హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చింతపట్ల క్విక్‌బాక్సింగ్: టైం తప్పిన టేబుల్

|
Google Oneindia TeluguNews

మనది కింది లోకం. మనపైన వున్న పై లోకంలోని వాళ్లే మనకాధారం. దేనికయితేనో, దేనికో ఓ దానికి అసలు అయిందానికీ కాని దానికీ పైకి నిక్కిచూడ్డం అలవాటయి పోయింది కింది లోకం వాళ్లకి.

పై నుండే వాడెప్పుడూ పైవాడే కదా. వాడికెప్పుడూ కింది వాళ్లంటే కింది చూపే కదా. ప్రతి దానికీ పైవాడి కోసమో వాడు పంపించే వాడి కోసమో దాని కోసమో ఎదిరిచూడ్డం తప్పదు మనకి మరి మనం ఎంతైనా కింది లోకం వాళ్లం కదా అంటే వాళ్లకింది వాళ్లం కదా!

పైన మన పన్లు చూడాల్సిన వాళ్లల్లో ముగ్గురు గాడ్లున్నారు. వాళ్లు ముగ్గురూ వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేస్తే మనకిన్ని కష్టాలూ కన్నీళ్లూ తలనెప్పులూ ఆత్మహత్యలూ హత్యలూ వుండేవి కానే కాదసలు. కానీ వాళ్లల్లా చెయ్యక పోవడమనేది మన ఖర్మ అవుతుంది గానీ వాళ్లకి చీమకుట్టడం అనేది కూడా కాదు.

ఏరా ఎండా ఏంటింకా నిద్దర్లేవలేదు. ఒంట్లో బావు లేదా అనడిగాడు వానగాడు.

Chinthapatla quick Boxing: time and table

ఏంటోరా బద్ధకంగా వుంది. ఒంట్లో బావున్నట్టులేదు అంటూ మూలిగాడు ఎండగాడు.

బండ లాగున్నావ్. ఏమయిందిరా నీకు పని ఎగ్గొట్టడానికి ఏమయినా చెప్తావ్ అని మనుసులో అనుకుని అల్లాగా సరే నీ ఇష్టం అన్నాడు వానగాడు.

అలా గనుకురా. ప్లీజ్ యివాళ నువ్వు డ్యూటీకెళ్లరా. కింది లోకం వాళ్లు ఎదురుచూస్తుంటారు అన్నాడు ఎండగాడు.

వాళ్లెదురుచూసేది నా కోసం కాదోయ్ నీ కోసం. నువ్వు డ్యూటీ చెయ్యాల్సిన టైంలోనే నేనెళ్తే తిట్టిపోస్తారు అన్నాడు వానగాడు.

వాళ్ల మొహం. వాళ్ల తిట్లకి భయపడ్తామా మనం. మనం హైయ్యర్ అథార్టీలం. మనం ఆడింది గేమ్ పాడిందే సాంగు అని నవ్వాడు ఎండడు.

మరీ కింది లోకాల వాళ్లని అంత చులకనగా చూడకు. నా మాట విని త్వరగా రడీ అయిపో అని సలహా యిచ్చేడు వానడు.

చెప్పకోయ్ కబుర్లు. నీ సంగతి ఎవరికి తెలీదని. నాట్లు వేసే టయానికి అటేపు కూడా చూడకుండా ఆవిడతో హనీమూన్ ఎంజాయ్ చేస్తావ్. పంట బాగా పండి చేతికొచ్చేటయానికి పిలవని పేరంటానికి బయల్దేరి పోయి ఒళ్లూ పై తెలీకుండా పూనకం వచ్చినట్టు కురిసి ఊళ్లూడ్చేసి పొలాల్ని ముంచేసి నానా బీభత్సం చేస్తావు. నీ కారణంగానే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని లెక్చర్ దంచాడు ఎండడు చెమట్లు కక్కుతూ.

ఆ కింది లోకం జనాలే అంత. ఎప్పుడు ఎందుకు చస్తారో ఎవరికెరుక. పోకపోతే రాలేదు రాలేదని గోల కప్పల పెళ్లిళ్లూ యజ్ఞలూ నానా హడావుడీ. వెళ్తేనేమో పాతిళ్లు కూలిపోతయి రోడ్లు జలమయమైతయి దరిద్రపు వాన ఛండాలపు ముసురు అని శాపనార్థాలు పెడ్తారు. క్రికెట్టు ఆట కొనసాగుతున్నప్పుడు పొరపాట్న అటేపు వెళ్తే ఎన్ని బూతులు తిడ్తారు. అందుకే ఆ అలగా జనం అంటే మంట. పోతే ఓ తంటా పోకపోతే ఓ తంటా అందుకే ఆ వైపు తొంగి చూడ్డానికి భయపడ్తుంట అని రివర్స్ అయ్యాడు వాన.

