చింతపట్ల సుదర్శన్ క్విక్ బాక్సింగ్: సత్యవ్రతం

అనగనగా ఓ రాజ్యెమూ దానికో రాజు. ఆ రాజుకో బ్యూటిఫుల్ వైఫూ ఆమెకూ రాజుకూ కలిపి ఓ కొడుకూ వుండేవారు. ఆ రాజు అందరు రాజుల్లాంటి వాడు కాడు. ఆయన వో వ్రతం పట్టుకున్నాడు. చచ్చేదాక వదల్నని ప్రమాణం చేశాడు. ఆ వ్రతమే సత్యవ్రతం. ఈయన సత్యవ్రతం సంగతి సొర్గం దాకా పాకింది. అక్కడ ముక్కుమూసుకుని యేళ్లకొద్దీ తపస్సు చేసి స్వర్గానికి వీసా సంపాదించిన వాళ్ల మధ్య ఈ వ్రతం మీద పెద్ద డిస్కషన్ జరిగింది. ముక్కుమూసుకు తపస్సు చేసీ ఇంద్రభవన్‌లో కాలుపెట్టిన ఒకడికి మాత్రం ముక్కు మీద కోపం ఏ మాత్రం తగ్గలేదు. ముఖం మీద పేలాలు వేగిస్తూ సత్యమా ఖరాండమా (గాడిద గుడ్డా) అని హుంకరించేడు. అట్లాంటి వ్రతమే లేదు.. ఉన్నా సాగనిచ్చేది లేదు చూపిస్తా నా తడాఖా అంటూ ధడాల్న అక్కడ డిజప్పియరయ్యేడు.

అనగనగా రాజ్యెపు రాజావారు వేటకు వెళ్లి మధ్యాహ్నం వేల చెట్ల నీడలో విశ్రమిస్తుంటే ఇద్దరు ‘ఐటమ్ గర్ల్స్' అక్కడ అప్పియరయ్యేరు. వద్దు వద్దన్నా వినిపించుకోకుండా ‘సారొచ్చారొచ్చారంటూ' డ్యాన్సులంకించుకున్నారు. ‘పర్ ఫార్మెన్స్' అయ్యేక పెళ్లి చేసుకోవాల్సిందని బలవంతం చేశారు. వీల్లేదు గాక వీల్లేదు రాజ్యెంలో నాకో బ్యూటీఫుల్ లైఫుంది. ఆడిన మాట తప్పననే వ్రతముంది. నా వ్రతం సత్య వ్రతం అని సముదాయించాడు రాజు. ఏంటదీ వ్రతమా సత్య వ్రతమా అయితే కాస్కో అంటూ వచ్చాడు ముక్కోపి.

Chantapatla Sudarshan Quick Boxing: Satyavratam

అంతే మొదలయ్యింది రాజు గారి ‘డౌన్ ఫాల్'. రాజ్యెం పోయింది. బంగారమూ, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలు ‘కల్లాస్' అయ్యేయి. రాణీని బిగ్ బజార్‌లో అమ్మేశాడు. కొడుకుని పాము కాటేసింది. కాటికాపరి డ్యూటీ చెయ్యాల్సి వచ్చింది. సత్యవ్రతం ఆచరించటానికి లోకంలో వున్న కష్టాలన్నీ భరించాడు. పుట్టెడు దు:ఖాన్ని సహించాడు. జిందగీ మొత్తం ఖర్చయ్యాక ముసలితనం వచ్చి వొంట్లో శక్తి నశించేక అందరూ భేషన్నారు. శభాషన్నారు. సత్యవ్రతం మహిమ లోకానికి క్లియర్‌గా తెలిసొచ్చింది. చస్తే సత్యం చెప్పవద్దని, సత్యం చెప్తే చస్తామనీ అందరికీ అదో ‘లెసన్' అయింది.

