తెలియని తెలంగాణ: 'చిరు' మంత్రాంగం

తెలంగాణ అంశం ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమే కాదు, స్వయం పాలనకు సంబంధించిన అంశం కూడా. తెలంగాణ సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్ర పాలకులు ఎప్పుడూ నడుం కట్టుకున్నట్లుగా మాట్లాడుతుంటారు. తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తామని, తెలంగాణను అభివృద్ధి చేస్తామని మాట్లాడుతుంటారు. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అదే మాట అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా అదే మాట అంటూ వస్తున్నారు. కనీసం ఇద్దరు నాయకులు రాజకీయ అవసరాల రీత్యానైనా వారు తెలంగాణలో పర్యటించారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఇప్పుడు తప్పకుండా తెలంగాణలో పర్యటించాల్సి వస్తుంది. ఈ పర్యటనలో ఆయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తి కలిగించే విషయమే.
తెలంగాణలో సినిమా పిచ్చి తక్కువ. సినిమాలు చూస్తారు గానీ వేలంవెర్రి ఉండదు. సినిమా నటులనూ చూస్తారు గానీ హద్దు మీరిన అభిమానం ప్రదర్శించరు. తెలంగాణలో ప్రజలు సమస్యలు ఎదుర్కుంటున్న మాట వాస్తవం. కానీ, ఇక్కడి ప్రజలు సామాజిక జీవితానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రజా సమస్యల కోసం జరిగిన పోరాటాలను, వాటిని నడిపే నాయకులను అభిమానిస్తారు. సినిమా నటులకు కూడా ప్రజా ఉద్యామాలను నడిపే నాయకులకు లభించే గౌరవం, ఆదరణ ఎక్కువగా ఉంటుంది. రాజకీయాలు ఈ దిశలోనే సాగుతాయి. చిరంజీవి తెలంగాణ పర్యటనకు వెళ్లే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణపై ఏం మాట్లాడుతారనే ఆసక్తి కోసమే తెలంగాణలో చిరంజీవి సభలకు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద యెత్తున కూడా రావచ్చు. అలా వచ్చే జనాన్ని చూసి తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా ఫరవా లేదనుకుంటే ఆయన పప్పులో కాలేసినవారే అవుతారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరనే విషయం తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా రాష్ట్రంలో మరెవరికీ తెలియదు. తాము అభిమానించే సినీ నటుడినో, మరొకరినో ప్రజా సమస్యలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజలు గెలిపించరు. ఎన్టీ రామారావును అభిమానంతోనే గెలిపించారనుకుంటే ప్రజారాజ్యం పార్టీ తప్పు చేసినట్లే అవుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ నినాదం కేవలం ఎవరో గుర్తించి ఇచ్చేది కాదని, స్వయం పాలన ద్వారానే వస్తుందని వారికి తెలుసు. ఈ విషయాన్ని కూడా చిరంజీవి తెలంగాణ పర్యటనలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications