క్విక్ బాక్సింగ్: న్యూ‘జయ’ ఇయర్ డే!
జయ నామ సంవత్సరం అందరికీ జయమే ప్రసాదిస్తుందా! అందరికీ అంటే మంచోళ్లతోపాటు చెడ్డోళ్లకీ, మంచితోపాటు చెడుకీ ‘విక్టరీ' ఇచ్చేస్తుందా? విజయనామ సంవత్సరం సూట్ కేసు, ఎయిర్ బ్యాగు సర్దుకుని వెళ్లిపోతుంటే తన ‘లగేజీ'తో డ్యూటీలో జాయినవుతున్న జయ సంవత్సరం ఎట్లాంటి ఫలితాల్ని మూటగట్టుకు వచ్చిందో!
ఈ సంవత్సరం రాజు రవీ, బుధుడు, గురువూ ఎవరో ఒకరైతేనేం రాజన్నాక జబర్దస్తీ తప్పదు. రాజుకు తగ్గట్టే మంత్రీ సేనాపతీ వుంటారు. రాజు ‘తాన' అంటే ‘తందాన' అంటారు. ఇక రసాధిపతి ‘డ్రంకెన్ డ్రైవు' చేయిస్తే నీరసాధిపతి సెల్ టవర్లు, బహుళ అంతస్తుల బిల్డింగులూ ఎక్కించి తోసేస్తాడు. పశు సంరక్షకుడు శ్రీకృష్ణుడే ‘అయితే', ఆయన వేరే పనుల్లో బిజీగా వుంటాడు కనుక పశువులు రోడ్ల కడ్డం పడి తిరగడం మామూలే. దొంగచేతికి తాళం యివ్వడం మంచిదని ధాన్యాధిపత్యం ఏ కుజుడికో దక్కితే ఆయన ‘స్కాం'లతో ‘దొంగ చేతికి తాళాలు యివ్వరాదు' అనే సత్యం నిరూపిస్తాడు.
ఈ సంవత్సరం ఎండాకాలంలో వర్షాలు, శిలాపాతాలు (వడగళ్లవానలు) సుడిగాలులు (గుడిశెల అడ్రసు మాయం) కురిస్తే వర్షాకాలంలో ఎండలు కాస్తాయి. సీజన్‌లన్నీ ‘బాస్' మాటలు వినడం మానేశాయి మరి. ఇక వాతావరణం కట్టుకున్న శంఖు మార్కు లుంగీకి చిల్లుపడ్డంతో వాయుగండాల నెవరూహించగలరు. నీలం, కత్రినా, లైలా ఆ తర్వాత ఏ సుందరి తెరచించేయ వస్తుందో ఎవరికెరుక?
ఈ సంవత్సరం ఉత్తరంలో ఉపద్రవాలు, పశ్చిమంలో సన్సెషన్, దక్షిణంలో స్మగ్లింగులు మధ్య దేశంలో మాపియాలు వుంటే వుంటాయి. పనికొచ్చే వర్షాలు రెండు పాళ్లు, నిండాముంచే వానలు ఇరవై మూడు పాళ్లు, పాపం మూడు పాతికలు, పాపం నిర్విఘ్నంగా చెయ్యడానికి పుణ్యం ఓ పదిపాళ్లు, అసత్యం తొంభైపాళ్లు సత్యం, సత్యం మిగిలిన పాళ్లు, అన్యాయం నూరుపాళ్లు, హింస అన్నేపాళ్లు, దొంగతనాలూ, రేపులూ, కిడ్నాపులూ, అప్పులూ, పన్నులూ, హత్యలూ, ఆత్మహత్యలూ ‘భూజల వాయు' ప్రమాదాలు అనేకపాళ్లు. ఆదాయం వ్యయం కంటే ఎక్కువ అనిపించినా వ్యయమే ఆదాయం కంటే ఎక్కువ. ఇంట్లో రాజపూజ్యం కోసం తిప్పలు పడచ్చు కానీ బయట అవమానాలు లెక్కపెట్టవలసిన పని లేదు. దులిపేసుకోవడమే.

ఈ సంవత్సరం అన్ని రాశుల వారిని ఉన్న గ్రహాల్లో ఏదో ఒక గ్రహం పట్టి పీడించకపోదు. అందువల్ల అది యేగ్రహమో కనిపెట్టడానికి ‘టైం' వేస్టు చెయ్యడం కంటే అన్ని గ్రహాలకీ ‘హోల్ సేల్'గా శాంతి చేయించడం బెటర్. ‘మేక రాశి' వారికి ఈ సంవత్సరం జాగ్రత్త ఎంతో అవసరం. కాన్ఫిడెన్స్ ఓవరయితే మాత్రం బిర్యానీ పీస్ గానో, ఉండల్లో కైమా గానో మారే అవకాశం వుంది. దేర్‌ఫోర్ ఎక్కడ పడితే అక్కడ గంతులేయకుండా ‘లుక్ బిఫోర్ యూ లీప్'ను గుర్తుంచుకోవాలి.
