నా దేశ ప్రజలని ఆ దేవుడే కాపాడాలి!

హైదరాబాదులో మళ్ళీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 16 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ ఉరితీతకు ప్రతీకారంగా హైదరాబాదు, బెంగళూర్ నగరాల్లో పేలుళ్లకు పాల్పడుతామని గతంలో లష్కరే తోయిబా నేత మహ్మద్ ప్రకటించాడు.

చాలా మంది రాజకీయ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు బాంబు పేలుళ్లపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతి అవసరం లేదు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని చాలా కాలం నుండి నాశనం చేస్తూనే ఉన్నారు. మీరు ఇంకా దిగ్భ్రాంతి చెందామని ఆస్కార్ అవార్డు నటన అవసరం లేదు! జుగుత్స పుట్టిస్తుంది!!

ఏమిటీ నరమేథం? పురాతనకాలం లోని దుర్మార్గపు రాజవ్యవస్తలో లేము కదా మనం? 21వ శతాబ్దంలో, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, అయినా మన దేశంలో పరిస్థితులు ఎందుకింత దారుణం? ప్రమాదంలోనో, యుద్ధంలోకో గొడవల్లోకో ఉంటే ఉంటామని పోయి దుర్మరణం చెందిన వారు కాదే ఈ అమాయకులు? సాధారణ జీవితం కూడా బతకడానికి హక్కులేదా? బాంబులు పేలి ప్రజలు చనిపోగానే మనకి వినిపించేది రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి దగ్గరనుండి మంత్రులు, రాజకీయ నాయకులు సంఘటనను ఖండించడం, సంతాపం వ్యక్తం చెయ్యడం! భాజపా అయితే వెంటనే పాకిస్తాన్ ని, ముస్లింలను నిందించడం! వాళ్ళేమి చేసారు ఇంతకముందు? రామజన్మ భూమి అని, అద్వాని రధయాత్ర అని, గోద్రా గొడవలని తమ బలం పెంచుకోవడానికి ఈ దేశాన్ని నాశనం చెయ్యలేదా? మాకు అధికారం ఇవ్వండి ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని అంటున్న వీరు అయిదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటి? కాంగ్రెస్ ఏమి చేస్తుంది? దేశం ఎటుపోతే నాకేంటి అని ముస్లిం ఓట్ల కోసం ఆ వర్గాన్ని అన్ని వేళలా ప్రసన్నం చేసుకోవడం లేదా?

Hyderabad Blasts

ఉగ్రవాదులు ఎంత భయంకరులో ఈ రాజకీయ పార్టీలు, వారి నాయకులు అంత కంటే ఎక్కువ! వారి వారి పార్టీల కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ఎల్లవేళలా సిద్ధమే! దేశం కోసం ఉద్యమించే అన్నా హజారేని కాంగ్రెస్ భాజాపాలు కలిసి ఒక వెధవాయిని చేసాయి: అలా చేస్తున్నపుడు యువత, మేధావులు ఎందుకు మిన్నకుండి పోయారు? మనకి నొప్పి కలిగితేనా తెలిసోచ్చేది? ప్రజలకి ఎందుకింత నిర్లిప్తత, నిర్లక్ష్యం? ఏమై పోతుంది భారత దేశం? ఇటాలియన్ మాఫియా ఒక వైపు, ఎల్లవేళలా ఆమె చెప్పులు తుడవడానికి సిద్ధంగా ఉండే నాయకులు ఇంకో వైపు, ఊ అంటే అందరు ముస్లింలని తప్పు పట్టడానికి సిద్ధంగా ఉండే భాజపా! దేశం లోని అన్ని మతాలాని కలుపుకుంటూ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోవాలనే సంకల్పం లేని నాయకులు, మేధావి వర్గం, యువత!

ఇక మీడియా విషయానికొస్తే బ్రేకింగ్ న్యూస్ అంటూ సభ్యత సంస్కారం లేకుండా, టీఆర్పీ రేటింగ్స్ కోసం ఈ ఉన్మాదాన్ని ప్రజలకి చూపించి భయోత్పాతం కల్పించడానికి కూడా వెనుకాడరు! 09/11లో మూడు వేల మంది పైన చనిపోతే ఒక్క నెత్తుటి చుక్కనూ చూపించని పరిణతి పాశ్చాత్య మీడియాది! ముద్దలుగా పడిన పేగులు, నెత్తుటి మడుగులు, ఛిద్రమైన దేహాలు, తెగిపడిన శరీరాలు, ఏడుపులు, పెడబొబ్బలూ... ఇది మన దిక్కుమాలిన మీడియా పైత్యం!! ఉగ్రవాదులు వాస్తవంగా కోరుకునేదీ ఈ బీభత్సమే! ఈ భయోత్పాతమే!! జనాన్ని టెర్రరైజ్ చేయడమే!! మన మెరుగైన సమాజం కోసం ఉన్న ఈ మీడియాకి నిగ్రహం, ప్రజా సంక్షేమం అనే పదాలనేవి ఉన్నాయన్న సంగంతి తెలుసా? ప్రతిదీ వ్యాపారమేనా? ప్రతిదాన్లో లాభాపేక్షేనా?

ఉగ్రవాదంకన్నా ప్రజలు, యువత, మేధావులు, మీడియా, రాజకీయ నాయకుల లోని ఈ లెక్కలేనితనం, ఈ నిర్లక్ష్యం, ఈ నిర్లిప్తతలు ఎక్కువ ప్రమాదకరం! నా భారత దేశ ప్రజలని ఆ దేవుడే కాపాడాలి!

- గురవారెడ్డి, అట్లాంటా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+