తనికెళ్ల భరణి 'సామాన్యసూక్తం': గ్రంథచోరులు
పుస్తకాలు కొనటం.. అనేది కొందరి ఇంటా వంటా వుండదు... ఎక్కాల పుస్తకం దగ్గర్నించీ భగవద్గీత దాకా ఎరువు తెచ్చుకోవడమే పాపం! వాళ్లకదే అచ్చొస్తుంది గాబోలు. తెల్లారగట్ట న్యూస్ పేపర్ కన్నా ముందు మా మూడోఇంటి రిటైర్డ్‌ఆఫీసర్‌గారు వొచ్చి మా గుమ్మంముందు కూర్చుంటాడు గోతికాడ నక్కలాగ. ప్రతిరోజూ ఆయనే ముందు పత్రిక నందుకుని హెడ్‌లైన్స్ దగ్గర్నించి మొదలెట్టి అడ్వటేజ్‌మెంట్లూ, వాంటెడ్ కాలమ్సూ (ఆయన మనవల కోసం) నగరంలో ఆడే సినిమాలూ అన్నీ ఒక్క అక్షరం వొదలకుండా చదువుతూ వుంటాడు.
పొద్దున్నే తగలడ్డందుకు ఆయనకో గుక్కెడు కాఫీ పొయ్యక తప్పదు... అదో నష్టం! ఈ వ్యవహారం నాకు నచ్చక పేపరు కుర్రాడికి చెప్పేశా నాయనా పొద్దున్నే అయనింటికి వెళ్లి ఇచ్చి వొస్తూ వుండూ అని... అంతే! ఏమనుకున్నాడో మళ్ళీ గుమ్మం ఎక్కుతే ఒట్టు. (అంచాత ఆయనకింకా ఇంగితజ్ఞానం వుందని మెచ్చుకోవాలి) రైల్లో ప్రయాణం చేస్తోన్నప్పుడు బోరుకొట్టి నాలుగుపత్రికలు కొనుక్కుంటామా... అంతే! ''మేష్టారూ ఏదీ ఇలా ఇవ్వండి... అంటూ పట్టుకుపోతారు. పోనీ సవ్యంగా చదవగానే తిరిగిస్తారా ఊహూ! వారి తర్వాత వారి భార్య... వారి కూతురు... వారి మొగుడు... వారి స్నేహితులు అలా అలా... పక్క కంపార్టుమెంటుకి వెళ్లిపోతుంది.

మన పుణ్యం మంచిదైతే నలిగో, చిరిగో చేతికొస్తుంది... లేదా... ఎవడో చెప్పులు చుట్టుకుని దిగి చక్కాపోతాడు. ఇంకొంత మంది నవల్లు పట్టికెళ్లి వాటినిండా పెన్సిల్‌తో అండర్‌లైన్లూ... వారి సొంత అభిప్రాయాలూ... వారి పిల్లల చేతిబొమ్మలూ వేయించి అట్టచింపి సారీ! అండీ అంటూ మరోటి పట్టుకుపోతారు.
మా మిత్రుడికో పెద్ద లైబ్రరీ వుంది. సాలార్జంగ్ వాడు ఎంతో శ్రీమదమాల కోర్చి వాడొక్కడే సేకరించి సమకూర్చిన గ్రంథాలయం అది... కానీ అందులో ముచ్చటికి ఒక్కటుంటే ఒక్కటి వాడు స్వయంగా కొన్న పాపాన పోలేదు... అన్నీ కొట్టేసిన బాపతులే... ''గ్రంథచౌర్యం'' చేసేవాళ్ళు కొందరయితే ''చోర గ్రంథాలయాలు'' నెలకొల్పే వాళ్ళు కొందరు... ఇహా! ఇంకో జాతుంది వాళ్ళు లైబ్రరీల్లోంచి పుస్తకాలు 'దొబ్బేసి'' ఫుట్‌పాతులమీద కారుచౌకగా అమ్మేస్తూ వుంటారు... వీళ్లని క్షమించడమంత బుద్ధితక్కువ మరొకటి లేదు. అందుకే పుస్తకం, వనితా, విత్తం... అరువివ్వకండ్రా నాయనల్లారా అని మొత్తుకుంటోంది శాస్త్రం... వింటే మంచిదీ!












Click it and Unblock the Notifications