‘ఎద్దు రాశి' వారికి ఏ సంవత్సరమైనా ఒకటే. ఏ చేలో పడితే ఆ చేలో మేయవచ్చు. కొమ్ములు విసిరి సాధించుకోవచ్చు. ‘మేక్ హే వైల్ ది సన్‌షైన్' అంటూ ఏ గడ్డి కనిపిస్తే ఆ గడ్డి కరవడానికి ప్రయత్నించకండి. ‘మిథున రాశి' వారు ప్రేమ గుడ్డిదంటూ వెనకా ముందూ చూడకుండా ప్రొసీడయితే ట్రాజడీ స్టోరీ క్యారెక్టర్సయ్యే ప్రమాదం వుంది. మొదలు పెట్టేటప్పుడే బాగా ఆలోచించాలి ‘గుడ్ బిగినింగ్ మేక్స్ గుడ్ ఎండింగ్' అన్నారు. ‘ఎండ్రకాయ రాశి' వారు పట్టింది వదలకుండా వుంటే ఏదయినా సాధించగలరు. ‘ఐ ఫర్ ఐ-టూత్ ఫర్ టూత్' అని మొండిగా వుంటే అంతా మంచే.
‘సింహరాశి' వారి సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ మధ్య సినిమాల్లో సింహం గోల ఎక్కువయింది. ‘స్ట్రయిక్ వైల్ ది ఐరన్ ఈజ్ హాట్' అన్నది ఫాలో అయ్యి అవసరమైనప్పుడు పంజా విప్పండి.. మజాగా వుండండి. ‘కన్యా రాశి' వారు అమాయకంగా వుంటే మోసపోక తప్పదు. పగలైనా రాత్రయినా ‘పెప్పర్ స్ప్రే'ని వెంట వుంచుకుంటే మేలు. వీలయినంత మటుకి ఇల్లు కదలకండి. వర్క్ ఫ్రం హోమ్ అనండి ‘ఈస్ట్ వెస్ట్ హోమ్ ఈజ్ బెస్ట్'. ఇక ‘త్రాసు' లేదా ‘తరాజు రాశి' వారు ఆలోచించి ఆచితూచి యే పనైనా చేస్తారు కనుక అంతా శుభమే. ‘రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే' అని భావించే వీరు జీవితంలో లాభనష్టాలను బ్యాలెన్సు చేసుకుంటూ సాగుతారు.
‘తేలురాశి'వారు ఎప్పుడు ఎవర్నీ ఎందుకు కుడ్తారో తెలీదు కాబట్టి వీరికంటే వీరి చుట్టు పక్కల వున్నవారు ఎక్కువ జాగ్రత్తగా వుండడం అవసరం. గోడ మీద బొమ్మ కూడా కుట్టటం మీద కంటే ‘సేఫ్టీ' మీద దృష్టి వుంచాలి. ‘న్యూ బ్రూమ్ స్వీప్స్ క్లీన్' కనుక అపాయాల్ని ఉపాయంగా ఎదుర్కోవాలి. ‘మొసలి రాశి'వారు ఏనుగునయినా సరే నోట కరిస్తే వదలరు. వారి పట్టుదలే వారికి రక్షా శిక్ష్. మొసలి కన్నీటి వల్ల కొన్ని సార్లు పన్లు పూర్తవుతాయి. అయితే ఊరికే ఇసకలో పడి నిద్దరోతే ‘అయిడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్' కదా, పాపపుటాలోచన్లు వస్తయి.
చేపరాశి వారు చేతికి చిక్కకుండా జారిపోతారు. ఎల్లప్పుడూ స్విమ్మింగే చేస్తుంటారు గనుక ఆరోగ్యానికి ఢోకాలేదు. పొరపాటున ఎవరి‘వల్లో'నయినా పడితే మాత్రం ‘టూమెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్' అన్నట్టు ఏ షేప్‌లోకి మారుతారో ఏమో!
రాశులేవైనా గ్రహాలెక్కడెక్కడ సిట్టింగ్ చేసినా మనుషులంతా గాడిదలకు వెనకక్కాళ్ల దగ్గరగా, కుక్కలకు పిక్క దొరికే చోటా వుండకపోవడం మంచిది. ఏ సంవత్సరం కొత్తగా వచ్చినా మనుషులందరూ తమ స్వశక్తిని నమ్ముకోవడం, కష్టించి పని చేయడమే విక్టరీ సీక్రెట్. అదే జయనామ సంవత్సరం మనకు గిఫ్టిచ్చే జయం. ‘ఏ గోల్డెన్ కీ కెన్ ఓపెన్ ఎనీ డోర్'.
- చింతపట్ల సుదర్శన్












Click it and Unblock the Notifications