క్విక్ బాక్సింగ్: ఇప్పుడు వీస్తున్న గాలి
ఎవరు? అనడిగాడతను తన ముందుకు వొచ్చికూచున్న యిద్దర్నీ అడగాలి కనక.
మేం తెలీదా? మేమెవరమో మేమే చెప్పుకోవాలా అన్నది ఆమె.
అంతేకదా తెలీకపోతే తెలీదంటాం కదా తెలీనప్పుడు తెలిసేట్టు చైడానికి మీరెవరో మీరు కాకపోతే మరెవరైనా ఎలా చెప్పగల్రు.
సరే! చెప్పుకోక తప్పదంటున్నారు సో చెప్పుకోవాలని లేకపోయినా చెప్పక తప్పడం లేదు కనుక చెప్పుతున్నా అన్నదామె ఆ ఇద్దరిలో ఒకరయిన ఆమె.
చెప్పండి. లేటెందుకు అన్నాడు అడగక తప్పదని అడిగిన వ్యక్తి.
మేం ఇద్దరం దంపతులం అన్నదామె ఆయన పక్కన కూచున్న ఆమె.
ఐసీ! అలాగా అవును అలాగే అనిపిస్తున్నది మీరిద్దరూ భార్యాభర్తలన్న మాట.
అదేవున్నమాట అంది ఆమె పెద్ద కళ్లు ఇటూ అటూ విసిరేస్తూ. అవునన్నట్టు తల ఆడించేడతను మీసాల కింద రెండు పెదాల మధ్య నుంచి పళ్లు బయటపెట్టి.
ఐతే సరే ఒప్పుకుందాం. మీరిద్దరూ భార్యాభర్తలే అయితే యేం? ఇప్పుడెందుకు వచ్చారని అడగాలి కదా అందుకే అడిగేస్తున్నా. అసలు మీరెందుకు వచ్చారు?
అసలు మేం ఎవరమో తెలీని వారెవరూవుండరు అయినా మీకు తెలీదంటున్నారు కదా తెలీదనే అనుకోవాలి కనుక అనుకుంటున్నాం కానీ నిజానికి మేం చాలా మందికి చాలా చాలా చాలా బాగా తెల్సిన వాళ్లం.

అవునా! అందరికీ ఎంత బాగా ఎంత చాలా తెల్సిన వాళ్లో నేను తెల్సుకోవచ్చా మరి.
తప్పకుండా! తెల్సుకోవాల్సిందేదయినా తెల్సుకోవాల్సిందే మరి. మేం ఇద్దరం సినిమా హీరో హీరోయిన్లం.
నిజంగా! ఆశ్చర్యంగావుందే నేనంతగా సినిమాలు చూడ్ను అయినా చూసిన కొద్దిపాటి వాటిల్లో అంటే సినిమాల్లో మిమ్మల్ని ఎక్కడా చూసినట్టు లేదే.
మేం ఇప్పటి సిన్మాల్లోని వాళ్లం కాదు. ఇవాళా రేపూ వస్తున్న సినిమాలూ ఓ సినిమాలేనా. మేం ఇది వరకటి సిన్మాల్లోని వాళ్లం మంచి సిన్మాల్లో వాళ్లం.. గొప్ప సిన్మాల్లో వాళ్ళం అందామె.
అవును. ఆమె ఏది చెప్తే అదే కరెక్టు అన్నాడొకప్పటి హీరో ఇప్పటికిప్పుడు కాలర్ ఎగరేస్తూ ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నారు? ఎందుకొచ్చారు? ఏం చెయ్యాలనొచ్చారు?
సినిమా ఫీల్డ్ తర్వాత ఈ దేశంలో సేవ చేసుకునేందుకు సెలబ్రిటీలయ్యేందుకు మిగిలున్న ఒకే ఒక్క ఫీల్డు రాజకీయం కదా అంది ఆమె బుగ్గలు ఉబ్బిస్తూ కనుబొమలెగరేస్తూ, పేపర్ వెయిట్‌ని టేబిల్ మీద గిర్రుమని తిప్పిస్తూ.
