"సింగ్ గీతం" మూవీ రివ్యూ: 94 ఏళ్ల వయసులోనూ సింగీతం మ్యాజిక్ !!
తెలుగు సినీ చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తొచ్చే పేరు దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు. ఆదిత్య 369, భైరవ ద్వీపం, మైఖేల్ మదన కామరాజు, పుష్పక విమానం వంటి ఎన్నో విభిన్న చిత్రాలతో భారతీయ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో కూడా తన క్రియేటివిటీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన దర్శకత్వంలో "సింగ్ గీతం" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కేవలం సినిమా కాదు.. ఒక సాహసోపేతమైన సినీ ప్రయోగం అనడంలో అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం పాన్ ఇండియా, యాక్షన్, మాస్ కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో, సంగీతాన్నే కథనంగా మార్చి ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా సింగీతం విజన్‌ను గౌరవిస్తూ ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచిన నిర్మాత, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. సింగీతం వంటి లెజెండ్‌కి తగిన వేదికను అందిస్తూ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించడం తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం.

సినిమా కథ..
ఆంధ్రప్రదేశ్‌లోని "కుబేరపురం" అనే ఊహాజనిత గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. ఆ గ్రామంలో బ్రహ్మయ్య (బెనర్జీ), అతని కుమార్తె రేణు (శాలిని కొండేపూడి) కలిసి ఒక మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. మరోవైపు ప్రకృతిని ప్రేమించే గౌరి (అహిల్యా బమ్రూ) ఆ గ్రామంలో మిగిలి ఉన్న చివరి పెద్ద చెట్టును తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అయితే వ్యాపార ప్రయోజనాల కోసం ఆ చెట్టును నరికివేయడంతో గ్రామ సమతుల్యత దెబ్బతింటుంది. ఆ బాధలో గ్రామ దేవత కుబేరుడిని ప్రార్థించగా గౌరి మొర వింటాడు. ఆ తరువాత గ్రామంలో వరుసగా చోటుచేసుకునే విచిత్ర సంఘటనలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, వాటి వల్ల గ్రామ ప్రజలు ఎదుర్కొన్న పరిణామాలు, చివరకు ప్రకృతి-మానవ సంబంధాలపై ఇచ్చే సందేశమే "సింగ్ గీతం" కథ.
మూవీ విశ్లేషణ..
"సింగ్ గీతం" సాధారణ సినిమా కాదు. ఇది ఒక మ్యూజికల్ ఫాంటసీ. ఇందులో పాత్రలు సంభాషణలు చెప్పవు. వారి మాటలే పాటలుగా మారుతాయి. హాలీవుడ్, యూరోపియన్ సినిమాల్లో కనిపించే ఒపెరా శైలిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. సినిమా మొదటి అరగంట ప్రేక్షకుడికి కొంత కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మనం అలవాటు పడిన కథన శైలికి ఇది పూర్తిగా భిన్నం. మొదట్లో ఈ ఫార్మాట్‌కు కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ కథలోకి ప్రేక్షకుడు ప్రవేశించిన తర్వాత సినిమా తన ప్రపంచంలోకి పూర్తిగా తీసుకెళ్తుంది.
ఫస్టాఫ్‌లో ప్రపంచ నిర్మాణం, పాత్రల పరిచయం, సంగీత ఆధారిత కథనం ప్రధానంగా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో భావోద్వేగాలు, సామాజిక సందేశం, మానవత్వం, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలు మరింత బలంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం. సింగీతం శ్రీనివాసరావు మార్క్ ఫాంటసీ, హాస్యం, భావోద్వేగాలు, సామాజిక సందేశం ఈ చిత్రంలో సమతుల్యంగా మిళితమయ్యాయి. ఒకవైపు వినోదం అందిస్తూనే మరోవైపు మనిషి-ప్రకృతి సంబంధాలపై ఆలోచింపజేస్తుంది.
నటీనటుల పనితీరు..
గౌరి పాత్రలో అహిల్యా బమ్రూ అద్భుతంగా నటించింది. అమాయకత్వం, ప్రకృతిపై ప్రేమ, భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కళ్లతో భావాలను వ్యక్తపరచిన తీరు ప్రశంసనీయం.
అయాన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
శాలిని కొండేపూడి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది.
బెనర్జీ తన అనుభవంతో పాత్రకు బలం చేకూర్చారు.
నివేదా పేతురాజ్ తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ గుర్తుండిపోయే నటన కనబరిచింది.

సాంకేతిక విభాగం..
ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందుగా చెప్పుకోవాల్సింది దేవి శ్రీ ప్రసాద్ గురించి. సాధారణంగా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఒక ఎత్తయితే, మొత్తం కథనాన్ని సంగీతం ఆధారంగా ముందుకు నడిపించడం మరో ఎత్తు. డీఎస్పీ ఈ సవాల్‌ను అద్భుతంగా స్వీకరించారు. డీఎస్పీ కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రత్యేకమైన వర్క్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
అనుకూర్ సీ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. గ్రామీణ నేపథ్యం, ప్రకృతి అందాలు, ఫాంటసీ ఎలిమెంట్స్‌ను అందంగా తెరపై ఆవిష్కరించారు.
నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్‌గా కనిపిస్తాయి.
బలాలు..
- సింగీతం శ్రీనివాసరావు వినూత్న ఆలోచన
- దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- ఒపెరా శైలిలో తెరకెక్కిన ప్రత్యేక కథనం
- అహిల్యా బమ్రూ నటన
- ప్రకృతి పరిరక్షణపై బలమైన సందేశం
- క్లైమాక్స్‌లో పండిన భావోద్వేగాలు
- అద్భుతమైన విజువల్స్, సినిమాటోగ్రఫీ
బలహీనతలు..
- అందరికీ కనెక్ట్ కాని నరేషన్ స్టైల్
- ఫస్టాఫ్‌లో కొంత సాగదీత
- చాలా సింపుల్‌గా ఉన్న ప్రధాన కథ
- కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
- రెగ్యులర్ మాస్ ప్రేక్షకులకు పూర్తిగా నచ్చకపోవచ్చు
సింగీతం శ్రీనివాసరావు ప్యాషన్, నాగ్ అశ్విన్ విజన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కలిసి రూపొందించిన అరుదైన సినీ అనుభూతి "సింగ్ గీతం". తెలుగు తెరపై ఇలాంటి ప్రయత్నాలు రావడం నిజంగా ఆనందించాల్సిన విషయం.
రేటింగ్: 3/5












Click it and Unblock the Notifications