ఇంత పాపులర్ కథ తెలిసీ, పాఠం అర్థమయ్యీ ఎందుకో ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించాలని ఆలోచన వచ్చింది ఒకడికి. ఆ ఒకడి పేరు సత్యం. ఓ రాత్రి నిద్రపట్టక మంచం మీద దొర్లుతూ చిన్నప్పట్నించీ ఇప్పటిదాకా అందరూ అరేయ్ సత్యం, ఒరేయ్ సత్యం, సత్యం గారూ అని పిలుచుకుంటూ వచ్చారే ఒక్కనాడన్నా సత్యం చెప్పాడా తను అని తనతో తాను చాలా సేపు ‘డిస్కస్' చేసుకున్నాడు. అసలు అబద్ధం చెప్పకుండా ఒక్కరోజన్నా వుండలేనా పేరులో సత్యం వున్నవాణ్ని అని అనుకున్నాడు. అసలు ఏదో ఓ అవసరంవుండి ఏదో ఓ ప్రయోజనం కోసం అబద్ధం చెప్పవచ్చు గానీ అనవసరంగా అబ్ధం చెప్పడం మానేస్తే నష్టమేమిటి కష్టమేమిటి అనుకున్నాడు. అంతే ఫిక్సయిపోయాడు మర్నాడు మొత్తం సత్యవ్రతమేనని. ‘ఎక్స్‌పిరిమెంట్' సక్సెసయితే కంటిన్యూ చేసి పేరులో వున్న సత్యాన్ని సత్యం చేద్దామనుకున్నాడు.

ఏవండీ లేవండీ అని భార్య పిలవలేదు అరిచింది. ఆలోచన్ల వల్ల తెల్లవారుఝామున నిద్ర పట్టిన సత్యం వులిక్కిపడ్డాడు. ముఖం మీద కప్పుని పక్కకు తప్పించి ఇంకో అయిదు నిమిషాలు.. రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు అన్నాడు.

ఆ తర్వాత సంబరపడిపోయాడు. ఆహా! సత్య వ్రతం అమలు జరగడం ఆరంభమయ్యింది య్యా!య్యా! అనుకున్నాడు. ‘కీపిటప్' అని భుజం చరుచుకున్నాడు. సరిగ్గా అయిదో నిమిషానికి లేచి బాత్రూంలో దూరాడు.

కాఫీ ఎలావుంది అన్నట్టు ముఖం పెట్టి ఎదురుగ్గా నుంచుంది భార్య. కాస్త చక్కెర ఎక్కువ అయ్యింది కానీ ఆ మాట చెప్తే ఏమంటుంది. ముందు ముందు టిఫినూ, ఆ తర్వాత ఆఫీసుకి డబ్బా గుర్తుచ్చేయి. అబద్ధం వల్ల ప్రయోజనం కనకవుంటే తప్పుకాదన్న ఆలోచనకు బలం హెచ్చింది. పైగా ప్రమాదం లేని అబద్ధం వల్ల సత్యానికేం ప్రమాదం అనుకున్నాడు. బ్రహ్మండంగా వుంది! అని వూరుకున్నాడా లేదు రెచ్చిపోయాడు. అసలిలాంటి కాఫీ ఆమెకి తప్ప మరొకళ్లకి చేయడం రాదని మెచ్చుకున్నాడు. అవసరం లేకపోయినా రెండు మూడు అబద్ధాలని అందంగా చెక్కిపారేశాడు.

పేపర్ చదూతుంటే మనసు నిలదీసింది. ఒరేయ్ సత్యం నీ పేరసత్యం అయ్యుండాల్సింది. ఒక్కరోజు ఒకే ఒక్క రోజున్నా సత్యవ్రతం ఆచరించవా థూ నీ బ్రతుకు చెడ అని చెడామడా కడిగేసింది. సారీ సత్యం! మంచం మీద ఉన్నంత సేపూ సత్యవ్రతం మీద గట్టి పట్టే వుండింది. మరి ఇప్పుడేమయిందో అర్థం కావడం లేదు. ఇప్పట్నుంచీ సరిగ్గా స్టడీగా కేర్‌ఫుల్ గా వుంటాను అని జవాబిచ్చుకున్నాడు.

