క్విక్ బాక్సింగ్: లాగిన్ అండ్ లాగవుట్
కథలన్నీ కిందిలోకంలో మొదలైతయి. పైలోకంలో ‘ఎండ్' అయితయి. ఎవరి కథను వారు ‘ఎండ్' చేసుకోవడానికి ఏదో ఓ చిన్న కారణం సరిపోతుందా?
పొడవాటి హాల్లో వెడల్పాటి సోఫాలో మొత్తం శరీరాన్ని కూరి గుర్రుపెడ్తున్నదో ఆకారం. ఆ ఆకారం ముక్కులోంచి సుడిగాలి ప్రవాహంలా వచ్చి పడ్తుండటంతో పరిసరాల్లో ఉన్న వస్తువులు బెంబేలెత్తుతున్నాయి. ఫ్లవర్ వాజ్‌లు కిందపడి పగలడాన్ని నిలదొక్కుకుంటున్నాయి. స్టాండులోంచి పెన్నులు ఎగిరేపోయినయి. టీపాయ్ కాళ్లు బలంగా ఫ్లోర్‌కి అతుక్కుని నిలబడ్డానికి తడబడ్తున్నవి.
కెవ్వుమంది హఠాత్తుగా ఫోన్. చెవిలో జోరీగ దూరడంతో కళ్లు తెరిచి ఒళ్లు విరిచింది ఆకారం. కుయ్యోమ్ అంది సోఫా.
‘‘హలో ఎవడ్రా అదీ'' అరిచాడు ఆ ఆకారానికి వోనర్, పై లోకపు బిగ్ బాస్.

‘రావడం లేదా? రావడం కుదర్దా! ఏదో వోటి చెప్పి చావు. నువ్వెందుకు చస్తావు ఏదో ఓటి చేసి నేనే చస్తా.. నేను మాత్రం ఎందుకు చస్తాన్లే సరే మూసుకో!'
ఫోన్ విసిరేసి లేచినిలబడ్డాడు బి.బా. ప్రతి రోజూ ఎవడో ఒకడు డుమ్మా ఏదో ఒక కంప్లయింట్ స్టాఫ్ సరిపోవడం లేదంటే వినేవాడెవడు? టీమ్ మేనేజర్‌కి తప్పదు కదా అనుకుంటూ అసిస్టెంట్‌ని పిలిచాడు. పిలిచాడంటే అరిచాడు అరిచాడంటే కేకేశాడు.
‘సార్' అంటూ వొచ్చాడతను వొణికే గొంతూ శరీరంతో.
కులాసాగా కునుకేద్దామనుకున్నా కానీ కుదరడం లేదు, కిందికి వెళ్లాల్సిందే అన్నాడు బిగ్ బాస్ ఆవలిస్తూ.
అలాగా సార్! అలాగే సార్ ! వెళ్లాలా సార్! వెళ్లండి సార్! సరే సార్ అవును సార్ అన్నాడసిస్టెంట్.
ఊరికే అన్నదే అని వూరికే నసపెట్టకు. కిందకి వెళ్లాలంటే తెల్సుకదా కొంచెం పట్రా.
ఏమిటది ఓ అదేనా!అదే కదా! ఎక్కడ సార్!. లేదు సార్. భూమ్మీద కూడా తొమ్మిది సిలిండర్లే సార్. ఇక్కడా అంతే సార్. తొమ్మిదే తొమ్మిది అంతకు మించి చుక్క కూడా వీల్లేదని పైలోకంలో అమృతం డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో స్ట్రిక్ట్ ఆర్డర్. తమరేమో వెనకాముందూ చూసుకోకుండా...
అయిపోయిందా? మొత్తం.. పూర్తిగా. అయితే యింక కిందికి వెళ్లలేం అంటూ సోఫాలో కూలబడ్డాడు బాస్. సోఫా మళ్లీ కుయ్యోమ్ అంది.
‘వర్క్ ఫ్రం హోం' అన్నాడు అన్నాడంటే అరిచాడు అరిచాడంటే కేకేశాడు. చుక్క మందు లేకుండా భూమ్మీదకి వెళ్లడమంటే మాటలు కాదు. అసలే అక్కడ కంత్రీగాళ్ల నెంబరెక్కువ, మనదేమో ‘గ్యారంటీ పీరియడ్' అయిపోయిన వాళ్లని చావగొట్టి పట్టుకొచ్చే డ్యూటీ అనుకుంటూ లాప్‌టాప్ వోపెన్ చేశాడు. బాంబులతో పచ్చడి చేసి, బస్తుల్తో బూడిద చేసి, రైళ్లతో తొక్కించి, లారీలతో గుద్దించి, కత్తులతో కైమా చేసి జబ్బుల్తో జబర్దస్తీ చేసి లాక్కు వచ్చే టీమ్ వెళ్లిపోయింది కిందికి. మొగుళ్లతో పెళ్లాల్ని కాల్పించి, కొడుకుల్తో తండ్రుల్ని నరికించి, తెల్సినోళ్లతో తెలీనోళ్లను చంపించి, తెల్సినోళ్లతో తెల్సినోళ్లను మటాష్ చేయించే టీమూ వెళ్లిపోయింది కదా! ఇప్పుడు మనం మన చేతికి ‘డస్ట్' అంటకుండా ఆన్‌లైన్‌లో మిషన్ కంప్లీట్ చెయ్యాలి అనుకుంటూ ‘లాగిన్' అయ్యేడు. బాస్ అక్కడేవుంటే భాస్ షాడో ఓటి కింది లోకంలోకి దిగొచ్చింది.
