క్విక్‌బాక్సింగ్: లవ్ ఈజ్ నాట్ బ్లైండ్!
ఎన్నంటే యేం లాభం?!
ఈ లోకంలో కొండలూ కోనలూ, చేలూ, చెర్వులూ, నదులూ జలపాతలూ మైదానాలు ఏమేమి వున్నయో! ఎన్నెన్ని వున్నయో వుంటే..
ఎన్నుంటే యేం లాభం?!
ఈ లోకంలో కూడూ గూడూ గుడ్డా, మందూ మాకూ చుట్టా బీడీ సిగరెట్, బిర్యానీ పావ్ భాజీ, గప్‌చుప్ ఫావ్ భాజీ హాజ్రీ! ఎన్నెన్ని వున్నయో వుంటే..
ఎన్నుంటే యేం లాభం?!
ఈ లోకంలో సాధువులూ, బైరాగులూ, మహాత్ములూ వుంటే మాత్రం లింగాలూ బూడిదలూ వుంగరాలూ చిటికెలో వస్తే మాత్రం ఎన్నెన్ని వస్తే మాత్రం.. యేం..
ఎన్నుంటే ఏం లాభం?!
ఈ లోకంలో రకరకాల ఇజాలు, నిజాలు, నిజాలనిపించే అబద్ధాలు, అబద్ధాలనిపించే నిజాలు పచ్చినిజాలు, పచ్చి అబద్ధాలు ఎన్నుంటే.. ఎన్నెన్ని వుంటే మాత్రం.. యేం..
ఎన్నుంటే యేం లాభం?!

ఏది ఏమయితేనేం, ఆరు నూరయితేనేం ఎన్ని నూర్లయితేనేం ఏవీ లాభం లేదు. ఏవి ఎన్నున్నా లేకున్నా ఏవీ లాభం లేదు.
ఇవన్నీ కాక లేక మరేవిటి కావాలి వుండాలి అనడిగితే ఆ మాత్రం తెలీదా అని నవ్వుతారు ఎవరైనా ఈ కాలం వాళ్లు కారా మీరని అడిగి ప్రశ్నించి విసిగించి వేసారిస్తారు.
మన్లో మన మాట మనకు కావాల్సిందేమిటో మనకే తెలీకపోతే ఎట్లా. గుర్తొచ్చిందాయిప్పటికైనా?
ఫ్రీగా వచ్చే ఫ్రీడం కానీ ఖర్చు లేకుండా వచ్చే ఫ్రీడం, బదులుగా ఏమీ అడగని, పుచ్చుకోని ఫ్రీడం.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీడం.. ఫ్రీడం.. డం.. డం.. డం..
ఫ్రీగా వచ్చే ఈ ఫ్రీడం దేనికోసం ఏం చేసుకుంటారు. తింటానికా తాగడానికా ఉతికి ఆరేయటానికా దేనికొచ్చిన ఫ్రీడం ఎందుకొచ్చిన ఫ్రీ.. డం.. అనే వాళ్లు తెల్సుకోవల్సిందీ, తరచి చూడాల్సిందీ, కూపీ లాగాల్సిందీ, పరిశోధించాల్సిందీ మథించాల్సిందీ మధన పడాల్సిందీ ఒకటుంది.
అన్నింటికీ మూలమైనదీ, ప్రశస్తమైనదీ పవర్ ఫుల్లయినదీ ఒకటుంది. దేనికయినా తత్వం ముఖ్యం. తత్వం బోధపడితే కానీ తత్వం తలకెక్కితే కానీ, తత్వం తలమీద తైతక్కలాడితే కానీ ఏదీ సాక్షాత్కరించదు. ఏ తత్వమైనా సాక్షాత్కరించాలంటే అదంత లాకాయి తాకాయి వ్యవహారం కాదు. ఎంతో తెలివీ దానికి సరిపడా తేటా బుర్రలో కొంచెం వూటా వుండాలి మరి.
ఇప్పుడిప్పుడే మనవాళ్లకు తత్వం తెలిసొస్తున్నది. పొగమంచు విడిపోతున్నది. ఇన్నాళ్లనించి, ఇన్నేళ్లనించి అగ్నానంలో, అమాయకత్వంలో, తెలివిలేని తనంతో వాడుకోలేకపోయిన దేమిటో, తెల్సుకో లేకపోయిన దేమిటో తెలిసివస్తున్నది. ఇప్పటికే ఎంత నష్టపోయాం ఎంత నాశనమై పోయాం.. అరెరే.. ఎంత ఫ్రీడంని ఎంత స్వాతంత్రాన్ని ఎంత స్వేచ్ఛని పీల్చకుండా వదిలేశాం ఎంత వాడకుండా కుళ్లబెట్టాం.. వేస్టు చేశాం.. అని తలలు బాదుకునే వాళ్లు బాదుకోవడం మొదలు పెట్టనే పెట్టారు. బాదుకునే వాళ్లు ఇలా బాదుకుంటూ వుండగానే లోకంలో ఆమూలా ఈ మూల ఫ్రీడంని ఫ్రీగా వాడుకుంటున్నారని తెల్సి వాడుకోవడం లేనివారు తెలీని వారు మరోమూల గిలగిల్లాడ సాగారు.
