క్విక్ బాక్సింగ్: బీ బోల్డ్ టు బోర్న్

ఎక్కడున్నదీ తెలీడం లేదు. మెత్తగా నున్నగా వెచ్చగా తగులుతున్నయి గోడలు. నేనున్నది ఒక రేకులు ముడ్చుకున్న తామర పూవులోనో లేక ఒక మెత్తటి గుడ్డ సంచీలోనో.

నిన్నా మొన్నటి దాకా నేనెక్కడున్నానో తెలీదు. నేనసలు వున్నానో లేనో తెలీదు. కానీ యిప్పుడు నేను వున్నాననిపిస్తుంది. ఒక పొడవాటి తీగలోనుంచి నా లోపలికి ఏదో ప్రవహించినన్ను ఉత్సాహపరుస్తున్నది. ఒక్క దగ్గర కుదురుగ్గా వుండనీయడం లేదు. పైకీ కిందకీ కదుల్తున్నాను. గుండ్రంగా తిరుగుతున్నాను. నాకు సంబంధించిన దేంతోనో పూవు రేకుల గోడల్ని, సంచీ లోపలి అంచుల్నీ చిన్నగా తంతున్నాను.

ఇక్కడంతా చీకటిగా వున్నా, జర్రున జారిపోయే ద్రవంలో హాయిగా తేలుతున్నా యింకా ఏమో చెయ్యాలనిపిస్తున్నది. ఎక్కడికో వెళ్లి పోవాలనిపిస్తున్నది. ఇక్కడ్నించి ఎక్కడికో వెళ్లి తీరాలనిపిస్తున్నది. ఎక్కడోవున్న నన్ను ఎవరెవరో తడుముతారు. ఇదిగో తల అంటారొకరు. అదిగో కాళ్లు అంటారు ఇంకొకరు. ఇప్పుడిప్పుడే ఏవో మాటలు గుసగుసగా వినిపించేది. కడుపు చిన్నగావుంది ఈసారి మగపిల్లాడే అని వినిపిస్తుంది. ఇది వరకు లాగా పెద్దదిగానే అనిపిస్తుంది. మళ్లీ ఆడ పిల్ల పుట్టదు గదా అని వినిపించేది.

అసలీ తలేమిటో కాళ్లేమిటో అర్థం కాదు. ఆడపిల్లేమిటి మగ పిల్లాడేమిటి అస్సలు అర్థం కాదు. వినగా వినగా అర్థం కావచ్చింది. నేనువున్న చోట ఆడపిల్లో, మగ పిల్లాడో వుండాలి. అంటే నేను ఆడ పిల్లనో, మగ పిల్లాడినో అయివుండాలి. నేనసలు ఎవర్ని?..

ఎవరినయితే ఏంలే? ఎవరినో ఒకరిని అనుకున్నా. కానీ క్రమంగా ఎవరినో ఒకరిని అవడానికి వీల్లేదని అందరికీ ఆ ఇద్దరిలో నేను ‘ఒకర్ని' మాత్రమే అయివుండాలని తెలిసి వచ్చింది.

 Quick boxing: Be bold to bores

నన్ను అప్పుడప్పుడూ రెండు అరచేతుల్తో అప్యాయంగా నిమిరే అరచేతులంటే నాకెంతో ఇష్టం ఏర్పడింది. బహుశా ఆ చేతులకు సంబంధించిన దాన్నేమో నేను. నాకనిపిస్తుంది ఆ చేత్తుల్లోకి వెళ్లిపోవడం కోసమే నా తపనంతా అని.

ఆ తడిమే చేతులు గుసగుసగా ఏదో అంటున్నట్టనిపించేది. ‘ఈసారి ఆడపిల్లయితే చంపేస్తాడు'. ‘మగ పిల్లాడు కావాలి దేముడా ఈసారి మగపిల్లాడే కావాలి'. అంటున్నట్టనిపించేది.

ఒకసారి ఒక గొంతు వినపడింది. వింటుంటే భయం వేసింది. ‘ఈసారి ఆడపిల్ల అయితే మాత్రం తన్ని తరిమేస్తాను. నీ దిక్కున్న చోటికి పో' అంటున్న ఆ ధ్వని వింటే వణుకువచ్చేది. అది విన్నప్పుడల్లా విలవిల్లాడిపోయేదాన్ని.

