తెల్ల కాకులు: నల్ల మనుషులు (క్విక్ బాక్సింగ్)

ఇప్పుడే పదును పట్టిన కత్తి అంచులా మెరుస్తున్నది ఎండ. గాడి పొయ్యిమీద బోర్లించిన ఖాళీ డేకిశాలా వుంది ఆకాశం. కదిల్తే కాల్చేస్తాడు ఈ సూర్యుడని భయపడి దాక్కున్నయి మేఘాలు. మనుషుల ఈ చెవిలోంచి ఆ చెవిలోకి ఎండ పొగలా దూరి బయటకు వస్తున్నది. చెట్టూ, పుట్టా గట్టూ ఫ్రేంలో బిగించబడ్డ ఫొటోల్లా వున్నయి.

ఎక్కడ్నించో కాకి ఒకటి కావు కావుమంది. దానికి జవాబుగా మరో కాకి కూడా కావు కావు అనే అంది. కావ్ కావ్ అనేది కాకుల భాష. కావ్ కావ్‌ల్లో ఎంతో డిఫరెన్సువుంటుంది. లాంగ్వేజి తెలీని మనం కావ్‌లన్నీ ఒకటేననుకుంటాం. మొదట కావు మన్న కాకి ‘ఇది చాలా హాట్ గురూ' అన్నది. అవును ‘ఎండకి మాడి పోతున్నాం' అని ఆన్సరిచ్చింది రెండో కాకి.

Chintapatla Sudarshan in his quick boxing throws satires on summer taking crows as symbol.

అక్కడో చెట్టూ ఇక్కడో చెట్టూ మధ్యన కరగబోసిన వేడి వెండిలా ఎండ. అయితేనేం ఒక్క చోట కూచుని మనుషుల్లా కదలకుండా పని చేసే అలవాటులేని కాకులు అలవాటుగా కావ్ కావ్ భాషలో సంభాషిస్తూ కొమ్మలు మారుతున్నవి.

‘మమ్మీ దాహంగా వుందే' అంది కావ్ భాష ఇప్పుడిప్పుడే ముక్కున పడ్తున్న ఓ పిల్లకాకి. పై కొమ్మలో ‘నించుని కూచుని' రెండూ ఒకటే వాటికి, తల్లికాకి కనుగ్రుడ్లు భూగోళంలా గుండ్రాలు తిప్పింది.

ఓర్చుకోవే పిల్లకాకీ. ఎక్కడా నీటి చుక్క లేకుండా చేశారీ మనుషులు. ఇక్కడో చెరువుండేది. ఇప్పుడదో కాలనీ అయిలేచింది. కొంపల్లో బకెట్లూ తపేళాలూ కనపడవు. వెనకటి మాదిరి దొడ్లూ లేవు. దొడ్లో నీటి గాబూలూ లేవు. కాస్త ఎండ తగ్గనీ ఎక్కడికయినా ఎగిరెల్లి తాగొద్దాం నీళ్లు అంది.

మరో కాకి మినీ హెలికాప్టర్‌లా కొబ్బరి చెట్టు మొదట్లోంచి కిందకి డైవ్ చేస్తూ కావ్ కావ్ కావ్ అంది అయిదో పదోసార్లు.

ఒకప్పుడు మా తాత కాకి చెప్పిన కథ గుర్తొచ్చింది. ఆ కథ వల్ల కాకులం అనగా మనం ఎంత తెలివైన వాళ్లమో కూడా తెలిసొస్తూంది. సన్న మూతి కూజాలో కొన్ని నీళ్లు వుండెను అని ఆ కావ్‌లకర్థం.

నాకొచ్చు నాకొచ్చు అంది పిల్లకాకి. దాని పిల్ల కావ్‌లతో గులక రాళ్లు ఒకటొకటే వేసి నీళ్లు పైకి వస్తే తాగిపోయిన తెలివైన కాకి కథ చెప్పిందది.

పిల్ల కాకి కథ చెప్పడం విని తల్లి కాకి ఎంతో మురిసి పోయింది. వీలయినప్పుడల్లా ఆ బడి వైపు ఎగిరివస్తుండు బోలెడు తెలివి వస్తుంది అన్నది.

