చింతపట్ల క్విక్ బాక్సింగ్: బంతి లాంటి మనిషి

ప్రపంచంలో ఏదో ఓ పనిని ఎవడో ఒకడు ఎప్పుడో ఓ అప్పుడు అందరికంటే ముందుగా చేస్తాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోడమే అడిగిందే తడవుగా ‘టకీ'మని చెప్పడమే జనరల్ నాలెడ్జీ.

ఈ భూమ్మీద ఎందరో కబ్జాదారులు పుట్టి పెరిగి అనేక భూవుల్ని కబ్జా చేశారు. ప్రసిద్ధ కబ్జాదారులుగా పేరూ ప్రఖ్యాతీ నోట్ల కట్టలూ సంపాదించేరు. కానీ అసలుసిసలు కబ్జాదారుడూ ప్రసిద్ధుడూ ఎవరనగానెవరు? వాడి పేరు హిరణ్యాక్షుడు కదా యిప్పుడు గుర్తొచ్చింది కదూ.

పూర్వం జ్ఞానం వున్నవాళ్లు కొందరు (కొందరంటే కొందరేవుండే వాళ్లుట) ఈ భూమి అనేది నలుచదరంగా మీ ఇంట్లో మా ఇంట్లో వుండే చాపలాగా వుండేదని సెలవిచ్చారు. వాళ్లు సెలవిచ్చింది కరెక్టవునో కాదో ఎవడికి తెలీదు కనుక మన హిరణ్యాక్షుడికీ తెలీనేలేదు. వాళ్లది జ్ఞానమేనని నమ్మి లోకంలో మొట్టమొదటి ‘లాండ్ గ్రాబర్' అవ్వాలని భూమనే చాపని చుట్టి చంకలో పెట్టుకొద్దామని బయలుదేరేడు. ఒక వేళ నిజంగానే చాప మాదిరిగానే వుండివుంటే ఇప్పటికీ మడత చుట్టుతానే వుండిపోయే వాడేమో కానీ అది గుండ్రంగా బంతిలా వుండటంతో చచ్చి బతికిపోయాడు. ఈజీగా రెండు చేతుల్తో ఎత్తిపట్టుకుని నోట్లోంచి యివతలికి పెరిగివచ్చిన దంతాల మీద ‘లాండుని లాండు' చేసి అక్రమ మంటారని సముద్రంలో దాక్కునీ అదృష్టం కల్సిరాక రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యలేకపోయాడు.

అసలీ భూమి చాపలా టేబిల్ టాప్‌లా ‘స్క్వేర్'గా వుండక బంతిలా ‘సర్కుల్'‌గా వుండటానికి కారణమేమిటో అర్థం కాదు. అసలు భూమే కాదు తితిమ్మా గ్రహాలన్నీ కూడా మరో షేపులో లేకుండా గుండ్రంగా ‘ఫుట్‌బాల్'లా వుండటానికి కారణమేమిటి? ఈ బిగ్ బాల్స్ అన్నీ తయారు చేసిన వాడికి ఫుట్‌బాల్ అంటే ప్రత్యేకమైన ఇంటరెస్ట్ వుండి ఉండాలి. వాడో గొప్ప ‘సాకర్ ప్లేయర్' అయితీరాలి.

 Chintapatla Quick Boxing: Ball like man

సాకర్ అనేది ఓ మామూలు జలుబూ పడిశం కాదు. ప్రపంచం మొత్తాన్ని వణికించే చలి జ్వరం. లాటిన్ అమెరికాలో అయితేనేం యూరప్ అయితేనే రష్యా, జపాన్, కొరియా ఏ దేశమేగినా ఎందుకాలిడినా తన్నరా ఈ బంతి ‘గోల్'లో పడదన్ను అని వూరికే అన్నారా?. ఇదో జన సునామీ ఇదో మాస్ మహా ఇస్టీరియా. నెల రోజుల్నించీ జిమ్ములూ, ఆఫీసులూ రొటీన్ జీవితమూ ఒళ్లూ మరిచిపోయీ జనం కళ్లు ఫుట్‌బాల్ గ్రౌండులో ‘ఫిక్సయి'పోవడం చూసి ఆశ్చర్యపడాల్సిన పనేలేదు.

ఎందుచేత ఎందుకొరకు ఎందువల్లనంటే మనిషికీ బంతికీ వున్న ‘రిలేషన్' అట్లాంటిది మరి. అసలు మనిషనే వాడు వుండేదే బంతి మీద. తన బతుకులో సుఖదు:ఖాలు భాగ్యరేఖ, అదృష్ట దురదృష్టాలు అన్నీ తొమ్మిది బంతుల మీద ఆధారపడి వున్నాయనీ నమ్ముతాడు మనిషి. ఆశ ఉత్తర ధృవం విధి దక్షిణ ధృవం మనిషి ఈ రెంటి మధ్య బంతిలా ఎగిరిపడే ప్రహసనం అన్నాడో మహానుభావుడు. ఇంకేముంది ‘క్లారిటీ' వచ్చినట్టే కదా.

అసలు మనిషే ఒక బంతి. వయసు పెరుగుతున్నా కొద్దీ ‘షేప్'లో మార్పు వచ్చే బంతి. చూడ్డానికి గడకర్రలా చక్కగా కనిపించే మనిషి నిజానికి ఒక బంతేనని వాడి బతుకు మోషన్ పిక్చర్ చూస్తే చాలు అర్థమవుతుంది. తాంబూలాలిచ్చేశా తనక్కు చావండి అన్నట్టు ఫుట్‌బాల్ గ్రౌండులోకి బంతొకటిసిరేశాం తన్నుకు చావండి అన్నట్టు ఈ భూమ్మీదకి మనిషనే వాణ్ణి విసిరిపారేసి దొర్లించి పొర్లించి తన్నిస్తాడు ఆ ‘బాల్ మేకర్'.

