క్విక్ బాక్సింగ్: ఆపరేషన్ బెర్లిన్ స్టోన్

అన్ని రాళ్లూ ఒక్కలావుండవు. అందుకే ఏరాయయితేనేం పళ్లూడ గొట్టడానికి అని అనలేం. అన్ని రాళ్లూ అన్ని పళ్లూ వూడగొట్టలేవు కనక రాళ్లల్లోనూ గొప్ప రాళ్లుంటాయని, గొప్ప రాళ్లకి చరిత్ర గోళమూ వుంటుందని తెల్సుకోవడం అవసరం.

అదో హాలు పెద్దది. అదో హాలు చల్లది. ఏసీలతోపాటు ఏమేం అమర్చేరో గానీ బయటకి ఒక్క ముక్కా వినపడదు, ఒక్క ముఖమూ కనపడదు. హాల్లో జరుగుతున్నది ఓ అత్యంత రహస్య సమావేశం. నేర పరిశోధక శాఖ డైరెక్టర్ సిన్హా వున్నారు. ఓ డజనుమంది స్వదేశీ గూఢచారులు ఓ పావు డజను మంది విదేశీ గూఢచారులు వున్నారు.

పెద్ద కంప్యూటర్ తెర వెలుగుతున్నది. వెలుగుతున్న తెర మీద ఒక వస్తువు అటూ ఇటూ కదుల్తున్నది. కదలడమూ దొర్లడమూ చేస్తున్న ఆ వస్తువు మరోటీ ఇంకోటీ కాదు. ఒకే ఒక రాయి. ఓన్లీ వన్ స్టోన్ ఓన్లీ. రాయంటే వీపుకి కట్టుకుని గంగలో దూకి చచ్చేంత పెద్ద బండరాయేం కాదు. చిన్న రాయే. చిన్నదంటే చిన్నదే. పళ్లూడగొట్టలేదు. చింతకాయలు వొదలేండి, మామిడి కాయలు కూడా రాల్చే శక్తి లేని రాయి అది. అయితేనేం అక్కడ వున్న వాళ్లంతా గుండెలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నారు. కళ్లు ఒంటి దగ్గర పెట్టుకుని చూస్తున్నారు పరీక్షగా. అవును అదొక రాయే. కానీ మామూలు రాయి మాత్రం కానేకాదు.

కంప్యూటర్ తెరమీద వెలుగు ముఖం వేలాడేసింది. రాయి ముఖం దాచేసుకుంది. అప్పుడు కదిలారు సిన్హాగారు. ఆకాశంలో చుక్కల్లాగా ఒకదాని తర్వాత ఒకటి వెలిగిన లైట్లు హాలు గోడల మీద వెలుతురు వాంతి చేసుకున్నయి.

Quick boxing: Kiran Berlin stone story

చూశారు గదా! ఇదో మామూలు ఆషామాషీ రాయి కాదు. ‘ఆపరేషన్ బెర్లిన్ స్టోన్' మొదలయ్యింది వరల్డ్ వైడ్‌గా. ఇండియాలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ రాయి వుందన్న అనుమానంతో వాళ్లు యిక్కడికి పని గట్టుకు వచ్చారు అటూ ఓ వరస కుర్చీలో కూర్చున్న ముగ్గురివేపూ చేయిచాచి చూపారు సిన్హాజీ. ఆ ముగ్గురూ తెల్లగా వున్నారు. పొడవుగానూ బలంగానూ వున్నారు. ఒకడికి మీసాల్లేవు. మీసాలున్న యిద్దరిలో ఒకడు గొంతు సవరించుకున్నాడు.

మేం జర్మనీ గూఢచారి పోలీసులం అన్నాడతను. తెలుగు వచ్చిన జర్మనీ పోలీసు చెప్పే విషయాన్ని అందరూ ఆసక్తిగా వినసాగారు.

మీలో చరిత్ర చదువుకున్న వాళ్లకి జర్మనీలో బెర్లిన్ గోడ గురించి తెలిసేవుంటుంది. తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య వున్న గోడను కూలగొట్టడం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆ గోడ కూల్చబడిన తర్వాత దాని రాళ్లను పెద్ద సైజు నుంచి చేతిలో ఇమిడేంత వరకూవున్న వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు జర్మనీయులు అంటే మావాళ్లు. టేబిల్ మీద గ్లాసులో మీసాలు ముంచుతూ నీళ్లు తాగేసి మళ్లీ కంటిన్యూ చేశాడతను. ఆరాళ్లన్నింటికీ నంబర్లు వేశారు. అపురూపంగా దాచుకున్నారు. ఇదో ప్రిస్టిజియస్ మ్యూజియమ్ అని అలసిపోయాడతను.