గది తలుపులూ కిటికీలూ వేశున్నయి. మంచం మీద అసహనంగా దొర్లుతున్నాడతను. షాడో గొంతు తియ్యగా, మెత్తగా, మత్తుగా, గమ్మత్తుగా అతని చెవులకి వినిపించింది. ‘చచ్చిపో! హాయిగా ఆనందంగా మజాగా చచ్చిపో! నువ్వు చచ్చుతున్నావ్! చచ్చిపోతున్నావ్ నిజంగానే చచ్చావ్' మంచం మీద దొర్లుతున్న మనిషి వులిక్కిపడ్డాడు. పాపం కాదా అని గుసగుసగా అన్నాడు. కాదు కాదు సమస్యలకి అదే సరైన సమాధానం.. పరిష్కారం అన్నది షాడో స్వరం తియ్యగా, మెత్తగా, మత్తుగా, గమ్మత్తుగా. సీలింగ్‌కి వేలాడుతున్న ఫ్యాన్ తిరగడం మానేసింది. దాని రెక్కలకి తాడు.. ఆ తాడుకు మంచం మీద దొర్లుతున్న వాడు వేలాడసాగారు.
ఈ సీరియల్ చూడనీకపోతే ఛస్తాను అందామె రిమోట్ గట్టిగా పట్టుకుని. చస్తే చావు అన్నాడతను ఆమె చేతిలో రిమోట్ లాక్కుని. ఆమె అన్న మాట నిలబెట్టుకుంది. పండక్కి మా ఇంటికి పోదాం అన్నాడతను బ్యాగు చేత్తో పట్టుకుని, నేన్రాను, నువ్వూ వెళ్లడానికి వీళ్లేదు అందామె బ్యాగు లాక్కుని. వెళ్లనివ్వకపోతే చచ్చిపోతాను అన్నాడతను ముక్కు ఎగరేస్తూ. ఆమె బ్యాగివ్వలేదు. అతను అన్న మాట నిలబెట్టుకున్నాడు.
తెల్లారితే పరీక్ష! ఏం చెయ్యాలో తెలీడం లేదు అన్నాడు కుర్రాడు అతనిలోని అతనితో. మీసాలింకా పూర్తిగా ఆవుపడ్డం లేదు. ఎంతో కొంత చదివావు కదా అదే రాసేయ్ అన్నాడు అతనిలోని అతను. ఊహు చదివింది చాలదు ర్యాంకు రాదు నాన్న తంతాడు, అమ్మ ఏడుస్తుంది అన్నాడతను. ర్యాంకు రాకపోతేనేం పాసవుతావు చాలదూ అన్నాడు అతనిలోని అతను. ప్చ్.. చదివింది కూడా మరచిపోతున్నాను. భయమేస్తోంది. వొణుకువస్తోంది, చెమట్లు పడ్తున్నయి అన్నాడు కుర్రాడు. ఇంక ఎన్నటికీ పరీక్షలు రాయనవసరం లేని శరీరం మిగిలింది గదిలో.
షాడో స్వరం తియ్యగా, మెత్తగా, మత్తుగా, గమ్మత్తుగా ఆమె, అతని, కుర్రాడి చెవిలో మోగింది. అలా మోగుతూనే చులాగ్గా అనేకమంది ప్రాణాల్ని చేతి సంచీలో వేసుకుని పైలోకానికి వెళ్లిపోయింది.
తెలివంటారు. తేటంటారు. సైన్సంటారు. లాజిక్కంటారు, రీజనింగంటారు చంద్రుడ్ని తొక్కామంటారు, మార్సు మీదికెక్కామంటారు ఈ మనుషులు. కానీ బ్రహ్మదేవుడు శ్రమించి మానుఫ్యాక్చర్ చేసిన తమ శరీరాల్ని గడ్డిపోచకన్నా హీనంగా చూస్తున్నారు. ‘సేవ్ చేసుకోలేకపోతున్నారు' అని నవ్వుకున్నాడు పైలోకపు బిగ్ బాస్ ‘లాగవుట్' అవుతూ.
-చింతపట్ల సుదర్శన్
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications