వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: ‘బూత్’ బంగ్లా

|
Google Oneindia TeluguNews

హలో పార్లమెంటు ఈవిఎమ్ కులాసానా అడిగింది అసెంబ్లీ ఈవిఎం పార్లమెంట్ ఈవిఎమ్‌ని.

హలో అసెంబ్లీ ఈవిఎమ్ దిలాసానా అడిగింది పార్లమెంట్ ఈవిఎమ్ అసెంబ్లీ ఈవిఎమ్‌ని.

నిజానికి రెండింటి జాతీ, మతమూ, కులమూ, రూపు రేఖలూ ఒకటే కానీ స్టీలు బల్ల మీద వెల్లకిల్లా పడుకుని పార్లమెంట్ అని రాసున్న అట్టముక్కల దడి చుట్టుకుని వున్నది పార్లమెంట్ ఈవిఎమ్, అట్లాగే అసెంబ్లీ అక్షరాల దడి కట్టుకుని టేబిల్ మీద ఒళ్లు జార వేసుకున్నది అసెంబ్లీ ఈవిఎమ్.

ఈ దేశానికి లీడర్లను అందించే మహాయజ్ఞంలో అనేకులతోపాటు తమ డ్యూటీ చెయ్యడానికి వచ్చిన యంత్రాలివ్వి.

ఏమిటో ఈ గది వుయ్యాల్లో వూగులాడ్తున్నది. స్విచ్చీ బోర్డులు ఒకదానికొకటి సంబంధం లేకుండా వున్నవి. లైటు స్విచ్చి నొక్కితే ఫ్యాను తిరుగుతున్నది. ఫ్యాను స్విచ్చి నొక్కితే లైటు వెల్గుతున్నది. గోడల పగుళ్లలోంచి పళ్లికిలిస్తున్న వైర్లు ఏ క్షణాన్న పుటుక్కుమంటయో తెలీదు. అవి జరజర జారి డుబుక్కుమే అన్నవో మనిద్దరం మొరాయించక తప్పదు. మన డ్యూటీకి భంగం కలక్కా తప్పదు అన్నది అసెంబ్లీ ఈవిఎమ్. ఔను సుమా అన్నది పార్లమెంట్ ఈవిఎమ్ నీవన్నది నిజం సుమా అన్నది కంట్రోలింగ్ మెషీను ఇద్దరినీ పలకరిస్తూ.

పైకప్పులాగా వున్నాం కానీ గాలి గట్టిగా విసిర్తే పైకెగిరిపోయే కప్పులం మనం అన్నవి రేకులు దడదడమంటూ పదే పదే.

రేకుల్లోంచి వచ్చేకాకకి తట్టుకోలేక ప్రభుత్వ డ్యూటీ చెయ్యకపోతే అదేదో చట్టం క్రింద జైలు పాలవుతామని భయపడి వచ్చిన ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆయన అసిస్టెంటూ లుంగీలు చుట్టుకుని బనీన్లు వీపుకి అతికించుకుని గోడలకు అభ్యర్థుల పేర్లూ, గుర్తులూ వున్న పోస్టర్లని అతికిస్తున్నారు. చెమటోడుస్తూ ఆ పని చెయ్యాల్సిన వాడు టీ పట్టుకొస్తానని పత్తా లేకుండా పోయాడు.

Quick Boxing: Chintapatla Sudarshan on Polling

కిటికీ ఊచల మీద గుంపులుగుంపులుగా చేరిన దోమలు ఈళ్లిద్దర్నీ ఈ రాత్రి మనమంతా కల్సి కిడ్నాపు చేశామనుకో వీళ్ల డ్యూటీ లేమవుతాయి అని జోకులేసుకో సాగినయి.

ఆకాశంలో మెరుపు మెరిసింది. ఎక్కడో పిడుగు కూడా పడ్డది. ఈ రాత్రి వర్షం కనక వస్తే అన్నాడు దిగాలుగా బెంగగా భయంగా ప్రిసైడింగ్. వేసవి కాలం కదా సార్! ఏం రాదులే అని కొంచెం కాన్పిడెన్స్ అప్పిచ్చాడు అసిస్టెంట్.

పోలింగ్ డ్యూటీకి వెళ్లే వారికి సకల సౌకర్యాలు అనేక మర్యాదలు అన్నారే అన్నాడు ప్రిసైడింగ్ బట్టతల మీంచి నుదుటి మీదకి కారుతున్న చెమటని అరచేత్తో ఎత్తిపోస్తూ.

చెప్పడానికేం సార్ చెప్పేవాడెవడూ ఇక్కడికొచ్చి ఈ రేకుల కొట్టంలో కూచోడు ఏసీ రూంలో కూచుని చెప్తాడు, పనులు పురమాయిస్తాడు. మనఖర్మ మనమే కదా సార్ అనుభవించాలి అన్నాడు అసిస్టెంట్ కొంచెం వేదాంతం కూడా తెల్సిన వాడు.

