వారం వారం తణికెళ్ల భరణి 'ప్రత్యేకం'
తణికెళ్ల భరణి గురించి తెలియని తెలుగువారుండరు. తెలుగు సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పండిస్తున్న తణికెళ్ల భరణిని తెలుగు ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ప్రాథమికంగా ఆయన రచయిత. తెలుగు అక్షరాలను మాలగా అల్లి, సున్నితమైన భావాలను మనకు అందిస్తుంటారు. ఆయన భాషలో, భావం శిరీష కోమలంగా వ్యక్తమవుతూ ఉంటుంది. భాష పరీమళం తెలిసిన రచయిత ఆయన.
ఆయన అన్నింటికన్నా ముఖ్యంగా మానవతావాది. మానవులందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటారు. ఆయన రచనల్లో అదే వ్యక్తమవుతూ ఉంటుంది. ఆయనకు సాహిత్యంపై తెగ మక్కువ. తన మక్కువను వ్యక్తం చేసుకోవడానికి ఆయన ఏటేటా శ్రీశ్రీ అవార్డును కూడా ఓ ప్రముఖ తెలుగు రచయితకు ప్రదానం చేస్తూ వస్తున్నారు.
సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా తన సాహితీ సాన్నిహిత్యాన్ని ఆయన మరిచిపోరు. అహంకారం, ఆధిపత్య ధోరణి లేని వ్యక్తిత్వం ఆయనది. ఆయన రచనల్లో ఆ వ్యక్తిత్వం వ్యక్తమవుతూ ఉంటుంది. ఆయన చిన్న చిన్న విషయాలను తీసుకుని సమాజంలోని దుర్నీతిపై తన పదునైన అక్షరాలతో కత్తులు దూస్తారు.
వన్ ఇండియా తెలుగు కోసం ఆయన ప్రత్యేకంగా తన రచనలను అందించారు. ఆయన ఈ రచలను వన్ ఇండియా తెలుగుకు ప్రత్యేకం. ఆ రచనల్లో ఆయన మానవతావాదిగా ఎలా దర్శనమిస్తారో, సామాజిక ప్రయోజనాన్ని ఎలా కోరుకుంటారో అర్థమవుతుంది. ఆయన రచనలను చదివితే అందరికీ ఆనందంతో పాటు సమాజం పట్ల కాస్తో కూస్తో నిబద్ధత పెరుగుతుందనే అనుకుంటున్నాం. ఆయన రాసిన రచనలతో వారం వారం తెలుగు పాఠకులకు విందు చేయాలని అనుకుంటున్నారు. ప్రతి బుధవారం ఆయన రచనను ఒక్కటి ఇక్కడ చదవవచ్చు. ఇది అసమాన్యుడి సామాన్య సూక్తం...













Click it and Unblock the Notifications