స్వేచ్ఛని స్వేచ్ఛగా వాడుకుంటున్న వాళ్లని చూసి కన్నీళ్లు పెట్టుకుంటే లాభం లేదని మరేదో పెట్టుకోవాలని డిసైడయ్యారు. అసలు ఫ్రీడం అంటే ఏమిటో ఖచ్చితంగా తూచాలనుకున్నారు ఆచాలనుకున్నారు బేరీజు వేయాలనుకున్నారు. బేకార్‌గా యిన్నాళ్లు వొదిలేసిన స్వేచ్ఛకు పట్టం కట్టాలనుకున్నారు పట్టాభిషేకం చెయ్యాలనుకున్నారు. అసలు స్వేచ్ఛ అనగానేమిటో అదెంత సింపులో అదెంత స్వీటో తెల్సుకున్నారు. అయితే ఏ తత్వాన్ని ఎవరు ఒప్పుకుంటారు. అయితే ఏ తత్వాన్ని ఎవరు ఒప్పుకుంటారు. తత్వమంటేనే అర్థంకానీ వాళ్లు తత్వం అంటేనే వొంటి కాలు మీద లేచి ఎగబడే వాళ్లుంటారు. సంప్రదాయం సంస్కృతీ, గాడిద గుడ్డూ వినాయకుడి చేతిలో లడ్డూ అంటూ అడ్డువచ్చే వాళ్లు ఎప్పుడూ వుంటారు.
స్వేచ్ఛ అంటే ఏమిటనేది, స్వాతంత్ర మనగానేమిటనేది తెలియని మూర్ఖులు, అగ్నానులు ఎందరో మహానుభావులు. స్వేచ్ఛ అన్నా స్వాతంత్రం అన్నా, నాగరికత అన్నా, ప్రొగ్రెస్ అన్నా రెండక్షరాల ప్రేమ అని ఈ లోకంలో మనుషులంతా సాక్షాత్కరింప చేసుకోవల్సిన తత్వం అదొక్కటే అదే లోకానికి బేస్ అని ఫౌండేషన్ అనీ సెల్లార్ అనీ తెల్సుకోలేని వారి అగ్నానాన్ని పటాపంచలు చేయాలని ఫ్రీడం తత్వం తలకెక్కిన వాళ్లు జీర్ణించుకున్నవాళ్లు యాగీ చెయ్యడం ఆరంభించేశారు. రెండక్షరాల ప్రేమ తత్వానికి ‘చుప్' అనే ధ్వనిని మూలమత్రం అని ఉపదేశించారు.
ఈ మూల మంత్రం మీద ఇప్పుడు తర్క విపత్కరాలు, వాదవివాదాలు, మాంస మీమాంసలు ఛీతూలు తుఛీలు డండడ డాండ డాండ నినదంబులు బిగినై పోడంతో పత్రికల ఛానళ్ల పొట్టలు నిండితే నిండవచ్చును గానీ స్వేచ్ఛని స్వేచ్ఛగా ప్రేమైక మైకంగా అనుభవించేవారిని అడ్డుకునే ప్రయత్నాలు పార్కులంటూ, చెరువులు గట్లంటూ పొదలమాటునా ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతున్న వారిని ఏమీ చెయ్యగలేవు. అసలీ దాచుకోడాలూ దాగుడు మూతలూ ఎందుకు ప్రేమని ప్రేమంత ప్రేమగా స్వేచ్ఛంత స్వేచ్ఛగా ఎందుకు ఆరాధించి అనుభవించి ఆనందించరాదు అని తిరగబడే వాళ్లను, ఆదిమానవుడి వారసులను నిరోధించడం పాపం అవుతుంది గాని పుణ్యం అవదు కదా.
అందుకే అవధుల్లేని అడ్డూ ఆపూలేని ప్రేమను వ్యక్తీకరించే ప్రేమికులు దాగుడు మూతలు మానేసి బాహాటంగా బహిరంగంగా, స్వేచ్ఛా ప్రేమల అంతరంగ తత్వాన్ని లోకానికి విడమర్చి చెప్తుంటే వద్దని వారించే వాళ్లు అరచేతిని అడ్డుపెట్టి ప్రేమకాంతిని ఆపలేరు గనక కనపడే దృశ్యాల్ని చూడలేని యెడల కళ్లు మూసుకోవడం మేలని, మంచిదని, ఆరోగ్యకరమని మనమంతా ధృతరాష్ట్ర వారసులమని ప్రేమ యోగులు సిద్ధులు తాపసులు, మునులు చెప్తుంటే వినదగునెవ్వరు చెప్పిన అని వినాలా వద్దా. మా పిల్లలు పాడయిపోతారనే తల్లిదండ్రులు వాళ్ల పిల్లల కళ్లకి నల్లపట్టీలు కట్టి ప్రేమతత్వం వాళ్ల తలకూ ఎక్కేదాకా బయటి ప్రపంచాన్ని చూడనీయకపోవడం మేలు శుభం భంశు. ప్రేమ గుడ్డిది కాదు. ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్లు.... కదా...ఔరా!
-చింతపట్ల సుదర్శన్
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications