క్విక్ బాక్సింగ్: ఓ..మై.. గాడ్!

చీమలు దూరని చిట్టడవి. కాకులు దూరని కారడవి. అయితే అవ్వచ్చుగాక. కానీ గుర్రాలు డొక్కలెగరేసుకుంటూ మోసుకుపోయే దొంగలకు మాత్రం రాదారీ పోదారీవుంటయి. చుట్టూ ఎత్తయిన కొండలు. కొండల వీపు మీద బండలు. కొండలా బండలా మధ్య దోపిడీ దొంగలు. వాళ్ల మూతులకి మీసాలు చేతులకి గన్నులూ వుంటయి. దొంగలన్నాక వాళ్లకో సర్దార్ అనే వాడుండి తీరాలి కద.

దొంగల సర్దార్ ఆరడుగుల పొడవూ మూడడుగుల వెడల్పూ వున్నాడు. నడుంకి తూటాల బెల్టు చేతికి నిగనిగలాడే నల్ల పిస్తోలూ వున్నయి. పిస్తోల్లో ఆరుగుళ్లున్నయి. చేతిలో పట్టా ఓటి వూపుకుంటూ చిరుత పులిలాగ అటూ ఇటూ తిరిగే సర్దార్ సడన్‌గా ‘స్టాచూ' అయిపోయేడు.

‘ఎంతమంది మనుషుల్రా వాళ్లు' అని ఉరిమాడు.

Chintapatla Sudarshan in his column Quick Boxing says people can not expect the future.

ఎదురుగ్గా మలేరియా జ్వరం వచ్చిన వాళ్లల్లా వొణుకుతూ నించున్నారు ముగ్గురు.

ముగ్గురూ దొంగలే. వాళ్లల్లో ఒకడు ‘తారు'లో ముంచితీయబడ్డ వాడిలా పంజాబీ గేదెలా వున్నాడు.

ఇద్దరు సర్దార్ అన్నారాముగ్గురు బెదురుగొంతుకతో డగ్గుత్తికతో గొంతులో ఏదో అడ్డంపడ్డట్టు.

పంది కొడుకుల్లారా. వాళ్లిద్దరు మీరిందరు అయినా యేం పీకలేక పొయ్యారు. వొట్టి చేతుల్తో వచ్చారు.

సర్దార్ ముందు నిలబడ్డ ముగ్గురూ మంచు గడ్డ మీద నిలబడ్డట్టు వొణికిపోయారు.

సర్దార్ నిగనిగలాడే నల్లటి పిస్తోల్ తీసి గురిపెట్టాడు. వాళ్ల వైపే ఎగాదిగా చూస్తూ వున్నట్టుండి గాలిలో పేల్చాడు.

ఇప్పుడు దీంట్లో ఎన్ని వున్నయిరా తూటాలు అనరిచాడు.

మూడు అన్నాడు నల్లోడు. నేను మీ ఉప్పుతిన్నాను సర్దార్ అనీ అన్నాడు.

ఇప్పుడు తింటావురా తూటా అన్నాడు సర్దార్.

నల్లోడు ఆడి పక్కొళ్లూ చచ్చంరా సర్దార్ అనుకున్నారు.

సర్దార్ వాళ్ల మీద జాలిపడ్డాడు. తన ఉప్పు మాంసం కూరలో వేసుకుని రొట్టెలో నంజుకుని తిన్నారని అనుకున్నాడు. అందుకే పిస్తోలులో మూడు తూటాలు మూడు ఖాళీలు వుంచాడు. వాళ్ల అదృష్టమే వాళ్లని కాపాడుతుందన్న ఫీలింగ్ కల్పించాడు.

టక్ టక్ మని బూట్ల చప్పుడు చేస్తూ వెళ్లి ఒకడి కణతకు పిస్తోలు గురిపెట్టి కాల్చాడు. పేలలేదు. విరగడపడి నవ్వాడు. తన ప్రాణం దక్కిందని ఆ దొంగ ముఖంలో చిన్న నవ్వు పువ్వై విరిసింది. మళ్లీ బూటు కాళ్ళీడ్చీకుంటూ వెళ్లి సర్దార్ మరొకడి కణతకి పిస్తోలు గురిపెట్టి కాల్చాడు. కాలలేదు. పగలబడి నవ్వాడు. బతికిన వాడు బతికినందుకు నవ్వుని పెదాల మధ్య అదిమిపట్టాడు. బతికిన వాడి ముఖంలో నవ్వు కళ వెలిగింది. కానీ బతికిన ముగ్గురూ ఇంకా పూర్తిగా బతికేశామన్న నమ్మకం లేక నవ్వుని నానా తాంటాలు పడి ఆపుకున్నారు.

సర్దార్ మాత్రం బ్రతికిపోయారు.. ముగ్గురూ బ్రతికిపోయారు ముగ్గురూ బ్రతికి పోయారు అంటు విరగబడి పగలబడి ఫక్కుమని నవ్వాడు. బండరాళ్ల మీద కూచుని వున్న దొంగల గుంపులోని దొంగలంతా సర్దార్ నవ్వుతో శృతి జత చేశారు. అందరూ కల్సినట్టుగా సర్దార్ నవ్వులో నవ్వులుగా కల్పిపోయారు. ఇంత మందీ ఒక్క పెట్టున పెద్ద పెట్టున నవ్వుతుంటే బతికున్న వాళ్లకి తాము బతికిపోయామని యముడు దున్నపోతుని రివర్స్ చేసుకుని వెళ్లిపోయాడని భావించారు. అప్పట్నుంచీ ఆపుకున్న నవ్వు బెలూన్‌కి సూదితో చిల్లుపెట్టారు. ఫట్ ఫట్‌మన్నారు. అందరితోపాటు విరగబడి, పగలబడి ఫక్కుమని నవ్వారు.

అప్పుడేమయింది? ఎవరూ అనుకోనిది ఎవరూ వూహించనిది హఠాత్తుగా, సడన్‌గా ఢాం ఢాం ఢాం జరిగిపోయింది. అనుకోకుండా, వూహించకుండా హఠాత్తుగా, సడన్‌గా జరిగిపోయేదే ‘సస్పెన్స్'.

ఈ లోకాన్నీ లోకంలో మిమ్మల్నీ నన్నూ మనందర్నీ ప్రవేశపెట్టాడు. మనలో దొంగలూ, ఘరానా దొంగలూ వుండచ్చు నాయకులూ మహా నాయకులూ వుండచ్చు. మనం ఎవరమైతే వాడికేం పట్టింది. మన జీవిత కథలో ఎప్పుడు యేం జరుగుతుందో తెలీకుండా సస్పెన్స్ నింపేశాడు. మరో నిమిషంలో యేం జరుగుతుందో ఎవడ్నయినా చెప్పమనండి చూద్దాం!

ఒకడు కారులో వెళ్తుంటాడు. ఎక్సిలేటర్‌ని బరువైన బూటు కాలుతో కసిగా కసికసిగా తొక్కుతాడు. కారు బయలుదేరే ముందు దాని కిందినించి యివతలకి వచ్చిన వాడి చేతిలో బ్రేకులు తీసేసిన ‘పానా' వుంటుంది. అది తెలీక జోరుగా హుశారుగా కారు తొక్కిన వాడికేం తెల్సు తనకి భూమ్మీద బిర్యానీ నిండుకుందని. కీచ్ కీచ్ సర్రుసర్రు అక్కడెక్కడో పేద్ద ఢామ్.

ఒకడు బ్రీఫ్ కేస్‌తో రోడ్డంట నడుస్తుంటాడు. దాంట్లో వున్న డబ్బుతో ఏమేంచెయ్యాలో వూహించుకుంటూ ఈల వేసుకుంటూ సాగిపోతుంటాడు. రైలు స్టేషన్‌లో మరో నల్ల బ్రీఫ్ కేస్ తన బ్రీఫ్ కేస్ జాగాలోకి వచ్చిందని దాంట్లో టిక్కు టిక్కు మంటూ వున్న ఓ బాంబు ఇంకాస్సేపట్లో ఢాం అనడానికి రడీ అవుతున్నదనే సంగత్తెలీదు. తను ఇప్పుడు వేస్తున్న ఈలే తన చిట్ట చివరాకరి ‘వీల' అని అస్సలు తెలీదు.

దట్టంగా మబ్బు పట్టిన ఆకాశం ఇంకాస్సేపట్లో కురుస్తుందనుకుంటాం. గాలి బాణాకర్రని ఆకాశంలో గిర్రున తిప్పుతుంది. మేఘాలు తెల్లమొగం పెడ్తాయి. వాతావరణ శాఖలోని మనిషి వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పి ఇంటికి బయల్దేరి దారిలోనే తడిసి ముద్దయి పోతాడు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏమనుకుంటుందో ఎండా కాలం వానలకి పంటలు సర్వనాశనం ఎందుకవుతాయో?! ఎన్నికల్లో ఎవరెందుకు గెలుస్తారో ఓడుతారో?!

ఈ భూమ్మీద జరిగే ఘటనలన్నీ సస్పెన్స్ సంఘటనలే. ఈ భూమ్మీద తిరిగే ప్రతి మనిషి జీవితమూ పేజీలు ఎన్నో తెలీని సస్పెన్స్ కథే!

- చింతపట్ల సుదర్శన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+