కదా అంటే కాదండానికి లేదు కదా మరంతే కదా.
అందుకే వచ్చాం. బోలెడు సేవ చేద్దామని వొచ్చాం అందామె భర్త వైపు అదోలా చూస్తూ.
అవునందుకే వచ్చాం సకుటుంబంగా అన్నాడతను భార్య వైపు ఇదోలా చూస్తూ.
రాజకీయమా? అసలది ఏ పదార్థమో తెలిసేవచ్చారా?
ఓ ఫుల్లుగా తెల్సు. సినిమా వాళ్లకు నటనే జీవితం. రాజకీయ నాయకులకు జీవితమే నటన. రైట్ లెఫ్టు అయినా లెఫ్టు రైటయినా మిస్టేకేం లేదు కదా. మాకు అన్ని పార్టీలు తెల్సు అన్ని సిద్ధాంతాలు తెల్సు అన్ని జెండాలు తెల్సు అన్ని సింబల్సూ తెల్సు అందామె తడుం కోకుండా.
అన్నీ తెలుసా? అంటే అన్ని పార్టీలూ తెల్సా అన్నాడడిగేవాడు కంగారులో కంగారుగా కంగారెత్తి.
అవును. అన్నీ తెల్సు. అన్ని పార్టీల్లో పని చేశాం. అన్ని కండువాలూ కప్పుకున్నాం. అన్నీ తీర్థాలూపుచ్చుకున్నాం. ఒక్క మీ పార్టీని తప్ప దేన్నీ వొదిలి పెట్టలేదు. ఇప్పుడందుకే వచ్చాం. మీ పార్టీలో చేరి మీకు కీర్తి తెచ్చి పెడదామని మా కీర్తిని మూట కట్టుకు తెచ్చాం అంది ఆమె.
అవునవును కావల్సినంత కీర్తి తెచ్చాం కదా అన్నాడు అతను జేబులో చెయ్యి పెడ్తూ.
అప్పుడే అన్ని పార్టీల్లోనూ ‘లెగ్' పెట్టి వచ్చారా. అందర్నీ నిమిలేశారా! మీరు మూటకట్టి తెచ్చింది కీర్తా అపకీర్తా అనడుగుదామనీ అడగలేక అలా వుండిపోయాడడగలేని వాడు.
రాజకీయం అంటేనే పార్టీలు ఫిరాయించడం. ఎన్ని పార్టీలు మారితే అంత అనుభవం. అయినా ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైనదేంటో మేం చెప్పక్కర్లేదు. మీకూమాకూ అందరకూ అక్కకొచ్చే ‘చుట్టం' ఎవరో తెలియంది కాదు. దీని కోసం పార్టీలు మార్చడమే కాదు కొత్త పార్టీలు కూడా పుట్టించడం అవసరం. అసలు పార్టీ అనగానేమి నిజమైన అజెండా అంటే యేమిటి అన్న దానిమీద ఆమె ఉపన్యాసం యివ్వడం మొదలుపెట్టింది.
అది విన్న పార్టీ పెద్దకి ప్రశ్నలడిగే ఓపిక నశించి కృంగికృశించి చివరికి స్పృహ తప్పిపోయేడు. ఇక ఆయన మతి సంగతి లేచి కూచున్నప్పుడు కానీ తెలీదు.
భార్యాభర్తలే కాదు, తల్లీ కొడుకులు, తండ్రీ కూతుళ్లు.. అన్నా తమ్ముళ్లు.. బావా బామ్మర్దులు.. అన్నా చెల్లెళ్లు.. మామా అల్లుళ్లు.. అత్తా కోడళ్లు కలివిడిగా విడివిడిగా తమ చుట్టూ తాము తిరుగుతూ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పొలిటికా పొల్యూషన్ అనే వైరస్ గాలిలో నిండిపోయింది. ఊపిరి పీలవకుండా వుండగలిగితే తప్పదాన్నుంచి తప్పించుకోలేరెవరూ!!!
-చింతపట్ల సుదర్శన్












Click it and Unblock the Notifications