జీవితం జనజీవితంగా గడిపినందుకున, అత్యున్నత కళా ప్రమాణాలు సాధించినందుకు అరుదైన ఈ రెండు గ్రంథాలు మనకు అందించినందుకు షేక్‌ నాజర్‌కి జేజేలు పలకాలి. తెలుగు భాష, తెలుగు కళల మూలాలపై మరింత కాంతి ప్రసారానికి నాజర్‌ మార్గం, అనగా ఆలోచనారీతి ఉపయోగకరమేమో ఆలోచనాపరులు పరిశీలించాలి.

By Staff
|

దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more