బస్తీలో అనేకం ఇళ్లున్నయి. ఒకళ్లూ ఇటువైపురారేం. మనం సరంజామాతో దిగగానే పోలోమంటూ వొచ్చి కాస్సేపు వింత మనుషుల్ని చూసిన ఆనందాన్ని అనుభవించి వెళ్లిపోయారు అని నిట్టూర్చాడు ప్రిసైడింగ్ అలా నిట్టూర్చకండి సార్! ప్రిసైడింగ్ అనగానేమి మీరు తల్చుకుంటే రేపు రేపు ఫైరింగ్ ఆర్డరు కూడా వేయవచ్చట అన్నాడు అసిస్టెంట్ అవకాశం వచ్చిందని నవ్వుతూ.

ఎవడన్నాడా మాట. ముందు మనం బతికుండాలి కదా అన్నాడు. ఈసారి ప్రిసైడింగ్ ఖర్మను ఎదుర్కోవడానికి ఛాన్సు వచ్చిందని ఛాన్సు వచ్చిందని రాకపోయినా నవ్వేస్తూ.

ఇంతకీ వీడు టీ తెస్తాడంటారా? అసలోస్తాడంటారా సార్ అనడిగాడు అసిస్టెంట్ చీకట్లోకి చూస్తూ.

పోనీలేవయ్యా ఈ చుట్టు పక్కల తిండానికి ఏమీ దొరికేట్టు లేదు. ఇదీ ఒకందుకి మంచిదే అప్ లోడ్ లేకపోతే డౌన్ లోడ్ బాధుండదు. పైగా బాత్రూమ్ కోసం చచ్చే చావుండదు.

ఇంతలో ఎవరో వస్తున్న ధ్వని వినవచ్చింది.

మనవాడు వచ్చేస్తున్నాడు. జారిపోతున్న లుంగీని బిగించికడ్తూ అన్నాడు అసిస్టెంట్ వచ్చినవాడు పని వాడు కాదు.. లోపల్కి తొంగిచూస్తూ నించున్నాడు.

ఎవరోయ్ ఏం కావాలి అడిగాడు అసిస్టెంట్.

నేనా సార్.. నేను.. ‘మందేడ'సార్ అన్నాడతను.

గుప్పుమంది రేకుల గది.

ఆల్ రడీ మందు మీదేవున్నావు గదరా మళ్లీ మందేడ అంటావేంరా అనుకున్నారిద్దరూ. గదే సార్.. ఓటేస్తే మందిస్తరంట గద కోటర్.. కోటర్ ఏడిస్తున్నరు సార్ అన్నాడతను కాళ్లు చేతులూ తన మాట వినక పోవడాన్ని గమనించకుండా.

ఇక్కడ కాదు పో! పో! అన్నాడు ప్రిసైడింగ్. మరెక్కడ. కోటరిస్తున్నారంట గద. మరి ఓటెయ్యాల్నా వద్దా అన్నాడతను నడ్డిమీద చెయ్యి పెట్టుకుని స్టెడీగా వుంటానికి విఫలయత్నం చేస్తూ.

లాభం లేదింక అనుకున్న అసిస్టెంట్ పోపో పోలీసోళ్లు వొస్తున్నారు అనరిచాడు.

పోలీసుసోళ్లన్న మాట వినంగానే ఆ తాగుబోతు ‘అథ్లెట్' అయి మాయమయి పోయేడు.

తెల్లారింది. ఇట్లాంటి పోలింగ్ బూతులెన్నింటిలోనో ఈవిఎమ్‌లు బీప్ బీప్ మన్నయి. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గర్వంగా తలెత్తుకు నిలబడ్డది. నిలబడ్తున్నది.

కానీ అరకొర సౌకర్యాలు కాదు అసలే సౌకర్యాలు లేని చోట యిరుకు గదుల్లో తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకని చోట తెల్లవార్లూ ఎన్నికల డ్యూటీకి వచ్చిన వేలాది మంది ఆడామగా అధికార్ల గోడు వినేదెవ్వరు? ఆడిట్ లేని డబ్బు మంచి నీళ్లల్లా కాగితాల మీద ఖర్చవ్వడం షరా మామూలేనా? లీడర్లు లీడర్లవ్వడానికి శ్రమించే సిబ్బందికి, లీడర్లని లీడర్లుగా నిలబెట్టే లక్షలమంది సామాన్య ఓటర్లకి అందని ప్రజాస్వామ్య ఫలాలు ఎవరికి అందుతున్నవో!! భోగభాగ్యాలు సుఖ సౌకర్య సంతోషాలు ఎప్పుడూ రాజులకేనా?!

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan writes about election polling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X