ఒక్కోసారి నాలుగయిదు రకాల శబ్ధాలు వినిపించేవి. నువ్వెన్నయినా చెప్పు ఆడ పిల్లలకి రక్షణలేదు. నిర్భయ చట్టమయితేనేం మరోటి అయితేనేం ఆడపిల్లకు రక్షణే లేదు. తెల్లవారుఝామున రైలు దిగిన ఆడ పిల్ల బూడిదయి పోయింది. ఎంత చదువుకుంటేనేం ఎంత పెద్ద ఉద్యోగం చేస్తేనేం? క్యాబ్‌లో ఇంటికి పోదామని ఎక్కిన ఆడపల్ల ఎన్నో గంటలు కంప్యూటర్ ముందు పనిచేసిన పిల్ల కాటికిపోయింది. అసలు ఆడదయితే చాలు. వయసు వరుస అన్నీ వదిలేస్తున్నారు. నాలుగేళ్ల పిల్లని కూడా వదల్డం లేదు. వద్దమ్మా వద్దు ఆడ పిల్లని కనవద్దు. కాలం మారినా యుగం మారినా మగవాడెప్పుడూ ‘మృగాడే' ఛీ పశువు... ఇలాగ ఎన్నెన్నో మాటలు వినిపించేవి.

ఇప్పుడు నాకు విషయం పూర్తిగా స్పష్టంగా అర్థమయ్యింది. నేను మగ పిల్లవాడినో, ఆడపిల్లనో అయివుండాలి. అయితే విన్నదాన్ని బట్టి ఆడ పిల్లనయితే బాగుండదని, నేను ఆడపిల్లని కాకుండా వుంటే బాగుండునని అనిపించింది. ఆడపల్లని కాకుండా వుంటానికి నేనేం చెయ్యాలి? నేనసలు ఆడ పిల్లనా? మగ పిల్లవాడినా? ఎవరిని?

కొన్నాళ్లకి నేను మగ పిల్లాడినే అయివుండాలని గట్టిగా అనిపించేది. ఆడపిల్లనయి వుండడం కంటే అసలు వుండక పోవడమే మంచిదనిపించింది. నేనసలు లేకుండా వుండాలంటే ఎలా? ఒక వేళ నేను ఆడ పిల్లనయితే అసలు వుండకపోవడమే మంచిదనిపించేది.

ఇలావుండగా ఒకనాడు నేనున్నచోటికి ఏదో వెలుతురు వస్తున్నట్టనిపించింది. వెలుతురు నా ఒళ్లంతా తడిమింది. నేను వణికిపోయాను. ఇంక ఎంతోకాలం ఇక్కడువండవు నువ్వు రేపే లోకంలోకి వెళ్తావు అని వినిపించింది. ‘వద్దు నేను ఎక్కడికీ వెళ్లను. ఒక వేళ ఆడపిల్లనయితే ఇక్కడే వుండిపోతాను లేదా అసలెక్కడావుండను' అని అరిచానో లేదో తెలీదు కానీ తీవ్రంగా కదిలాను. వణికాను.

నీ జాతకం రాసి నిన్ను లోకంలోకి పంప వచ్చిన సృష్టికర్తను నేను. నువ్వు ఆడ పిల్లవే ఇంకొన్ని గంటల్లో లోకానికి వెళ్లాల్సిందే!

నేను మరింత వణికిపోయాను. ఒద్దు నన్ను ఆడ పిల్లని చెయ్యద్దు. లోకంలోకి పంపద్దు అన్నాను.

ఆడతనమంటే భయపడేట్టు చేశారు నిన్నెవరో! తల్లీ నీ తల్లి నిన్ను కన్నట్టే నువ్వూ సృష్టి కార్యాన్ని కొనసాగించాలి. అశోకుడయినా, అక్బరయినా, అలెంగ్జాండరయినా అమ్మ కడుపులోంచి పుట్టినవారే. ఏ మగవాడికయినా ప్రాణం పోసేది ఆడదే! నీకేం భయం లేదు. నీ జాతకం అద్భుతంగా వుంటుంది. ఏ మగాడూ నిన్ను ఏమి చెయ్యలేడు. మగవాడికంటే ఎక్కువ తెలివితేటలు, ధైర్య సాహసాలు నీ స్వంతం చేస్తున్నాను. నువ్వు నిర్భయంగా లోకంలోకి వెళ్తావు అన్నాడు సృష్టికర్త.

నాకేకాదు.. ఇకముందు లోకంలో పుట్టే ఆడపిల్లలందరికీ మగవాడి దుర్మార్గాన్ని ఎదిరించే శక్తినివ్వు! ఆడపిల్లని అబలగా పుట్టించకు! అన్నాను నేను పుట్టబోయే ఆడ పిల్లను.

(మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా)

- చింతపట్ల సుదర్శన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+