వాళ్ల తిట్లు నీ వొక్కడికేనా నాకు కురవ్వా. కరెంటు లేకపోతే వాళ్లు నన్ను తిట్టే తిట్లు పగవాళ్లని కూడా తిట్టవద్దెవ్వరూ. మాడు పగలగొట్టే ఎండనీ సన్‌స్ట్రోకులనీ ఎన్ని తిట్లు తిడ్తారో చెప్పలేను అందుకే వాళ్లు ఎక్స్‌పెక్ట్ చెయ్యని టైంలో వెళ్లి చావగొట్టి చెవులు మూసి చెమట్లు కక్కిస్తాను అన్నాడు ఎండ.

అద్దీ అలా రా దారికి. మనం అన్నయ్యా పైలోకం వాళ్లం మనం మనం సోదరులం కల్సికట్టుగా కింది లోకం వాళ్ల పొగరణచాలి. వీపు విమానం మోత మోగించాలి. చస్తున్నాం రా బాబూ అనిపించాలి. ఏమంటావ్? అన్నాడు వాన.

అవునూ ఎండగాడూ వానగాడూ మీరిద్దరూ ఇక్కడ ముచ్చట్లాడుకుంటుంటే కింద వాతావరణ శాఖ వాళ్లు ఏం చెప్పాలో తెలీక గ్రుడ్లు తేలేస్తున్నారు. ఇప్పుడక్కడా వానా లేక ఎండా లేక పోతే ఎట్లా? అన్నాడు పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఎండ గదిలోకి వచ్చిన చలిగాడు.

ఒరేయ్ చలీ మేమిద్దరం లేనప్పుడు నువ్వుళ్లి ఆ కింది వాళ్ల పళ్లూడ గొట్టచ్చు గదా అన్నాడు ఎండ.

నేనున్నా లేకున్నా అట్లా ఆ కింది లోకంలోకి జొరబడి, రగ్గుల్లేక రోడ్డు మీద పడుకునే అడ్రసులేని వాళ్లని లేపి పైకి కొరియర్‌లో పంపించి యమన్నయ్యకు సాయం చెయ్యచ్చు గదా అన్నాడు వాన.

కొత్తగా పెళ్లయిన వాళ్లూ వయసు హంగామా చేస్తున్నవాళ్లూ నన్ను మెచ్చుకుంటే మెచ్చుకుంటారేమో కానీ పసి పోరగాళ్ల గతేమిటి? కాటికి కాళ్లు చాపుక్కూచున్న వాళ్ల మాటేమిటి? వాళ్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే సిగ్గుతో బ్లాంకెట్ కప్పుకోవాల్సి వస్తుంది నాకు అన్నాడు చలిగాడు చెవులకు చేతులడ్డం పెట్టుకుంటూ.

కింది వాళ్లు మనల్ని తిట్టినా మెచ్చుకున్నా మన పన్లు మనం చేస్తూనే వున్నాం కదా అన్నాడు ఎండ సన్ గ్లాసెస్ వేసుకుంటూ.

ముగ్గురూ ఇక్కడే వుంటే కింది లోకం అనేదే వుండదు. ఏమిటీ మీ పన్లు మీరు చేస్తున్నారా? ఎంటీ చేసేది. ఏ టైంలో ఎండ కాయాలో ఎండగాడికి సోయి లేదు. ఏ టయంలో కురవాలో వద్దో వానగాడికి పట్టనే పట్టదు. చలిగాడు సరేసరి మీ ఇద్దరి తోక పట్టుకు తిర్గుతాడు. ఒరేయ్ ముగ్గురు గాడ్లారా మీ మీ పన్లు ఎప్పుడు చెయ్యాలో ఫిక్సయ్యి వుందిరా. అందుకే కాలాలూ రుతువులూ ఏర్పటయ్యాయి. ఆ టైం టేబుల్‌ని ఫాలో అవ్వాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు పని చెయ్యడం కాదు.

ఇప్పటికే కింది జనంలో పైవాళ్లంటే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఎండాకాలం వానలు వానా కాలం ఎండలూ అన్ని కాలాలూ చలి వొణుకే ఏమిటీ సీజన్లు గతి తప్పి రాంగ్‌ వేలో వస్తూ పోతూ వున్నయి అడిగేవాడెవరూ లేరా అంటున్నారు. మీ సంగతి ఆ దేవుడికి కంప్లెయింట్ చెయ్యాల్సి వస్తుంది బికేర్ ఫుల్ అంది ఆకాశవాణి.

ముగ్గురు గాడ్లూ గోడ మీద టైం టేబుల్‌ని చూడసాగారు.

ఇకనైనా ఆ ముగ్గురూ టైం టేబిల్‌ని ఫాలో అవుతే బాగుండును.

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chinthapatla Sudarshan in column Quick Boxing has written on deficit rainfall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X