• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'చిరు' తెలంగాణ మాయ

By కె. నిశాంత్
|

Chiranjeevi
పలు దాగుడు మూతల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొత్తుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీతో వచ్చే ఎన్నికల్లో జత కట్టాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా తెలుగుదేశం, సిపిఐ, సిపిఎంలతో ఏర్పడిన మహా కూటమిలో భాగస్వామి అయింది. ఇది ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ఏ మాత్రం మింగుడు పడడం లేదని అర్థం అవుతూనే ఉంది. ఆయన మాటలే ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. తెరాసతో పొత్తు కోసం చిరంజీవి తీవ్ర ప్రయత్నాలే చేశారని అనుకోవాల్సి ఉంటుంది. తెరాస కలిసి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన చిరంజీవి తెరాసపై విమర్శలకు దిగుతున్నారు. దీన్నే రోజా ఈ విధంగా అన్నారు - చిరంజీవి స్పందన ప్రేమించిన అమ్మాయిని రాకపోవడంతో నిరాశ చెందిన ప్రేమోన్మాది మాటల్లా ఉన్నాయి. అలా అనడం ఎక్కువ చేసి చెప్పడం కావచ్చు. కానీ చిరంజీవికి నిరాశ మాత్రం తప్పలేదని చెప్పవచ్చు.

తమ లక్ష్యం సామాజిక తెలంగాణ అని, అది నచ్చకనే తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమతో కలిసి రావడానికి ఇష్టపడి ఉండకపోవచ్చునని ఒక సన్నాయి నొక్కు నొక్కారు. తెలంగాణకు ప్రీఫిక్స్ ల గొడవ ఎక్కువే. ప్రజా తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ వంటి లక్ష్యాల కోసం కొంత మంది పని చేస్తూనే ఉన్నారు. ఈ స్థితిలోనే ముందు భౌగోళిక తెలంగాణను సాధించుకుందామని, ఆ తర్వాత ఇతర తెలంగాణల కోసం పోరాటాలు చేయవచ్చునని కెసిఆర్ మొదట్లోనే ఉన్నారు. తెలంగాణలు అలా ఉండగానే నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపి) నేత టి. దేవేందర్ గౌడ్ సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఈ నినాదాన్నే చిరంజీవి అందుకున్నారు. దీంతో చిరంజీవికి, దేవేందర్ మధ్య సాపత్యం కుదిరింది. ఇరువురు కలిసి పని చేయడానికి వీలు కలిగిందని అనుకోవాలి.

సామాజిక కోస్తా, సామాజిక రాయలసీమల వంటి మాటలు మాట్లాడకుండా సామాజిక తెలంగాణ అని మాత్రమే మాట్లాడడంలోని ఆంతర్యం ఏమిటనేది ప్రశ్న. సామాజిక న్యాయం జరగాలనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్న చాలా మంది మేధావులు కోరుకుంటున్నారు. అలాగే ప్రజాస్వామిక తెలంగాణనో, ప్రజా తెలంగాణనో వస్తే అంతకన్నా కావాల్సిందేమిటనేది కూడా ఉంది. కానీ అవి ఇప్పుడిప్పుడే సాధ్యమయ్యే విషయాలు కావని, ఈ లోగా తెలంగాణ పూర్తిగా నష్టపోకుండా, కనీసం పౌర హక్కుల పరిరక్షణకైనా, పౌర హక్కుల కోసం పోరాడే వెసులుబాటు కోసమైనా తెలంగాణ రాష్ట్ర సాధన అవసరమనే భావనను అంగీకరించడానికి చిరంజీవి గానీ, దేవేందర్ గౌడ్ గానీ సిద్ధంగా లేరు. అలా లేకపోవడానికి ఉండాల్సిన కారణాలున్నాయి.

తెరాస తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించే విషయంలో మావోయిస్టులకున్న కారణాలు మావోయిస్టులకున్నాయి. వారి వైఖరి వారికి ఉంటుంది. ఎవరి వైఖరి ఉండడం, ఇతర వైఖరులు ఉంటాయని అంగీకరించడం ప్రజాస్వామిక వైఖరి అవుతుంది. ఈ ప్రజాస్వామిక వైఖరిని గౌరవించాల్సి అవసరం ఉంటుంది. అయితే, ఇతర వైఖరులపై విమర్శలు చేయడం తప్పు కాదు. ఆ హక్కు మావోయిస్టులకు ఉంది. తెలంగాణ సాధన కోసం తాను ఒక విధానాన్ని ఎంచుకునే హక్కు కెసిఆర్ కు ఉంటుంది. అదే పని కెసిఆర్ చేశారు. రేపు ప్రజలే ఆయన వైఖరిపై తేల్చి చెబుతారు.

గతంలో సమైక్యాంధ్రకు కట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. తెలంగాణకు అనుకూలంగా చాలా ముందుకు వచ్చింది. అలా విధానాలు మార్చుకోవడం తప్పేం కాదు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా విధానాలు మార్చుకోవడం ముందుకు సాగడమే అవుతుంది. ఈ రీత్యానే కెసిఆర్ చంద్రబాబుతో కలిశారు. సామాజిక తెలంగాణ సాధన అంటున్న చిరంజీవి తెలంగాణ సాధనకు ఏం కొలికి పెడతారో అర్థం కాని పరిస్థితి ఉంది. అందువల్ల చిరంజీవితో పొత్తు కాంగ్రెసుతో పొత్తులా మారినా ఆశ్చర్యం లేదు. ఎన్నికల్లో గెలవడానికే చిరంజీవి తెలంగాణ అంశాన్ని అందుకున్నారనేది ఎవరికీ తెలియని విషయం కాదు. చంద్రబాబుది కూడా అదే ఉద్దేశం కావచ్చు. కానీ వీరిద్దరి వైఖరుల్లో ఎవరి వైఖరి తెలంగాణ రాష్ట్ర సాధనకు అనుకూలంగా ఉంది, దాన్ని సాధించడానికి వచ్చే ఎన్నికల్లో బలాబలాల తీరు ఎలా ఉంటుంది వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X