తనికెళ్ల భరణి 'సామాన్య సూక్తం' : సహగమనం

రోడ్డెక్కాలంటే గుండె దడదడలాడుతోంది. ఏ లారీవాడు వెనకనుండి గుద్దేస్తాడో అని... అబ్బబ్బ ఏం జనం ఏం జనం యముడి వాహనాల్లాంటి బస్సులు... లారీలు... గౌడు గేదెల్లాంటి మోటారుసైకిళ్ళు... ఆంబోతుల్లాంటి ఆటోలు... వీటిన్నటిమధ్య సాధుజంతువుల్లాంటి సైకిళ్ళు... ఎవడు ఎప్పుడు దేనికింద పడి ఏమౌతాడో తెలీదు... స్పీడ్‌! యమ స్పీడ్‌! పరుగు! పిచ్చి పరుగు... మనం తొందరగా వెళ్ళాల్సినమాట నిజమే గావొచ్చు గానీ తొందరగా 'పోవాల్సిన' అవసరం లేదుగా.

వెనకటికి పురాణాల్లో చినుక్కీ చినుక్కీ మధ్యనించి అశ్వాల్ని దౌడు తీయించేవారట ఆ జాతికి చెందినవాళ్ళే అనుకుంటా ఆటోవీరులు... రెండు బస్సుల మధ్యనించి, ఒక రెండులారీల మధ్యనించి, ఇద్దరు స్నేహితుల మధ్యనించి... ఒక 'జంట' మధ్యనించి బాణాల్లా దూసుకుపోతారు... అంచేతే ఆటో ఎక్కినప్పుడల్లా కళ్ళు గట్టిగా మూసుకుని గుండెని గుప్పిట్లో పట్టుకుని ప్రయాణించాల్సి వొస్తోంది.

Tanikella Bharani

ఇక రోడ్లమధ్య నిర్విచారంగా మెల్లిగా... హాయిగా కన్నులరమోడ్చి నడిచే గోమాతలు, నడిరోడ్డుమీద సభ జరుపుకునే వృషభరాజాలు... అబ్బే ఎవరూ వాటిని పట్టించుకోరు అవి అంతకన్నా ఎవర్నీ పట్టించుకోవు.

స్కూలొదిలాక చిన్న చిన్న పిల్లలు స్కూలు యూనిఫారాల్లో చిన్ని చిన్ని అడుగులేసుకుంటూ రోడ్లను దాటే దృశ్యం చూస్తే గుండెలు పీచుపీచుమంటాయి. ట్రాఫిక్‌ రూల్సంటే మనవాళ్లకు బొత్తిగా గిట్టవ్‌గాబోలు రోడ్డుమధ్యన చెమట్లు కక్కుతూ ఎక్సర్‌సైజ్‌ చేసే ట్రాఫిక్‌ పోలీసుని పట్టించుకునే నాథుడే కనిపించడు. ఇకపోతే మోటారుసైకిళ్ళమీద అమ్మాయిల్ని ఆకర్షించడానికి సర్కస్‌ఫీట్లు చేసి నడ్డి పగలగొట్టుకునే కుర్రహీరోలు... లారీవాళ్ళు సరేసరి! పాపం! వాళ్ళకి రోడ్డుకీ ఫుట్‌పాత్‌కీ డిఫరెన్స్‌ తెలీదు... సూటిగా దూసుకుపోవడం ఒక్కటే వాళ్ళకొచ్చిన విద్య. ఇవి చాలక ఒకే కూడలిలో అరడజను సినిమా థియేటర్లు.

అసలు మనుషులు ఫుట్‌పాత్‌లమీదా వాహనాలు రోడ్లమీద ప్రయాణించవలెనని శాస్త్రం ఘోషిస్తున్నా... ఫుట్‌పాత్‌లమీద పచారీ దుకాణములు వగైరాలు వుండుటచే అందరూ కలిసి రోడ్లమీదే పడ్తో, లేస్తో, చస్తో... 'సహగమనం' చేస్తున్నాం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+