మరో మీసాలున్న వ్యక్తి మీసాల్లేని వ్యక్తికేసి చూశాడు. వాడు నవ్వీనవ్వనట్టు నవ్వి తలూపాడు. మీసాలున్న మరో వాడు మొదలు పెట్టాడు. ఆ మ్యూజియమ్ లోనుంచి ఒక రాయి మాయమైంది. అది ఎంతుందో ఎలా వుందో మీకందరికీ చూపించాం. ఇది మా దేశ గౌరవానికి సంబంధించిన విషయం. ‘ఆర్యన్ రేస్' సంగతి మీకు తెలియంది కాదు. ఆ రాయి కోసం మరోదో మూడోదో ప్రపంచ యుద్ధం చెయ్యడానికి మా వాళ్లు వెనక్కి తగ్గరు. మీ ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తానని మాటిచ్చింది. రహస్యంగా జరుగుతున్న ఈ ‘ఆపరేషన్ బెర్లిన్ స్టోన్'కి మీ కో ఆపరేషన్ కోసం వచ్చాం మేం అన్నాడతను దేశీయ గూఢచారుల మొహాల్లోకి పరీక్షగా చూస్తూ.

దేశీయ గూఢచారుల్లో ఒకతను దగ్గాడు. గొంతు సవరించుకున్నాడు. ఆ స్మార్ట్ అండ్ డ్యూటీ మైండెడ్ ఆఫీసర్ వైపు చూస్తూ ప్రశంసా పూర్వకంగా తలూపాడు సిన్హా.

అతను మొదలెట్టాడు. జర్మనీ మ్యూజియంలో మాయమైన ప్రిస్టీజియస్ స్టోన్‌కు సంబంధించిన విషయాలన్నీ నిద్రాహారాలు మానకుండా స్టడీ చేశా. సీడీలూ ఫైళ్లూ తిప్పేసి తిరిగేశా. ఈ ఆపరేషన్ బెర్లిన్ స్టోన్ మిషన్‌ని నా కప్పచెప్పిన మా డైరెక్టర్ గారికి థాంక్స్ అంటూ వినయంగా ఒక్క క్షణం వొంగి మళ్లీ జండా కర్రలా నిలబడి చెప్పాడతను. ఇటీవలి కాలంలో ఒక రాజకీయ నాయకుడు, ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ప్రసంగిస్తూ టీవీలో ఒక రాయిని ప్రదర్శించాడు. ఆరాయి కూలగొట్టబడిన బెర్లిన్ గోడదే అని కూడా చెప్పాడు. అతను కాసేపు ఆగాడు. అందరూ ఉత్సుకతగా అతని వైపే చూడసాగారు. ఆగిన అతను మళ్లీ సాగాడు. ఆయన చెప్పినట్టు అది కూలిన బెర్లిన్ గోడలో రాయి అవవచ్చు లేక అవకనూ పోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. అందుచేత వాళ్లు పొరపాట్న నిజం చెప్పినా నిజంగా నిజమని నమ్మలేం అన్నాడు.

అవునవును అన్నవి కొన్ని గొంతులు ఆ రాజకీయ నాయకుడు టీవీ ఛానళ్లల్లో చూపించిన ఆ రాయి బెర్లిన్ కూలిన గోడలో రాయి అవునో కాదో తేల్చడానికి మన శాఖ పదహారు బృందాలను ఏర్పాటు చేసింది. అవసరమయితే పారామిలిటరీ దళాలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌తోపాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుని కూడా వినియోగించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగావుంది. ఆ రాయిని ఎలాగైనా సరే సంపాదిస్తాం. అది కూలిన బెర్లిన్ గోడలో రాయే అయితే ఓ అయిదు సంవత్సరాల్లో ఇక్కడికి ఎలా వచ్చిందో తేలుస్తాం. తేల్చాక రాయినీ, కల్‌ ప్రిట్‌నీ మీకు అప్పచెప్పుతాం అన్నాడు జర్మనీ పోలీసు గూఢచారులవైపు చూస్తూ.

ఒక వేళ అది బెర్లిన్ గోడ కూలినప్పటి రాయి కాకుండా ఏ తొక్కలో రాయో అయితే అన్నాడో డ్యూటీకి తక్కువా డవుట్లకి ఎక్కువా అయిన ఆఫీసర్.

ఒక వేళ అది కూలిన బెర్లిన్ గోడ రాయి కాక తొక్కలో రాయి అయితే దాన్ని ప్రజలకే యిచ్చేద్దాం. దాంతో ఎవర్ని కొట్టాలో వాళ్లనే నిర్ణయించుకోమందాం అన్నాడా స్మార్ట్ ఆఫీసర్. అందరూ చప్పట్లు కొట్టారు.

- చింతపట్ల సుదర్శన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+