ఏం తెలివి లెస్తూ మనదీ ఓ తెలివేనా? లోకులు పలు కాకులు అని మనుషులు మనతో తమని పోల్చుకుంటారు కానీ మనమంటే వాళ్లకస్సలు గిట్టదు అన్నది ఎండ తగలకుండా చెట్టు ఆకుల్ని కప్పుకున్న కాకి.

అవును వాళ్లకి లాగే మనకూ రెండు కాళ్లున్నా మనమంటే వాళ్లకస్సలు లెక్కలేదు. కుక్కల్ని, పిల్లుల్ని, పావురాల్ని పెంచుకుంటారు కానీ కాకుల్ని పెంచుకుంటారా ఎవరైనా?

అసలు కాకి కనపడితే చాలు ‘హుశ్ హుశ్' అని చేయి విసుర్తారు. నిన్న ఓ ముసల్ది డాబా మీద వడియాలు ఎండకు పెడుతూ దరిద్రపు కాకులు ఏవీ దక్కనీయవు అని శాపనార్థాలు పెట్టింది.

అవునవును కాకి కొంపలో దూరితే కొంపే వదిలిపెట్టాలంట నిన్న శాస్త్రిగారెవరికో దక్షిణ పుచ్చుకుని చెబుతుంటే విన్నాను.

కాకి కనపడితే చాలు కంపరమెత్తుతుంది వీళ్లకి. మరి ఎవడన్నా చస్తే వాడి పిండాకూడు మాత్రం మనమే తినాలంట. చచ్చిన వాడి బదులు మనం వెళ్లి తింటామంట వీళ్ల శాస్త్రాలు పొయ్యిలో పెట్ట.

ఇలా కాకులన్నీ కావ్ భాషలో మాట్లాడుకుంటుంటే పిల్లకాకి మాత్రం మమ్మీ మమ్మీ అనరవసాగింది. దాన్ని చూసి మరి కొన్ని పిల్ల కాకులు కూడా తల్లుల రెక్కలు తమ చిన్న ముక్కుల్తో పట్టి లాగసాగేయి.

ఉండండే పిల్ల కాకుల్లారా ఒక్కరికి దాహమయితే అందరూ గగ్గోలు పెడ్తారు. మనుషులు నీళ్లు మాయం చేశారు. బాటిళ్లల్లో పోసుకుని ఫ్రిజ్జీల్లో దాచుకుంటున్నారు. వాళ్లు తప్ప ఇంకెవళ్లనీ బతకనీరు ఈ లోకంలో. ఈ లోకంలో వాళ్ల బాబుగారి సొత్తనుకుంటున్నారు. సెల్ టవర్ల పుణ్యాన్ని పిచ్చుకలన్నీ అంతరించి పోయేయి. మనది కాకి జన్మ. చిరకాలం బతకండి కాకులూ అని తోలాడు మనల్నీ లోకంలోకి. ఓ అందమా చందమా అని నిట్టూర్చింది ఓ సీనియర్ కాకిజన్.

కాకి నలుపు ఇచ్చాడు కదా కాకులకి. కోయిల్లూ నలుపే కానీ వాటికి సుశీలమ్మ గారి గాత్రం యిచ్చేడు అంచేత లోకంలో ఎందుకూ పనికిరాని నల్లకాకులమయి పోయేం మనం అని వాపోయిందో మిడిల్ ఏజ్‌డ్ ‘క్రో'.

తెలివి తేటలూ రంగురూపులూ మనుషులకి యిచ్చాడు దేముడు ఎంతయినా వాడూ మనిషి లానే వుంటాట్ట గదా పక్షపాతం మరి అన్నదో ‘యంగ్ క్రో'.

పొద్దున్నించీ పొద్దు గూకిందాకా అరుస్తారు కాకుల్లా. కాకి గోల చేసే వాళ్లు వెక్కిరించేది మనల్ని. ఈ మధ్య ఎక్కడ చూసినా మైకుల్లో వాళ్ల కాకి గొడవే కాకి గోలే కదా అని ఓ కాకి అంటే..