బస్సు కిటకిటలాడ్తున్నది. వెనకవైపు వెళ్లాడ్తున్న కుర్రోళ్ల మధ్యనించి ఎక్కటం ఇంపాజిబుల్ అనుకుని ముందు నుంచి ఎక్కేసి సీనియర్ సిటిజన్ సీటు ఖాళీగా వుంటంతో ‘బ్రతుకు సత్యం' అంటూ కూలబడ్డాడు. తక్కువ వయస్తులో తల ముగ్గుబుట్ట అవడం లాభమో అనుకుంటూ. కాస్సేపటికి మరో సీనియర్ సిటిజన్ తననే పరీక్షగా చూస్తుండటంతో నిజం చెప్తే ప్రమాదం అబద్ధం చెప్తే ప్రయోజనం అవసరం వుంటే అబద్ధం చెప్పవచ్చు కదా అనుకుంటూ ‘ఐయామ్ సీనియర్ సిటిజన్' అన్నాడు సీరియస్‌గా. అనవసరంగా అబద్ధం చెప్పద్దు అదే సత్య వ్రతం అన్నాడు సత్యం సత్యంతో.

ఫైల్ సంగతేవిటని చిరాగ్గా అడిగాడు బాస్. ఆయన అడిగిన ఫైల్‌ని కంప్లీట్ చెయ్యడానికి కనీసం రెండు గంటలు పడ్తుంది. కానీ ఆ మాటంటే వూరుకుంటాడా షాంపూతో తలంటుతాడా అని ఆలోచించసాగాడు సత్యం. మాట్లాడవేం అని గద్దించాడు బాస్. అనాలోచితంగా పది నిమిషాల్లో పూర్తవుతుంది సార్ అన్నాడు షివరింగ్ టోన్‌తో.

అయిదు నిమిషాల్లో నా టేబిల్ మీద వుండాలి అన్నాడు బాస్ క్రూరంగా, క్రూయల్‌గా. సత్యం సత్యం వైపు చూశాడు జాలిగా. అలాగే చూస్తూవుండిపోక తప్పలేదు ఆ రోజంతా.

మధ్యాహ్నమ్ క్యాంటీన్‌లో ఫ్రెండడిగాడు మ్యారేజికెందుకు రాలేదని. ఎందుకు పోలేదో నిజంగా గుర్తురాలేదు. సమయానికి ఆదుకుంది అబద్ధం. మా ఆవిడకి ఆరోగ్యం బాగాలేక అనాల్సి వచ్చింది. అప్పిచ్చిన వాడికి ఆఫీసులో తనతో పని వుండి వచ్చిన వారికి ఎవరికీ నిజం చెప్పలేకపోయాడు కానీ ప్రమాదం లేని అబద్ధాలే కదా అని చెప్పేశాడు. బస్టాండులో బిచ్చం అడిగిన వాడికి ఏమైనా ఇద్దామనుకుని జేబులో చెయ్యి పెడుతుంటే బస్సుకనిపించింది అనాలోచితంగా చిల్లరలేదని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కండక్టర్‌కి తనిచ్చిన నోటు బాలేదంటే మరోటి లేదని అబద్ధమాడాల్సి వచ్చింది లేకపోతే ఆ నోటు ఎప్పటికీ తన దగ్గరే వుండిపోతుంది.

ఆలోచించి కొన్ని ఆలోచించక కొన్ని అనుకోకుండా కొన్ని హఠాత్తుగా కొన్ని అబద్ధాలు చెప్పక తప్పలేదు సత్యానికి. అవసరం లేకపోయినా, ప్రయోజనం లేకపోయినా అనవసరంగానయినా అలవాటుగా నయినా అబద్ధం చెప్పక తప్పలేదు. అసలు ఈలోకంలో సత్యం చెప్పడమనేది అంత ఈజీ మ్యాటరేం కాదు, ఒక్క రోజుకైనా సరే వీలు పడదు. అందరూ అబద్ధాల మీదే జీవిస్తుంటే ‘సత్యం' అని పేరు (తను పెట్టుకోలేదు) వున్నంత మాత్రాన సత్యమే చెప్పాల్సిన అవసరం లేదన్న సత్యం తెల్సుకున్నాడు సత్యం.
సత్యం సత్యవ్రత భంగం జరిగింది.

- చింతపట్ల సుదర్శన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+