పుట్టీ పుట్టగానే నోముల పంటని బంగారు కొండని ఊయల్లో వూపి ఎంత ముద్దు చేస్తారో బంతిని. ఒళ్లో లాలించీ, ఛాతి మీద పడుకోబెట్టుకుని, వీపు మీద ఎక్కించుకుని పూవులా చూసుకునే బంతిని మూడో ఏడు రాగానే కిండర్ గార్డెన్ స్కూల్లోకి దొర్లించేస్తారు. అక్కడ మొదలవుతుంది ఆట. చిన్న చిన్నగా మెత్త మెత్తగా కొత్త కొత్తగా తన్నుల ఆట. ఇక పెద్ద బడికి వచ్చేప్పటికి మనిషిని ‘బాలుడు' అని పిలుస్తారు. బాలుడు అన్న పదంలో ‘బాలు' వుందాలేదా? ఈ బాలుని లెక్కల మాష్టార్ ఓ తన్నుతంతాడు. బాలు వెళ్లి ఇంగ్లీషు మాష్టర్ కాలుకి అందుతుంది. ఆ మాష్టర్ ఇంగ్లీషులో ఓ ‘కిక్కు' కిక్కితే బాలు వెళ్లి సైన్స్ మాష్టర్ కాళ్ల సందున ఇరుకుతుంది.

మానవుడుగా పిలవబడే ఈ బంతి కాలేజీలో లెక్చరర్లు ప్రిన్సిపాల్ వైపు ఆయన దాన్ని లెక్చరర్ల వైపూ తంతూ సరదాగా ఆటాడేసుకుంటారు. ఈ లోపున యంగ్‌గా వుంటం వల్ల బ్యూటీఫుల్‌గా కనిపించే అమ్మాయిలు కూడా ఈ బంతితో తమాషా ఆట ఆడుకుంటారు. ఎటు దొర్లాలో తెలీక బంతి అనేక కలలు కంటూ బోలెడు ‘సాడ్' సాంగ్స్ పాడేస్తుంది.

ఇప్పుడిక బంతి లోకమనే పెద్ద ‘ప్లే గ్రౌండ్'లో వచ్చిపడుతుంది. బయోడేటాతో సర్టిఫికెట్ల ఫైల్‌తో ఆఫీసుల్లో, ఫర్మ్‌లో కంపెనీల్లో తెగ దొర్లుతుంది. తెగ తన్నబడుతుంది. తన్నినోడే తంతాడు. తన్నిన చోటే తంతాడు. ఎవరు తన్నినా ఎన్ని తన్నినా బంతి బంతే కదా. తన్నించుకోవడం తప్ప బంతికి మరో పనేం లేదు కదా. బంతి తన్నులు తప్పించుకుని ఎక్కడో ఓ చోట నింపాదిగా వుందామని వూపిరిపీల్చుకుందామని సెటిలై పోదామని ప్రయత్నం చేస్తూనే వుంటుంది. దొర్లకుండా తన్నించుకోకుండా వుండాలని ప్రయత్నం కొనసాగిస్తూనే వుంటుంది.

ఇంటర్వ్యూలో ఈ చివర ఉన్న సూట్‌వాలా జాగ్రఫీతో ఒక్క తన్నుతంతే బంతి ఆ చివరవున్న బట్టతలకు అందుతుంది. వాడేదో లెక్కతో లాగి తంతే మధ్యలో వున్నవాడి వెటకారపు నవ్వుకి అంది బంతి గదిలో నుంచి బయటకు దొర్లి పడుతుంది. ఇలాగే ప్రతి ఇంటర్వ్యూ గదీ ఒక ప్లేగ్రవుండవుతుంది. జనరల్ నాలెడ్జీతో, సైన్సుతో, కంప్యూటర్ క్వశ్చన్స్‌తో, ఇంగ్లీష్ లాంగ్వేజితో, కరంటఫయిర్సుతో రకరకాల తన్నులు తింటూ బంతి మూలమూలకు తన్నబడుతుంది. తన్నించుకుని తన్నించుకుని, అలసిపోయేక ఓ ‘ఆఫర్ లెటర్' దొరికించుకుని ‘హమ్మయ్య' అని వూపిరి పీల్చుకుంటుండగానే ‘ఓరే బంతీ ఓ ఇంటివాడివవ్వాలి రా' అని వెంటపడతారు.

ఇకనైనా ఓ ఇంట్లో కుదురుగ్గా కూచోవచ్చు గదా అని బంతి సంతోషపడుతుంది. సంసారం అనే ప్లే గ్రవుండులో వచ్చి పడుతుంది. బంతన్నాక, గ్రవుండన్నాక తన్నులు తప్పుతాయనుకోవడం వొట్టి భ్రమ.

సరుకులూ, సామాన్లూ, బొగ్గులూ, రాత్రికి రగ్గులూ, సంధ్యా సమస్యలూ కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ తెరచాపలు ఉరికొయ్యలు బంతి బతుకే అంత. మనిషనగా నెవడు?

బంతిగా పుట్టి బంతిగా పెరిగి బంతిగా దొర్లి బంతిలా తన్నించుకుని ఎగిరీ దొర్లీ కదిలీ కదుల్తూనే వుంటాడు కడదాకా. గోల్ కీపర్ చేతికి చిక్కిన బంతిని పునర్జన్మంటూ మళ్లీ ప్లేగ్రవుండు లోకే విసిరేస్తాడు. ఈ చివరి నుంచి ఆ చివరాఖరు వరకూ భ్రమాంభ్రమణ జీవితం కదా బంతిదీ! బంతిలాంటి మనిషిదీ!!

- చింతపట్ల సుదర్శన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+