వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోల 'సమైక్యత' ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Mohan Babu
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు పడదు. వీరిద్దరూ ఇప్పుడు సమైక్య రాగం ఆలపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వచ్చేసరికి ఇద్దరిదీ ఒక్కటే రాగమైంది. వీరిద్దరిని కూడా తెలంగాణ ప్రజలు సినీ నటులుగా గుండెల్లో పెట్టుకుని ఆదరించారు. వారి సినిమాలను ఎంతో ఇష్టంగా చూశారు. తమవారిగా వారిని అక్కున చేర్చుకున్నారు. సమస్య వచ్చేసరికి నిజ జీవితంలో వారి సంకుచిత దృష్టిని బయట పెట్టుకున్నారు. మోహన్ బాబు సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేసి తన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు చరిత్ర తెలియదని మోహన్ బాబు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు అవగాన కల్పిస్తానని ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు కూడా నోరు మెదపని మోహన్ బాబు ఇప్పుడు తన అసలు రంగును బయటపెట్టుకున్నారు.

తెలంగాణకు ఉన్న చరిత్ర మోహన్ బాబు తెలియకపోవచ్చు గానీ ఇక్కడి ప్రతి చెట్టు పుట్టూ చరిత్రను చెబుతుంది. ఏది న్యాయమో,ఏది అన్యాయమో హేతుబద్దంగా వివరిస్తుంది. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ మేధావులు రాసిన చరిత్రను చదువుకున్నా, తెలంగాణ విద్యార్థులు, ప్రజలు ఆకళింపు చేసుకున్న చరిత్రను గమనించినా మోహన్ అంత ధైర్యంగా మాట్లాడి ఉండరు. ఒకవేళ తెలిసి కూడా అలా మాట్లాడుతున్నారంటే అది ఆధిపత్య ధోరణే అవుతుంది. ఆ ఆధిపత్య ధోరణితోనే తెలంగాణ ప్రజలుగ విసిగిపోయారు, వేసారిపోయారు. పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల సమైక్యతకు ప్రాణత్యాగం చేశారని మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్ర విభజనకు, రెండు ప్రాంతాల వేర్పాటుకు ఆయన ప్రాణత్యాగం చేశారనే విషయాన్ని ఆయన గమనించినట్లు లేరు. గమనించినా చరిత్రను వక్రీకరిస్తున్నారని అనుకోవాలి. ఈ వక్రీకరణే ఆంధ్ర వలస పాలకుల వల్ల, ఆధిపత్య వర్గాల వల్ల జరిగిందనే విషయాన్ని గుర్తించడం అవసరం. చెప్పాలంటే, పొట్టి శ్రీరాములు తెలంగాణవారికి ఆదర్సం గానీ కోస్తాంధ్ర వారికి కాదనే విషయాన్ని విస్మరించకూడదు. అందుకే పొట్టి శ్రీరాములును అవమానించవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. అలాగే కలిసి ఉందామని హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు బతిమిలాడాడని ఇంకో అబద్ధం తన హీరోయిజంతో చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా కొన్ని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రెండు ప్రాంతాలను కలిపారనే విషయం తెలంగాణలోని ప్రతి పోరడు చెబుతాడు. ఆ పెద్ద మనుషుల ఒప్పందం, తర్వాత ఇచ్చిన హామీలు, గ్యారంటీలు ఇవ్వలేదు కాబట్టి, వాటిని ఉల్లంఘించి మోసం చేశారు కాబట్టి విడిపోతేనే అవకాశాలు లభించి అభివృద్ధి చెందుతామని గత యాభై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మోహన్ బాబు చారిత్రక పరిజ్ఝానం గురించి, చారిత్రక అవగాహన గురించి, విశాల దృక్పథం గురించి మాట్లాడాలంటే చాలానే చెప్పవచ్చు.

ఇక చిరంజీవి విషయం మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మెజారిటీ ప్రజల అభీష్టం అంటున్నారు. ఆ అభీష్టం మేరకే తాను తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్న తీరును చూస్తే ఆయన మాట గుండె లోతుల్లోంచి రావడం లేదని, పైపై పెదవుల నుంచి మాత్రమే వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన ప్రజల గుండెలను దోచుకోలేకపోయారు. ఘోరంగా ఓటమి పాలయ్యారు. సామాజిక తెలంగాణ అనే మోసపూరిత విధానం వల్ల తెలంగాణ ప్రజలు ఆయనను అంతగా ఆదరించలేదనే విషయాన్ని ఆయన గమనించాలి. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సహా ఇతర కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల నిజాయితీ తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు తెలియక పోవచ్చు గానీ ప్రజలకు తెలుసు. అందుకే, తెలంగాణ ప్రజలు తెరాస, తెలుగుదేశం పొత్తును అంగీకరించలేదు. తెరాసను ఓడించి దెబ్బ తీయడానికి తెలుగుదేశం, వామపక్షాలు చేసిన ప్రయత్నాల గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం. చిరంజీవి మెజారిటీ అభిప్రాయమంటే ఏమిటో, తెలంగాణ ప్రజల మెజారిటీ అభిప్రాయం కాదా. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను కలిపితే తెలంగాణను మైనారిటీ చేస్తున్నారా చిరంజీవి. అదే నిజమైతే అది సంకుచిత దృష్టి అని చెప్పక తప్పదు.

పైగా, కలిసి ఉంటే అభివృద్ధి చెందుతామని చెబుతున్నారు. యాభై ఏళ్లుగా తాము నలిగిపోతున్నామని, తాము అభివృద్ధి చెందడం లేదని తెలంగాణ ప్రజలు ఒక్క గొంతై మొత్తుకుంటే అది వినిపించదు. ఇన్నేళ్లు సరే, ఇప్పటికైనా మీ సమస్యలు ఏమిటో చెప్పండి, పరిష్కరించే మార్గం వెతుకుదామని అనడం లేదు. ఇదెంత అన్యాయమో ఒక కుటుంబంలో తీవ్ర హింసకు, అణచివేతకు, అన్యాయానికి గురువుతున్న వ్యక్తికి అనుభవంలోకి వస్తుందే తప్ప కలిసి ఉందామని చెప్పేవాడికి రాదు. విడిపోదామని అంటున్నవాడిని వ్యతిరేకించడమంటే అందులో ఏదో దోపిడీ వ్యవహారం ఉందనే విషయాన్ని గుర్తించనంత తెలివి కూడా తెలంగాణ ప్రజలకు లేదనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X