ఆ కాకి గోలంతా ఎలెక్షన్ల కోసమేనంట. మనుషులు చేస్తున్న కాకి గోలతో కాకులమైన మనగోల ఎవరికి వినిపిస్తుంది గనక అని మరోటి అంది.

కాకి పిల్ల కాకికి ముద్దు అంటున్నాడు నిన్న ఎవడో మైకులో. అంటే కాకులకి మాత్రమే పిల్లలంటే ముద్దు అని దాని అర్థమా? అనడిగింది ఓ కాకి కొమ్మల్లో అక్కడక్కడా రెస్టు తీసుకుంటున్న కాకుల్ని.

మనకి అపకీర్తి అంటగట్టడానికే వాళ్ల పోలికలు. కాకికి మాత్రమేనా కాకి పిల్ల అంటే ముద్దు. మంత్రి పిల్ల మంత్రికి ముద్దు కాదా? ఎంపి పిల్ల ఎంపీకి, ఎమ్మెల్యే పిల్ల ఎమ్మెల్యేకీ ముద్దు కాదా. ప్రతి వాడూ తాను చేసిన దేశ సేవ చాలదన్నట్టు కొడుకూ కూతురూ కూడా చెయ్యాలని కోరుకోవడం లేదూ. మంత్రి కొడుకు మంత్రీ, ఎంపి కొడుకు ఎంపి, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అయితే మరి జెండాలు మోసే వాళ్లు, బ్యానర్లు కట్టే వాళ్లు, జిందాబాద్‌లు కొట్టే వాళ్లు ఏమవుతారు? అనరిచింది అనీజీగా ఓ కాకి తాటి చెట్టు మీదనించి తాటి కాయని కిందపడేసి చింతచెట్టులోకి జొరబడుతూ..

తండ్రి వాడి కొడుకు మళ్లీ వాడి కొడుకు ఇలా కొడుకులు తండ్రులయి వాడి కొడుకులు తండ్రులయి వాడి కొడుకులు.. ఈ తండ్రీ కొడుకుల కాలచక్రంలో రాజులే రాజులవుతారు కానీ ప్రజలు రాజులయ్యే అవకాశమే లేదు అందో కాకి ఆకుల చాటునుంచే తోక దులుపుకుంటూ.

ఏమిట్రా ఈ కాకి గోల. మా కాలంలో ఎంత ఎండలోనయినా ఎగిరి పన్లు చేసుకునే వాళ్లం పుల్లా పుడకా కాయా పండూ ముక్కున కర్చుకుని వొచ్చేవాళ్లం. ఇట్లా తీరిగ్గా తిని కూర్చుని కబుర్లు చెప్పుకునే మనుషుల్లా ఏమిటీ కాకి కబుర్లు అని అరిచింది అప్పట్నుంచీ ఓ మూల మూలుగుతూ వున్న పండుకాకి.

పండు కాకి మీద గౌరవమున్న అన్ని కాకులూ నిశ్చబ్ధంగా వుండిపోయేయి.

కాకులూ మీరన్న మాటల్లో నిజం లేకపోలేదు. కాకులకన్నా హీనంగా వుండే మనుషుల్తో మనల్ని మనం పోల్చుకోనక్కర్లేదు. మనం పైకి నల్లగా కనపడ్తున్నా మన మనస్సులు తెల్లనివి. ఒక్క కాకి కేమన్నా అయితే వేల కాకులం ఎంత ఆదుర్దాపడతామో మీకు తెలియదూ. మనుషులు ఎర్రగాబుర్రగా తెల్లగా వుంటేనేం వాళ్ల మనస్సులు నల్లనివే. ఏళ్ల కొద్దీ చూస్తున్నాం కాదా వాళ్ల మాటలూ చేతలూ. రంగూ రూపు కాదు బుద్ధీ జ్ఞానం ముఖ్యం వెళ్లండి వెళ్లండి పిల్ల కాకులకి నీళ్లు తాగించుకురండి అని సలహా ఇచ్చింది పండుకాకి. కాకులు కావ్ కావ్ మంటూ ఎగిరిపోయినయి.

- చింతపట్ల సుదర్శన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+