• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనసులు విరిగిన తర్వాత...

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews
Telangana
లోకసత్తా అధ్యక్షుడు, శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణపై శానససభ ఆవరణలో దాడి సంఘటన మరోసారి తెలంగాణ సమస్యపైనే కాకుండా ఇరు ప్రాంతాలు కలిసి ఉండే విషయంపై కూడా కొత్త చర్చ ప్రారంభమైంది. శాసనసభ ఆవరణలో జయప్రకాష్ నారాయణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు దాడి చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు కూడా ఆ దాడిని ఖండించారు. జయప్రకాష్ నారాయణపై ఓ శాసనసభ్యుడితో పాటు ఓ శానససభ్యుడి కారు డ్రైవర్ దాడి చేసినట్లు వీడియో క్లిప్పింగ్స్ తెలియజేస్తున్నాయి. కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. కాగా, మార్షల్స్ దాడిలో తెరాస సభ్యుడు హరీష్ రావు కూడా గాయపడ్డారు. ఇటీవలే తెరాసలోకి వచ్చిన శానససభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి కూడా గాయపడినట్లు చెబుతున్నారు. ఇరు వైపులా నాయకులకు గాయాలైన విషయాన్ని దాచి పెట్టి జయప్రకాష్ నారాయణపై దాడిని ఎక్కువగా చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, జెపిపై దాడిని ఖండించాల్సిందే.

జెపిపై దాడిని గర్హిస్తూనే తెలంగాణకు సంబంధించిన కొన్ని వాస్తవ పరిస్థితుల గురించి ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజలే కాదు, నాయకులు కూడా సీమాంధ్ర పాలకుల ఆధిపత్యంలో అణచివేతకు, అవమానానికి గురవుతున్నామనే భావన బలంగా నాటుకుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుతంగా ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రిలే నిరాహార దీక్షలు, ఇతర రూపాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. శాంతియుతంగా ఆందోళనలు సాగిస్తుంటే, తెలంగాణవాదులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

స్వయానా అధికార పార్టీ శాసనసభ్యులు కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసి తెలంగాణ ఇచ్చే వరకు తాము హైదరాబాదు వెళ్లబోమని, శానససభ సమావేశాలకు హాజరు కాబోమని మొండికేస్తున్నారు. వారిని కాంగ్రెసు అధిష్టానం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక, తాము ప్రజల మధ్యకు వెళ్లలేని స్థితిలోనే వారు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మనోభావాలను, పరిస్థితిని కూడా కాంగ్రెసు అధిష్టానం గుర్తించడం లేదు. ఏదో పద్ధతిలో ముందుకు సాగడాన్ని మాత్రమే ఆశిస్తోంది. ఇందులో భాగంగానే శాసనసభ సమావేశాలు ముగించుకోవాలని కాంగ్రెసు ప్రభుత్వం చూస్తోంది.

అదంతా ఒక ఎత్తయితే, తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నారో, అర్థం చేసుకున్నా దాన్ని పట్టించుకోవడానికి నిరాకరిస్తున్నారో గానీ సీమాంధ్రకు చెందిన సమైక్యవాదులు తామే అన్నింటికీ ప్రవక్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో, ప్రజాస్వామ్య పద్ధతుల పేరుతో ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయే పద్ధతి చాలా దారుణమైన విషయంగా ముందుకు వచ్చింది. జయప్రకాష్ నారాయణతో పాటు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, చిరంజీవి తమకే అంతా తెలుసు అనే పద్ధతిలో తెలంగాణ ప్రాంత నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించాలని వారు హితబోధలు చేస్తున్నారు. ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షను విస్మరించి వ్యవహారాలు నడపడం ఏ విధమైన ప్రజాస్వామ్యమనే విషయాన్ని జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు ఆలోచించడం లేదు.

సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజల మధ్య మనసులు విరిగాయి. సీమాంధ్ర రాజకీయ నాయకుల పెత్తందారీ విధానం వల్ల తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు కూడా తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇరు ప్రాంతాల నాయకుల మధ్య కూడా మనసులు విరిగిపోయాయి. మనసులు విరిగిపోయిన తర్వాత మానసికంగా విభజన రేఖ ఏర్పడిన తర్వాత కూడా భౌగోళికంగా విభజన అక్కర్లేదనే వాదనను కొద్ది ముందుకు తెస్తున్నారు. ఇద్దరు కుమారుల మధ్య మనసులు విరిగిపోయిన తర్వాత పరస్పరం విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత కుటుంబ పెద్దగా తండ్రి నిర్వర్తించాల్సిన బాధ్యత వేరు పోయడమే. ఆ వేరు పోసే బాధ్యతను కాంగ్రెసు అధిష్టానం నిర్వహించడం లేదు. ఉమ్మడి సంపదపై ఆధిపత్యం చేస్తూ, సంపదను తన ఇష్టానుసారంగా వాడుకుంటూ స్వార్థం చూసుకునే కుమారుడికి తండ్రి అండగా నిలిచినట్లు కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోంది. భౌగోళికంగా మన దేశం రాష్ట్రాలుగా విడిపోయింది. కొత్త రాష్ట్రాలు కూడా ఏర్పడ్జాయి. వాటి వల్ల దేశానికి ఏ విధమైన ముప్పు కూడా ఏర్పడలేదు. తెలంగాణ అనే ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నష్టమేమిటో, పైగా ఆ ప్రాంత ప్రజలు పూర్తిగా కోరుకుంటున్నప్పుడు అలా చేయకపోవడం ఏ విధమైన న్యాయమో, అందులోని ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.

ఈ వ్యాసంలోని అభిప్రాయాలతో దట్స్ తెలుగు డాట్ కామ్‌కు సంబంధం లేదు.

English summary
Attack on Loksatta president Jayaprakash Narayana opened up new dimension regarding Telangana issue. Telangana leaders are in a pressure to fulfill their people aspiration to achieve Telangana. Seemandhra leaders like Jayaprakash Narayana posing as intellectuals, are rejecting see the Telangana people aspiration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X